రావణుడు యముడితో యుద్ధం చెయుట

యముడితో యుద్ధానికి బయలుదేరిన రావణుడు యమలోకాన్ని చేరవచ్చి, అక్కడ నరకయాతనలను అనుభవిస్తున్న పాప కర్ములనూ, స్వర్గ సుఖాలననుభవిస్తున్న పుణ్యకర్మలనూ చూశాడు. ఘోరాకారులూ, క్రూరులూ అయిన యమకింకరులు పాపులను పురుగుల చేత తినిపిస్తున్నారు, కుక్కలచేత కరిపిస్తున్నారు, వైతరణీ నదిలో ఈదిస్తున్నారు, కాలిన ఇసుక దిబ్బల మీద వేసి బాధిస్తున్నారు. నరకయాతన అనుభవించేవారు శవాలలాగా ఉండి, బాధతోనూ, దప్పికతోనూ అలమటిస్తున్నారు. మరొకవంక పుణ్యం చేసుకున్నవారు పుణ్యఫలాన్ని సమస్త సుఖాల రూపంలోనూ అనుభవిస్తున్నారు.

రావణుడు లక్షలాదిగాగల పాపులు అనుభవించే యాతనలను చూసి జాలిపడి, వారిని విడిపించనారంభించాడు. అది చూసి యమదూతలకు కోపం వచ్చింది. వాళ్ళు రావణుడిపైకి వెళ్ళి, పరిఘలూ, శూలాలూ, ముసలాలూ, శక్తులూ, తోమకాలూ పుష్పకం మీదికి విసిరారు. కొందరు తేనెటీగల్లాగా పుష్పకం మీదికి ముసిరి, అందులోని ఆసనాలూ, వేదికలూ, మంటపాలూ విరిచి పారెయ్యసాగారు. అయితే అదీ అక్షయమైన విమానం కావటం చేత, వారెంత నాశనం చేసినా ఎప్పటిలాగే చెక్కుచెదరకుండా ఉన్నది.

ఈలోపుగా నారదుడు తిన్నగా యముడి వద్దకు వెళ్ళాడు. యముడాయనను అర్ఘ్యపాద్యాలతో సత్కరించి, క్షేమమడిగి, వచ్చిన పని తెలుసుకోగోరాడు.

“యమరాజా, దశగ్రీవుడనే అజేయు డైన రాక్షసుడు నిన్ను జయించి, వశపరుచు కోవటానికి నీ పైకి యుద్ధానికి వస్తున్నాడు. నీ యమదండం ఏం కానున్నదో!” అన్నాడు నారదుడు. ఆయన అలా అంటుండగానే దూరాన వెలిగిపోతూ పుష్పకం కనబడింది.

రావణుడు యమకింకరులతో కొంతసేపు యుద్ధం చేసి, చివరకు వారిపైన పాసుపతాస్త్రం ప్రయోగించాడు. అది కార్చిచ్చులాగా ఆ ప్రాంతాన ఉండే చెట్లనూ, పొదలనూ బూడిద చేస్తూ, తన జ్వాలలను అన్ని వైపులకూ వ్యాపింప జేసింది. యమదూతలు ఆ జ్వాలలో మిడతల్లాగా మాడిపోయారు. రావణుడూ, అతని మంత్రులూ దిక్కులు పిక్కటిల్లేటట్టు భయంకరమైన కేక పెట్టారు.

ఆ కేక విని యముడు, యుద్ధంలో రావణుడు జయించాడని గ్రహించి, తను సారధిని పిలిచి, తన రధాన్ని యుద్ధానికి ఆయత్తపరచమన్నాడు. క్షణంలో ఎర్రని గుర్రాలు పూన్చిన రధం వచ్చింది. మృత్యు దేవత పాశాన్నీ, ముద్గరాన్ని ధరించి, రధంలో యముడి ముందు నిలిచింది. యముడు రథంలో ఎక్కి కూర్చుంటే ఒక పక్కన కాలదండమూ, రెండోపక్క కాలపాశాలూ ఉన్నాయి. ఈ విధంగా యముడు యుద్ధానికి బయలుదేరే సరికి, మూడు లోకాలూ సంక్షోభం పొందాయి, దేవతలు కంపించారు.

మనోవేగం గల రథాశ్వాలు యముడి రథాన్ని క్షణంలో రావణుడి ముందుకు  తెచ్చాయి. మృత్యుదేవతతో సహా అతి భయానకంగా ఉన్న యమరథాన్ని చూస్తూనే రావణుడి మంత్రులు భయ విభ్రాంతులై, నాలుగు దిక్కులకూ పారిపోయారు. రావణుడు మాత్రం లేశమాత్రమైనా భయపడక, స్థిరంగా నిలబడ్డాడు. ఇద్దరికీ ఏడు రాత్రుల పాటు మహా భయంకరమైన యుద్ధం జరిగింది. యముడు తాను ప్రయోగించిన అస్త్రాలతో రావణుణ్ణి మహా తీవ్రంగా గాయపరిచాడు, కాని రావణుడు ఓడిపోనూలేదు, రణరంగం నుంచి పారిపోనూ లేదు. మీదు మిక్కిలి అతను తన బాణాలతో యముణ్ణి, మృత్యు దేవతనూ, సారధినీ కూడా ఎంతో నొప్పించాడు.

అది చూసి మృత్యువు యముడితో, ” యమధర్మరాజా, ఈ రాక్షసుడితో నన్ను యుద్ధం చెయ్యనీ. వీణ్ణి క్షణంలో చంపేస్తాను. చంపటం నా హక్కు. నేను ఎందరో రాక్షసుల చావు చూశాను, ప్రళయకాలంలో లోకాలకు లోకాలే నాశనం కావటం చూశాను. ఇతడనగా ఎంత?” అన్నది.

“నువు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపుతాను,” అంటూ యముడు కాల దండాన్ని పట్టి ఎత్తాడు. అది మంటలు కక్కుతూ మహా భయంకరంగా కనబడింది. యముడు దాన్ని రావణుడి పైకి విసరబోతూ వుండగా బ్రహ్మ ప్రత్యక్షమై, “యమధర్మరాజా, దాన్ని ప్రయోగించకు. దీనితో రావణుడు చచ్చినట్టయితే నేను వీడికిచ్చిన వరం అబద్ధమవుతుంది. వాడు చావనట్టయితే ఈ కాలదండాన్ని నేను సృష్టించిన ఉద్దేశం అబద్ధమవుతుంది. మృత్యువుతో బాటు నేనీ దండాన్ని అమోఘంగా ఉండే లాగు పూర్వం సృష్టించాను. అందుచేత, కాలదండాన్ని రావణుడిపైన ప్రయోగించావంటే, ఒక విధంగా కాకపోతే మరొక విధంగా  నా మాట వ్యర్థమైపోతుంది,”అన్నాడు.

బ్రహ్మ మాట మన్నించి యముడు ఆ కాలదండాన్ని అవతల పెట్టేశాడు. రావణాసురుణ్ణి చంపటానికి తనకు అవకాశం లేనిపక్షంలో తాను యుద్ధరంగంలో ఏం చెయ్యాలో తెలియక, యముడు తన రథంతో సహా అంతర్థానమై బ్రహ్మతో స్వర్గానికి వెళ్ళిపోయాడు.

రావణుడు తాను యముణ్ణి జయించానని ప్రకటన చేసి పుష్పకంలో యమపురం వెళ్ళిపోయాడు. ఇదంతా కళ్ళారా చూసిన నారదుడు పరమానందం చెందాడు.

యముణ్ణి జయించి, మారీచుడు మొదలైన మంత్రుల చేత ప్రశంసలందుకుని, రావణుడు పుష్పకంలో పాతాళ లోకానికి బయలుదేరి, వరుణుడి పరిపాలనలో ఉన్న సముద్రంలో ప్రవేశించి, వాసుకి మొదలైన నాగులుండే భోగవతీ నగరాన్ని స్వాధీనం చేసుకుని, నివాతకవచులుండే మణిమతి అనే నగరానికి వెళ్ళాడు. రకరకాల ఆయుధాలు కలిగి, అజేయులైన నివాతకవచులు రావణుడితో యుద్ధానికి తలపడ్డారు.

ఒక్క సంవత్సరం పాటు యుద్ధం సాగినా జయాపజయాలు తేలలేదు. అప్పుడు బ్రహ్మ విమానంమీద అక్కడికి వచ్చి, ఉభయ పక్షాలకూ సంధి చేసి, అగ్నిసాక్షిగా వారి మధ్య స్నేహం నెలకొల్పి వెళ్ళిపోయాడు. రావణుడు నివాతకవచులకు ఏడాది పాటు అతిథిగా ఉండి, తన సొంత నగరంలో ఉన్నట్టే సుఖంగా కాలం పుచ్చి, నివాతకవచుల వద్ద, తనకు తెలియని మాయలు తొంభైతొమ్మిది నేర్చుకుని, వరుణుడుండే నగరాన్ని వెతుకుతూ, బయలుదేరాడు.

దారిలో అతనికి కాలకేయులుండే అశ్మనగరం తగిలింది. అక్కడ రావణుడికీ కాలకేయులకూ యుద్ధమయింది. రావణుడు కాలకేయ వీరులను చాలామందిని చంపాడు. అలా చచ్చిన వారిలో విద్యుజ్జిహ్వుడనేవాడు, శూర్పణఖ భర్త కూడా ఉన్నాడు. వాడు బలగర్వితుడు, మెరుపు లాగా తన నాలుకను చాచి రాక్షసులను నాకేశేవాడు. రావణుడు వాణ్ణి కత్తితో నరికి చంపాడు. మొత్తం మీద నాలుగు వందల మంది కాలకేయవీరులు రావణుడి చేతిలో చచ్చారు.

అక్కడి నుంచి బయలుదేరి రావణుడు వరుణుడి మందిరానికి వచ్చాడు. ఆ భవనం తెల్లని మబ్బులాగానూ, కైలాసంలాగానూ ఉంది. అక్కడ అనుక్షణమూ పాలధారలు స్రవించే సురభి అనే కామధేనువు రావణుడికి కనబడింది. దాని పాలతోనే పాల సముద్రం ఏర్పడింది. ఆ పాలసముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు, అమృతం పుట్టింది. పాలసముద్రపు నురుగు తిని కొందరు మహర్షులు జీవిస్తారు. శివుడికి వాహనమైన నంది కామధేనువుకు పుట్టినదే. అలాటి కామధేనువుకు రావణుడు ప్రదక్షణం చేసి, వరుణ మందిరాన్ని సమీపించాడు. వరుణుడి యోధులు రావణుడితో యుద్ధం చేశారు. రావణుడు వారి నాయకులను చంపి, యోధులతో, రావణుడు యుద్ధం చెయ్యవచ్చాడని వరుణుడితో చెప్పండి” అన్నాడు.

వరుణుడి కొడుకులూ, మనమలూ తమ పరివారాలతో సహా రథాలెక్కి రావణుడి పైకి వచ్చి, ఒక్క తృటిలో రావణుడి చేతిలోనూ, అతని మంత్రుల చేతిలోనూ ఓడిపోయారు. తమ పరివారం నశించాక వరుణ పుత్రులు వీరోచితంగా పోరాడి, తాము కూడా దెబ్బతిన్నారు. తరువాత రావణుడు వరుణుడికి కబురు చెయ్యగా, వరుణుడు ఇంటలేడనీ, ఆయన సంగీతం వినటానికి బ్రహ్మాలోకానికి వెళ్ళాడనీ తెలిసింది. రావణుడు తాను గెలిచినట్టు ప్రకటన చేసి, పుష్పకం మీద ఎక్కి, తిరిగి అశ్మనగరానికి వచ్చాడు. అక్కడ అతను మద గర్వితుడై విహరిస్తూండగా అతని కొక అద్భుతమైన భవనం కనబడింది. దానికి అలంకారాలుగా వైడూర్య తోరణాలూ, ముత్యాల జాలరులూ, బంగారు స్తంభాలూ, స్ఫటిక సోపానాలూ మొదలైనవి ఉన్నాయి.. రావణుడు ప్రహస్తుడితో, “ఇంత అందమైన ఇల్లెవరిదో కనుక్కునిరా” అన్నాడు.

ప్రహస్తుడు మొదటి ప్రాకారం దాటి లోపలికి వెళితే ఎవరూ కనిపించలేదు. అతను అలాగే ఏడు ప్రాకారాలూ దాటి లోపలికి వెళ్ళేసరికి లోపల ఒక జ్వాల కనిపించింది. దాని మధ్య ఒక దివ్య పురుషుడున్నాడు. ఆయన సూర్యుడి లాగా వెలిగిపోతూ తేరి చూడరాకుండా ఉన్నాడు. ఆ మహాపురుషుడు ప్రహస్తుణ్ణి చూడగానే సంతోషంతో నవ్వాడు. ఆ నవ్వు విని ప్రహస్తుడి శరీరం పులకరించింది. అతను వెంటనే రావణుడి దగ్గరికి తిరిగి వచ్చి, తాను చూసినదంతా తెలిపాడు.

సంగతి వింటూనే రావణుడు పుష్పకం నుంచి దిగి ఆ భవనంలోకి ప్రవేశించబోయేసరికి, ద్వారాన్ని పూర్తిగా ఆక్రమించి ఒక భయంకరాకారుడు ఎదురుపడ్డాడు. ఆ ఆకారం నెత్తిన చంద్రుడున్నాడు, నోట భయంకరమైన జ్వాలలు వెలువడుతున్నాయి, కళ్ళూ, పెదవులూ ఎర్రగానూ, ముఖం తెల్లగానూ ఉన్నాయి, జుట్టు పైకిలేచి ఉన్నది, దట్టమైన మీసాలు, గడ్డము,పెద్ద పెద్ద కోర లున్నాయి, చేతిలో పెద్ద ముద్గరమున్నది. ఆ భయంకరాకారాన్ని చూడగానే రావణుడి శరీరమంతా జలదరించింది. ఆ ఆకారం రావణుణ్ణి చూసి, “రాక్షసుడా, భయపడకు. నీ కోరిక ఏమిటో చెప్పు,” అని అడిగింది.

“నాకు యుద్ధం కావాలి,” అన్నాడు రావణుడు.

“ఎవరితో యుద్ధం చేస్తావు? నాతోనా? బలితోనా?” అని ఆకారం అడిగింది.

“ఈ ఇల్లెవరిదో వారితో చేస్తాను? లేదా, నువ్వెవరితో చెయ్యమంటే వారితోనే చేస్తాను,” అన్నాడు రావణుడు.

“బలి లోపల ఉన్నాడు. కావలిస్తే ఆ మహామహుడితో నిరభ్యంతరంగా యుద్ధం చెయ్యి,” అన్నది ఆకారం.

రావణుడు లోపలికి వెళ్ళి, సూర్యుడి లాగా వెలిగిపోతున్న బలిని తేరి చూడలేక పోయాడు. బలి రావణుణ్ణి తేలికగా ఎత్తి తన తొడ మీద కూర్చోబెట్టుకుని, ” ఏం పని మీద వచ్చావు, బాబూ? నీ కోరిక ఏమిటో తెలిపితే నేను తీర్చుతాను,” అన్నాడు.

“మరేం లేదు, మహానుభావా! నిన్ను పూర్వం విష్ణువు మోసం చేసి నిర్బంధంలో ఉంచాడన్నారు. నిన్ను విడిపించే శక్తి నాకున్నది. అందుచేత ఆ పని చేసి పోదామని వచ్చాను,” అన్నాడు రావణుడు.

“అదా సంగతి? అయితే నీ కొక్క చిన్న విషయం చెప్పాలి. అక్కడ పడి ఉన్న కుండలాన్ని ఒక్కసారి పట్టుకురా,” అన్నాడు బలి. రావణుడు దగ్గిరికి వెళ్ళి చూస్తే ఆ కుండలం ఒక పెద్ద చక్రమంత ప్రమాణంలో ఉన్నది. రావణుడు సునాయాసంగా దాన్ని ఎత్తబోయి పరాభవం పొందాడు. అది కదలలేదు. రావణుడు తన రెండు చేతులతోనూ, బలమంతా ఉపయోగించి కూడా దాన్ని ఏమాత్రం కదల్చలేకపోయాడు.

అది చూసి బలి రావణుణ్ణి దగ్గిరికి పిలిచి, “నువ్వు కదల్చలేకపోయిన ఆ కుండలం మా పూర్వీకుడైన హిరణ్యకశిపుడు చెవికి పెట్టుకున్నటువంటిది. ఆయన ఎవరివల్లా చావు లేకుండా వరాలు పొంది చివరకు నరసింహరూపం దాల్చిన విష్ణువు చేతిలోనే చచ్చిపోయాడు. ఆ విష్ణువునే నువ్వు ద్వారం వద్ద చూశావు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటూ ఉంటాడు,” అన్నాడు.

ఈ మాటలు విని రావణుడు క్రోథంతో ద్వారం వద్దకు వచ్చాడు. అతనికక్కడ ఎవరూ కనిపించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *