రావణుడు త్రిలోకాలను జయించుట

కుబేరుడు ఇద్దరు మంత్రులను, శుక్ర, ప్రొష్టుడూ అనే వాళ్ళను వెంట బెట్టుకుని రావణుడి వద్దకు వచ్చి, “ఓరీ దుర్మార్గుడా, నేనెంత చెప్పినా నీ చెవికెక్కలేదు. అజ్ఞానం చేత విషం తాగిన వాడికి దాని ఫలితం పొందేటప్పుడు గాని జ్ఞానం రాదు. నీ అజ్ఞానం నీవు గ్రహించటం లేదు. నరకం అనుభవించేటప్పుడు తెలుసుకుంటావు. నీతో మాట్లాడటం వృథా,” అన్నాడు.

తరువాత అన్నదమ్ములిద్దరికీ ద్వంద్వ యుద్ధం జరిగింది. కుబేరుడు తనపైన ప్రయోగించిన అస్త్రాలన్నిటికీ విరుగుడు చేసి, రావణుడు మాయా యుద్ధం సాగించాడు. కుబేరుడికి అనేక రకాల రూపాలు కానవచ్చాయి గాని, ఎక్కడా రావణుడి రూపం కనబడలేదు. ఆ స్థితిలో రావణుడు గదతో కుబేరుడి తలపైన బలంగా కొట్టి, కింద పడగొట్టాడు. రక్తం కారుతూ పడి ఉన్న కుబేరుణ్ణి నిధుల అధిదేవతలు నందనవనానికి చేర్చి, చికిత్సలు చేశారు.

ఈ విధంగా రావణుడు కుబేరుడి పై విజయం సాధించి, పుష్పక విమానాన్ని తీసుకుని, దానిలో ఎక్కి శరవణానికి వెళ్ళాడు. ఆ కొండ బంగారం రంగులో వెలిగిపోతూ రెండో సూర్యుడిలాగా ఉన్నది. దాని పైకి వచ్చేసరికి పుష్పకం గమనం మాని ఆకాశంలో నిలిచిపోయింది.

అది చూసి రావణుడు, “కోరిన ప్రకారం నడిచే ఈ విమానం ఎందుకిలా ఆగిపోయి ఉంటుంది?” అని వెంట ఉన్న తన మంత్రులను అడిగాడు.

ఇంతలోనే, ఈశ్వరుడి పార్శ్వచరుడూ, మహాబలుడూ అయిన నంది రావణుడితో, “దశగ్రీవా, వెంటనే వెనక్కు వెళ్ళిపో, ఈ పర్వతం మీద శివుడు క్రీడిస్తున్నాడు. సువర్ణులూ, నాగులూ, యక్షులూ, దైత్యులూ, దానవులూ, రాక్షసులూ, ఏ ఇతర ప్రాణులూ ఈ పర్వతం మీదికి రారాదు,” అన్నాడు.ఈ మాటలు వినగానే రావణుడు ఆగ్రహావేశంతో చలించిపోతూ, “శంకరుడెవడు ?” అంటూ విమానం దిగి కొండ కిందికి వచ్చాడు. అక్కడ అతనికి శివుడూ, ఆయనకి కొద్ది దూరంలో శూలం పట్టుకుని, రెండవ శివుడిలాగా నిలబడి ఉన్న నందిశ్వరుడూ కనిపించారు. నందీశ్వరుడి వానర ముఖం చూసి రావణుడు మేఘం గర్జించినట్టుగా పగలబడి నవ్వాడు.

అపర శంకరుడైన నంది రావణుడి నవ్వుకు కోపించి, “నా కోతి ముఖం చూసి నవ్వావు గనక, నా రూపమే కలిగి, నాతో సమానమైన శక్తి గల వానరులు నిన్నూ, నీ కులాన్నీ తప్పక నిర్మూలిస్తారు,” అని శపించాడు.

రావణుడు నిర్లక్ష్యంగా పర్వతాన్ని సమీపించి నందితో, “నా విమానాన్ని ఆపిన ‘ఈ పర్వతాన్నే ఇప్పుడు పెల్లగించేస్తాను. నేను భయంకరుణ్ణని తెలియదు లాగుంది,” అంటూ తన చేతులను పర్వతం కిందికి దూర్చి ఆ పర్వతాన్ని ఎత్తసాగాడు. పర్వతం సంచలించి పైకి లేచింది.

శివుడిదంతా చూసి చిరునవ్వు నవ్వి తన కాలి బొటనవేలితో పర్వతాన్ని కొద్దిగా నొక్కాడు. దానితో రావణుడి చేతులు కొండ కింద చిక్కుకుని నలిగాయి. ఆ బాధకు రావణుడు మహా దారుణంగా ఆక్రోశించాడు. రావణుడి మంత్రులు నిర్ఘాంతపోయారు. వాళ్ళు రావణుడితో, “రాజా శంకరుణ్ణి తృప్తి చెయ్యి. ఆయన తప్ప మరే దిక్కూ కనబడదు. ఆయనను స్తోత్రం చెయ్యి,” అని సలహా ఇచ్చారు. రావణుడు బాధతో ఏడుస్తూనే శివుణ్ణి స్తోత్రం చేశాడు.

చివరకు శివుడనుగ్రహించి, రావణుడి చేతులను కొండ కింది నుంచి తీసుకోనిచ్చి, “నీ వీర్యమూ, మదమూ, స్తోత్రమూ చూసి సంతోషించాను. నీ చేతులు నలిగినప్పుడు నీవు చేసిన దారుణమైన ధ్వనిని బట్టి ఇక ముందు నీకు రావణుడనే పేరు సార్థకంగా ఉంటుంది. ఇక నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు,” అన్నాడు.

అప్పుడు రావణుడు, “మహాదేవా, నీకు నాపై తృప్తి కలిగిన పక్షంలో నేను కోరేది అనుగ్రహించు. నేనిదివరకే దేవతలు మొదలైన వారి చేత చావు లేకుండా వరం పొంది ఉన్నాను. అల్పులైన మానవులను నేనసలు లక్ష్యపెట్టను. బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయువు కూడా ఇచ్చాడు. నేను నీ నుంచి మిగిలిన నా ఆయువునూ, ఒక ఆయుధాన్నీ వేడుతున్నాను. దయచేసి వాటిని అనుగ్రహించు,” అన్నాడు.

శివుడు రావణుడికి, ఆయుశ్శేషాన్నీ, చంద్రహాసమనే ఖడ్గాన్నీ ఇస్తూ, “ఈ ఖడ్గాన్ని ఎన్నడూ అవమానించకు. ఏనాడు దీనికి అవమానం జరిగితే అది అప్పుడే నిశ్చయంగా నా దగ్గిరికి తిరిగి వస్తుంది,” అన్నాడు.

ఈ విధంగా శివుడి చేత వరాలు పొంది, రావణుడు తన పుష్పకం ఎక్కి భూమి అంతటా సంచరిస్తూ, వీరులైన రాజులందరినీ క్షోభపెట్టాడు. పరాక్రమ సంపన్నులు అతనితో యుద్ధాలు చేసి నశించారు. తెలివి గలవాళ్ళు అతన్ని గెలవలేమని తెలుసుకుని, ఓటమి ఒప్పుకుని, అతనికి లొంగిపోయారు.

అలా లోకసంచారం చేస్తూ రావణుడొకసారి హిమాలయానికి వెళ్ళి, అక్కడ ఒక దేవస్త్రీ లాటి రూపవతిని చూశాడు. ఆమె ఋషుల లాగా కృష్ణాజినమూ, జటావల్కలాలూ ధరించి తపోదీక్షలో ఉన్నది. రావణుడామె సౌందర్యానికి సమ్మోహితుడై, సరదాకు అడుగుతున్నవాడిలాగా, “సుందరీ, ఈ యవ్వనంలో తపస్సు పెట్టుకున్నావేమిటి? నీ అందం చూసి పురుషులు సమ్మోహితులవుతారు గదా! ఎందుకీ కఠిన వ్రతం ?” అని అడిగాడు.

ఆమె రావణుడికి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది:

“బృహస్పతి కొడుకైన కుశధ్వజుడు నా తండ్రి. నా పేరు వేదవతి. అనేకమంది దేవతలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ మా తండ్రి వద్దకు వచ్చి, నన్ను తమ కిచ్చి పెళ్ళి చెయ్యమని కోరారు. కాని మా తండ్రి ఒప్పుకోలేదు. కారణ మేమిటంటే, ఆయనకు విష్ణుమూర్తినే తన అల్లుడుగా చేసుకోవాలనే కోరిక ఉండేది. ఈ సంగతి తెలిసి దంభుడనే రాక్షసుడు, ఒక రాత్రి మా తండ్రి నిద్రపోతుండగా వచ్చి, ఆయనను చంపేశాడు. మా అమ్మ ఆయనతోబాటు సహగమనం చేసింది. నేను మా తండ్రి కోరికను పూర్తిచేసే ఉద్దేశంతో విష్ణువునే నా భర్తగా మనసులో భావించుకుని తపస్సు చేస్తున్నాను. కనక, రావణా, ఇక నీవు వెళ్ళవచ్చు.”

ఈ మాటలు విని రావణుడు మోహావేశపరుడై విమానం నుంచి దిగి, “అమ్మాయీ, పొగరెక్కి నీ మనస్సు వికటించింది. లేకపోతే త్రిలోక సుందరివై ఉండి, నీ యవ్వనమిలా పాడుచేసుకుంటావా? నేను దశగ్రీవుణ్ణు, లంకాధిపతిని. నా భార్యవై సమస్త భోగాలూ అనుభవించు. విష్ణువు ఎవడు? నా కున్న తపస్సూ, భోగాలూ, బలమూ వాడి కున్నాయా ?” అన్నాడు.

“నీ కేమాత్రమైనా బుద్ధి ఉంటే విష్ణువును గురించి అలా చులకనగా మాట్లాడవు,” అన్నది వేదవతి.

వెంటనే రావణుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు. వేదవతి కోపావేశంతో తన చేతులను కత్తులులాగా చేసి తన జుట్టును కోసేసింది. తన క్రోధాగ్నితో రావణుణ్ణి దహించేదానిలాగా అయిపోయి, ఆ వేదవతి అగ్నిని ప్రజ్వలింపజేసి, రావణుడితో, “నీచుడా, నీ చేత అవమానించబడి ఇక జీవించను. ఈ అగ్నిలో పడి ప్రాణాలు వదిలి, నిన్ను చంపటానికి అయోనిజను గానూ, పతివ్రతగానూ పుట్టి తీరుతాను,” అంటూ అగ్నిలో దూకేసింది. ఆ వేదవతే సీతగా పుట్టి, జనకుడి ఇంట పెరిగి, రాముడికి భార్య అయి, రాముడి బలంతో రావణుడి చావుకు కారకురాలు అయింది.

వేదవతి అగ్నికి ఆహుతి అయిపోయాక రావణుడు తిరిగి పుష్పకం మీద లోకపర్యటన చేస్తూ, మరుత్తమహారాజు దేవతలను దగ్గర పెట్టుకుని, యజ్ఞం చేస్తున్న చోటికి వచ్చాడు. బృహస్పతి తమ్ముడైన సంవర్తుడు యజ్ఞం చేయిస్తున్నాడు. రావణుణ్ణి చూస్తూనే అక్కడ చేరిన దిక్పాలకులు భయభ్రాంతులై మారు రూపాలు ధరించారు. ఇంద్రుడు నెమిలి అయాడు, యముడు కాకిగా మారాడు, కుబేరుడు తొండ రూపాన్నీ, వరుణుడు హంస రూపాన్నీ ధరించారు. మిగిలిన దేవతలు తలా ఒక జంతువు రూపమూ పొందారు.

అంతలో రావణుడు నిస్సంకోచంగా యజ్ఞవాటికలో జొరబడి, మరుత్తును చూసి, “యుద్ధం చేస్తావా ? ఓడానని ఒప్పుకుంటావా ?” అని అడిగాడు.

“నువ్వెవరు?” అని మరుత్తుడు రావణుణ్ణి అడిగాడు.

రావణుడు పెద్దగా నవ్వి, “భేష్, రావణుణ్ణి కూడా నీ వెరగవు! నా బలపరాక్రమాలను గురించి ఎరగనివాడు మూడు లోకాలలోనూ మరొకడు ఉంటాడనుకోను. నా అన్నను జయించి నేనీవిమానం కాజేశాను,” అన్నాడు.

ఆ మాట విని మరుత్తు మండిపడుతూ, “తండ్రి లాటి అన్ననే జయించిన నీవెంత ఘనుడవు! అటువంటి దుర్మార్గం చేసినందుకు గర్వపడుతున్నావా? కొంచెం ఆగు, నా బాణాలతో నీ ప్రాణాలు తీస్తాను,” అని లేచి వెళ్ళి ధనుర్బాణాలు తీసుకున్నాడు.

అప్పుడు మరుత్తమహారాజుకు సంవర్తుడడ్డుపడి, “రాజా, తొందర పడక నేను చెప్పేది విను. ఈ మహేశ్వర యజ్ఞం మధ్యలో విఘ్నం అయితే వంశ నాశనం జరుగుతుంది. యజ్ఞ దీక్షలో ఉన్న నీవు ఆగ్రహించట మేమిటి ? యుద్ధం చెయ్యట మేమిటి? అది అలా ఉంచి, యుద్ధంలో ఈ రాక్షసుణ్ణి ఎలా జయిస్తావు? వాడు దుర్జయుడు!” అన్నాడు.

గురువు చెప్పిన మాట విని మరుత్తు ధనుర్బాణాలు వదిలేసి తిరిగి యజ్ఞదీక్షలో కూర్చున్నాడు. అది చూసి రావణుడి మంత్రి అయిన శుకుడు సంతోషంతో, ” రావణుడిదే గెలుపు!” అని పెద్దపెట్టున కేకలు పెట్టాడు. రావణుడు యజ్ఞవాటికలో ఉండే ఋషులను తిని తృప్తి చెంది, తన దారిన తాను వెళ్ళాడు.

తరవాత దిక్పాలకులు తమ నిజరూపాలు ధరించి, తాము ఏయే ప్రాణుల రూపాలు ధరించారో వాటికి వేరు వేరుగా వరాలిచ్చారు.

అప్పటి దాకా నెమళ్ళు నల్లగా ఉండేవి, ఇంద్రుడు వాటికి అనేక రంగులుండేటట్టూ, తన వెయ్యి కళ్ళూ వాటి పింఛా లలో అలంకారంగా ఉండేటట్టూ, వాటికి పాముల భయం లేకుండా ఉండేటట్టూ, ఇంద్రుడు పంపే వర్షం వాటికి ఆహ్లాదం కలిగించేటట్టూ వరమిచ్చాడు.

అలాగే యముడు కాకులకు ఏ రోగమూ లేకుండానూ, వాటికి సహజ మృతి లేకుండానూ, కాకుల కడుపు నిండితే తన లోకంలో ఉండే పితృదేవతల కడుపులు నిండేటట్టూ వరమిచ్చాడు.

వరుణుడు హంసలకు నురుగు లాటి దేహకాంతీ, జలజీవనమూ, సుఖప్రదమైన జీవితమూ ఇచ్చాడు. కుబేరుడు తొండలకు బంగారు వర్ణం ఇచ్చాడు.

రావణుడు లోకమంతా తిరుగుతూ మరుత్తమహారాజును అడిగినట్టే, గొప్ప గొప్ప రాజులందరి వద్దకూ వెళ్ళి, ” నాతో యుద్ధం చేస్తావా ఓడినట్టు ఒప్పుకుంటావా?” అని అడుగుతూ వచ్చాడు.దుష్యంతుడూ, సురధుడూ, గాధీ,గయుడూ, పురూరవుడూ మొదలైన రాజులందరూ రావణుడికి ఓడినట్టు ఒప్పుకున్నారు. అయోధ్యను పాలిస్తూ ఉండిన అనరణ్య మహారాజు మటుకు రావణుణ్ణి యుద్ధానికి రమ్మన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అనరణ్యుడి సేనలు కార్చిచ్చులో నల్లులు మాడినట్టు మాడి చనిపోయారు.ద్వంద్వ యుద్ధంలో అనరణ్యుడి బాణాలు రావణుణ్ణి ఏమీ చెయ్యలేక పోయాయి. రావణుడు తన నెత్తిన చేతితో చరిచేసరికి అనరణ్యుడు రధం నుంచి కిందికి పడిపోయి,ప్రాణాలు విడుస్తూ, తన ఇక్ష్వాకు వంశంలో పుట్టబోయేవాడి చేతిలో రావణుడు చస్తాడని శపించాడు.

రావణుడీ విధంగా గగన విహారం చేస్తూ, మానవ జాతిని మహా భయపెడుతూ తిరుగుతుండగా ఒకనాడతని పుష్పకానికి ఎదురుగా నారద మహాముని మబ్బుల మీదుగా వస్తూ ఎదురయాడు. ఇద్దరూ ఆగి మాట్లాడుకున్నారు.

“నాయనా, రావణా! నీ బలపరాక్రమాలు చూసి ఎంతో సంతోషించాను. కాని ఒకటి నాకు నచ్చలేదు. దేవతల వల్ల కూడా చావు లేని నీవు అల్పులైన మానవుల మీద నీ ప్రతాపం చూపిస్తావేమిటి? మానవులు అనేక వ్యసనాలతోనూ, రోగాలతోనూ, క్షణంలో వచ్చిపడే వార్థక్యంతోనూ, రకరకాల కష్టాలతోనూ తీసుకుంటూ ఉంటారుగదా, అలాటి వాళ్ళతో వీరుడెవడైనా యుద్ధానికి తలపడతాడా ? వాళ్ళందరినీ యముడు చంపుతూనే ఉన్నాడు. ఆ యముడితో యుద్ధం చెయ్యి, అతణ్ణి చంపు. యముణ్ణి చంపితే నరలోకమంతా జయించినట్టే గద,” అన్నాడు నారదుడు.

“అయ్యా, నారద ! నేను ముందు పాతాళాన్నీ, తర్వాత స్వర్గాన్నీ జయించి, మూడు లోకాలనూ, స్వాధీన పరచుకుని, తరువాత సముద్రాన్ని మధించి, అమృతం సంపాదించే ఆలోచనలో ఉన్నాను,” అన్నాడు రావణుడు.

“ఈ పక్కనే ఉన్న యమలోకాన్ని వదిలి ఇంకెక్కడికో పోతానంటావేమిటి ? నీవిప్పుడు వెళ్ళే దారే అది,” అన్నాడు నారదుడు.

రావణుడు కాలమేఘం మెరిసినట్టుగా నవ్వి, ” చాలా బాగా చెప్పావు, నారదా. మంచి సంతోషకరమైన మాట. నేనిప్పుడే యమలోకానికి పోతాను. అసలు దిక్పాలకులను నలుగురినీ జయించాలని అదివరకే ప్రతిజ్ఞ పట్టాను. ఇప్పుడు వెళ్ళి, అన్ని ప్రాణులకూ మరణభయం కలిగించే ఆ యముడి ప్రాణాలు తీస్తాను.” అని నారదుడికి నమస్కారంచేసి శలవు పుచ్చుకుని, తన మంత్రులతో సహా దక్షిణ దిక్కుగా బయలుదేరాడు.

అన్ని ప్రాణులను చంపే యముడికి చావనేది ఎలా కలుగుతుందో నారదుడికి కొంచెం కూడా అర్థంకాలేదు. ఆ యముణ్ణి రావణుడు ఎలా జయిస్తాడో కళ్ళారా చూడాలని కుతూహలం పుట్టి నారదుడు కూడా యమపట్టణానికే బయలుదేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *