రావణుడు లంకను అక్రమించుట

తన మనమలు ముగ్గురూ బ్రహ్మవల్ల వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. భయం తీరిపోయి ఆయన తన మంత్రులైన మారీచ, ప్రహస్త, విరూపాక్ష మహెూదరులను వెంటబెట్టుకుని అట్టహాసంగా బయలుదేరి రావణుడి వద్దకు వచ్చి, అతన్ని కౌగలించుకుని, బాబూ, ఇంత కాలానికి నా కోరిక పండింది. ఏ విష్ణుమూర్తి భయంచేత మేం లంకను విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోయామో ఆ విష్ణుభయం పోయింది, ఎందుకంటే నీవు బ్రహ్మ నుంచి ఉత్తమ వరాలు పొందావు. అసలు లంక మన రాక్షసులదే. దాన్ని బుద్ధిశాలి అయిన నీ సవతి అన్న కుబేరుడు ఆక్రమించి కూర్చున్నాడు.

వీలును బట్టి మంచి మాటలతోనో, లంచం పెట్టి, బలాత్కారంగానో నీవు మీ అన్న వద్ద నుంచి లంకను తిరిగి సంపాదించు. నిక్షేపంగా నీవే లంకకు రాజుగా ఉండు. ఇలా చేశావంటే దిక్కులేకుండా ఉన్న రాక్షసవంశాన్ని ఉద్ధరించిన వాడివవుతావు,” అన్నాడు.

అంతా విని రావణుడు, “అదేమిటి, తాతా? కుబేరుడు మాకు తండ్రితో సమానుడు. నీవిలా అనకూడదు, నేను వినకూడదు,” అన్నాడు. సుమాలి ఇంకేమీ అనలేకపోయాడు. ఆ తరువాత, సుమాలి మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు రావణుణ్ణి ఒంటరిగా పట్టుకుని ఈ విధంగా నూరిపోశాడు.

అబ్బాయీ, నీవు మీ తాతగారితో అన్నమాట భావ్యంగా లేదు. శూరుడైన వాడికి అన్నదమ్ములన్న విచక్షణ ఏమిటి? అన్నదమ్ముల వైరం ఆది నుంచీ వస్తున్నదే. అదితీ, దితీ అక్కచెల్లెళ్ళే. ఇద్దరూ కశ్యపబ్రహ్మకు భార్యలై దేవతలనూ, రాక్షసులను కన్నారు. కాని విష్ణువు రాక్షసులను చావగొట్టి మూడు లోకాలూ దేవతలకు కట్టబెట్టాడు. ఈ లంకే గాక, భూమండలం యావత్తూ ఒకప్పుడు రాక్షసులే అనుభవించారు. మేం నిన్ను కొత్తగా తప్పు పని చెయ్యమని చెప్పటం లేదు. ఈ దుర న్యాయం అదివరకు జరుగుతూ వస్తున్నదే.అందుచేత నేను చెప్పినట్టు చెయ్యి మన వాళ్ళందరూ సుఖపడతారు.”

రావణుడు కొంచెంసేపు ఆలోచించి సరేనన్నాడు. అతను ప్రహస్తుణ్ణి దూతగా కుబేరుడి వద్దకు పంపి, యిలా అడిగించాడు: “అన్నా, ఇప్పుడు నీ అధీనంలో ఉన్న లంక అసలు రాక్షసులది. అందుచేత నీవు లంకను రాక్షసులు కిచ్చేసినట్టయితే ధర్మంగా వర్తించిన వాడివవుతావు, తమ్ముడినైన నా ముద్దు తీర్చిన వాడివి అవుతావు.”

ప్రహస్తుడు వచ్చి ఈ మాటలు రావణుడి తరఫున చెప్పగానే కుబేరుడు రావణుడితో తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “తమ్ముడూ, మన తండ్రి నాకి లంకా నగరాన్నిచ్చినప్పుడక్కడ రాక్షసులెవరూ లేరు. నేనూ, నా యక్షులూ ఇక్కడ ఉంటున్నాం. నా రాజ్యమూ, నా పట్టణమూ, నా ఐశ్వర్యమూ నీది కాదా ? వచ్చి హాయిగా రాజ్య మేలు. ఒక తండ్రి బిడ్డలమైన మన మధ్య తేడాలు దేనికి ?”

ఈ మాటలు చెప్పి ప్రహస్తుణ్ణి పంపేసి, కుబేరుడు పుష్పక మెక్కి తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు.

విశ్రవశుడు కుబేరుడు చెప్పినదంతా విని, “నాయనా నే నొకటి చెబుతాను విను. రావణుడీమాట నాతో అంటే కోప్పడ్డాను. వాడికిప్పుడు వరాలు రావటం చేత ఒళ్ళు తెలియకుండా ఉంది. నీవు మటుకు లంకను విడిచి పెట్టి, కైలాస పర్వతం మీదికి వెళ్ళి, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకో. అక్కడ మందాకినీ నదిలో బంగారు తామర పువ్వులున్నాయి.. ఆ పర్వతం మీద ఎప్పుడూ దేవతలూ, గంధర్వులూ అప్సరలూ, ఉరగులూ, ఉన్నరులూ విహరిస్తూ ఉంటారు. ప్రస్తుతం రావణుడితో వైరం మటుకు పెట్టుకోకు,” అని సలహా ఇచ్చాడు.

కుబేరుడు తండ్రి మాట పాటించి, తన భార్యనూ, బిడ్డలనూ, మంత్రులనూ, పరివారాన్నీ, ధనాన్నీ, వాహనాలనూ వెంటబెట్టుకుని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు.

ప్రహస్తుడు రావణుడి వద్దకు పరమానందంతో వెళ్ళి, “రావణా, లంక ఖాళీ అయింది. కుబేరుడు అక్కడి నుంచి పరివారంతో సహా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మమ్మల్నందరినీ పెట్టుకుని రాజ్యం చెయ్యి,” అన్నాడు.

రావణుడు తన తమ్ములనూ, బలగాన్ని వెంటబెట్టుకుని లంకకు వెళ్ళాడు. అక్కడ అతనికి వైభవంగా రాజ్యాభిషేకం జరిగింది.

రాక్షసులతో క్రిక్కిరిసిన లంకకు కళ వచ్చినట్టయింది. ఇవతల రావణుడు లంకా నగరాన్ని పాలిస్తుంటే అవతల అతని అన్న అయిన కుబేరుడు అలకా నగరాన్ని పాలించసాగాడు.

లంకా రాజ్యాధిపత్యం పొందాక రావణుడు తన చెల్లెలైన శూర్పణఖను కాలకేయ వంశంలో పుట్టిన విద్యుజ్జిహ్వు డనే వాడికిచ్చి పెళ్ళి చేశాడు.

కొంత కాలం గడిచాక రావణుడు వేటకు వెళ్ళి అరణ్యంలో ఒక పెద్దమనిషినీ, ఆయన వెంట ఉన్న ఒక అమ్మాయినీ చూసి, “మీరెవరు? నిర్జనమైన ఈ అరణ్యంలో ఈ పిల్లను వెంటబెట్టుకునిఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు.

దానికా పెద్దమనిషి ఇలా చెప్పాడు:

“నాయనా, నేను దితి కొడుకును. నా పేరు మయుడు. నీవు హేమ అనే అప్సరస గురించి వినే వుంటావు. దేవతలు నాకా హేమనిచ్చి పెళ్ళిచేశారు. ఈ పిల్ల మా ఇద్దరికీ పుట్టిన కూతురు. దీని పేరు మండోదరి. పద్నాలుగేళ్ళ క్రితం హేమ నన్ను విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ పిల్లకు తగిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరాను. ఈ పిల్ల కాక మరి ఇద్దరు కొడుకులు కూడా నాకు హేమ వల్ల కలిగారు. ఒకడి పేరు మాయావి, రెండో వాడి పేరు దుందుభి. నా సంగతి అడిగావు గనక చెప్పాను. నీ సంగతి తి కూడా కాస్త చెబుతావా ఏమిటి ?”

“నేను పులస్త్యబ్రహ్మ మనమణ్ణి, విశ్రవోబ్రహ్మ కొడుకును. నా పేరు దశగ్రీవుడు,” అన్నాడు రావణుడు.

రావణుడు మహర్షుల వంశంలో పుట్టాడని తెలియగానే మయుడు తన కుమార్తెను అతని కిచ్చి పెళ్ళి చెయ్యటానికి సిద్ధపడ్డాడు. రావణుడు సరేనన్నాడు. అక్కడే అప్పుడే అగ్నిని ప్రజ్వలింపజేసి, మయుడు తన కూతురి చెయ్యి రావణుడి చేతిలో పెట్టి, అగ్ని సాక్షిగా ఆ ఇద్దరికీ వివాహం చేశాడు. అప్పుడే ఆయన తన అల్లుడికి ఒక మహాశక్తిని ఇచ్చాడు. అది ఎంతో తపస్సు చేయగా లభించిన ఆయుధం; దానితోనే రావణుడు లక్ష్మణుణ్ణి మూర్ఛపోగొట్టాడు.

రావణుడు తన భార్యతో సహా లంకకు వెళ్ళి, తన తమ్ముల పెళ్ళి ప్రయత్నాలు చేశాడు. వైరోచనుడి మనుమరాలు వజ్రజ్వాల అనే దాన్ని కుంభకర్ణుడికీ, శైలూపుడనే గంధర్వరాజు కూతురు సరమ అనే దాన్ని విభీషణుడికి నిశ్చయించి వైభవంగా పెళ్ళి చేశాడు.

ముగ్గురన్నదమ్ములూ లంకలో తమ భార్యలతో సుఖంగా కాపురం చేస్తుండగా రావణుడి భార్య మండోదరి మేఘనాదుణ్ణి కన్నది. ఆ కుర్రవాడు భూమి మీద పడుతూనే ఉరిమినట్టుగా ఏడ్చాడట. అందుకని వాడికి మేఘనాదుడని పేరు పెట్టుకున్నారు. ఆ కుర్రవాడంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ. ఆ మేఘనాదుడే లక్ష్మ ణుడి చేతిలో చచ్చిన ఇంద్రజిత్తు.

ఒకనాడు రావణుడు కొలువు తీరి ఉండగా కుంభకర్ణుడు బ్రహ్మాండంగా అవలించి, ” అన్నా, నాకు నిద్ర ముంచుకొస్తున్నది. నేను పడుకోవటానికేదన్నా ఏర్పాటు చెయ్యి,” అన్నాడు. అది బ్రహ్మ వరం వల్ల ఆవహించిన నిద్ర.

రావణుడు కుంభకర్ణుడికొక నిద్రా భవనం అద్భుతంగా కట్టించి ఇచ్చాడు. అది చాలా వెడల్పూ, అంతకు రెండింతలు పొడుగూ కలిగి, స్పటిక శిలాస్తంభాలూ, దంతపు తోరణాలూ అమర్చి, బంగారమూ, మణులూ పొదిగినటువంటిది. కుంభకర్ణుడు అందులో పడుకుని సంవత్సరాల తరబడి నిద్రపోయాడు.

ఒకవంక కుంభకర్ణుడు అలా పడి నిద్ర పోతుంటే రావణుడు తన అసాధారణ బలాన్ని అండ చేసుకుని, దేవతలనూ, ఋషులనూ, యక్షులనూ, గంధర్వులనూ యథేచ్ఛగా బాధించ సాగాడు. మదించిన ఏనుగు నీటిలో ప్రవేశించి కెలికినట్టుగా రావణుడు నందనోద్యానం మొదలైన దేవతల ఉద్యానాలను ధ్వంసం చేశాడు.

తన తమ్ముడు చేస్తున్న పనులు దూష్యమైనవని బాధపడి, కుబేరుడు, తన వంశ గౌరవానికి తగిన బోధలను తమ్ముడికి చేయదలచి, రావణుడి వద్దకొక దూతను పంపాడు. ఆ దూత లంకకు వచ్చి, ముందుగా విభీషణుణ్ణి చూశాడు. విభీష ణుడు దూతకు తగిన గౌరవ మర్యాదలు జరిపి, కుబేరుడు మొదలైన వారి క్షేమ సమాచారాలు అడిగి కనుక్కుని, అతను వచ్చిన పని తెలుసుకున్నాడు. తరువాత అతనా దూతను నిండు సభలో రావణుడికి పరిచయం చేశాడు.

దూత కుబేరుడి మాటలుగా రావణుడితో ఇలా అన్నాడు :

“తమ్ముడా, ఇప్పటికే నీకు చాలా కీర్తి వచ్చింది. అంతతో తృప్తిపడు. ఇక నుంచి సాధ్యమైన మేరకు సాధు మార్గాన నడవటం మంచిది. నీవు ధ్వంసం చేసిన నందనవనాన్ని నేను కళ్ళారా చూశాను. ఋషులను చంపావని విన్నాను. నీ చేత పీడించబడిన దేవతలు నీపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. నేనీమధ్య రౌద్రవ్రతాన్ని నియమంగా చెయ్యగోరి హియాలయానికి వెళ్ళి, అక్కడ శివుడితో ఉన్న పార్వతిని చూశాను. మరే ఉద్దేశమూ లేకుండానే, పార్వతి సౌందర్యానికి బందీ అయి నా ఎడమ కన్ను ఆమె పైన పడింది. వెంటనే నా కన్ను దగ్ధమై, పింగళ వర్ణం పొందింది. తరవాత నేను అపారమైన ఆ పర్వతం మీద మరొక చోటికి వెళ్ళి రౌద్రవ్రతం అవలంబించాను. వ్రత నియమం పూర్తి కాగానే ఈశ్వరుడు మెచ్చి, తాను ఒకప్పుడీ వ్రతం చేసినట్టూ, అనంతరం నేను మాత్రమే ఈ వ్రతాన్ని పూర్తి చేసినట్టూ చెప్పి నన్ను తన స్నేహితుడుగా వుండమని కోరాడు. ఆయన నాకు ఏకాక్షి పింగళుడనే పేరు కూడా పెట్టాడు. ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చే సరికి నీవు చేసే దుష్కృత్యాల మాట చెవిన పడింది. వంశానికి అపఖ్యాతి తెచ్చే ఇలాటి పనులు మాను, నాయనా. ఋషులూ, దేవతలూ చేరి నీ చావుకు ఉపాయమాలోచిస్తున్నట్టు వింటున్నాను కూడా.”

కుబేరుడి మాటలను ఈ విధంగా దూత చెప్పే సరికి రావణుడు ఆగ్రహావేశంతో,

“ఓరీ, దూతా! ఈ మాటలు చెప్పిన నిన్నూ, చెప్పించిన నా అన్ననూ ఏం చేస్తానో చూడు. కుబేరుడా, నాకు హిత బోధ చేసేది? తనకు శివుడి స్నేహం దొరికిందని కబురు చేస్తాడా ? పెద్దవాడూ, తండ్రి లాటి వాడూ అని ఇంత కాలమూ చంపక మన్నించాను. నీ మాటలు విన్నాక మూడు లోకాలూ జయించాలని బుద్ధి పుట్టుతున్నది. మా అన్న కారణంగా మిగిలిన దిక్పాలకులను కూడా నాశనం చేస్తాను,” అంటూ కుబేరుడి దూతను కత్తితో నరికి, రాక్షసులకు తినమని ఇచ్చి, ప్రయాణ సన్నాహం చేసి, రథ మెక్కి మూడు లోకాలూ జయించటానికి బయలుదేరాడు.

అతను మొట్టమొదట కుబేరుడి పైకే వెళ్ళ నిశ్చయించుకుని, మహోదరుడూ, ప్రహస్తుడూ, శుకుడూ, సారణుడూ, ధూమ్రాక్షుడూ అనే మహాశూరులైన ఆరుగురు మంత్రులతో బయలుదేరి, కొద్ది కాలం లోనే నదులనూ, కొండలనూ, వనాలనూ దాటి, కైలాస పర్వతం చేరాడు. అక్కడ రావణుడూ, అతని అనుచరులూ కూర్చుని ఉండటం చూసి, ఆ వచ్చినవాడు కుబేరుడి తమ్ముడేనని తెలుసుకుని యక్షులు వెళ్ళి కుబేరుడితో చెప్పారు.

వెంటనే కుబేరుడు తన యక్షులను రావణుడి పైకి పంపుతూ, యుద్ధం చెయ్యమని ఉత్తరు విచ్చాడు. అసంఖ్యాకులైన యక్షులు వచ్చి, రావణుణ్ణి, అతని మంత్రు లనూ, చుట్టుముట్టి యుద్ధం ప్రారంభించారు. రావణుడి మంత్రి ప్రతి ఒక్కడూ వెయ్యేసి మంది యక్షులతో యుద్ధం చేశాడు. ఇక రావణుడు, ఎండుగడ్డిని అగ్ని దహించి నట్టుగా, యక్షులను నిర్మూలించాడు. ఈ యుద్ధంలో చచ్చిన యక్షులు చావగా, మిగిలిన వారు పారిపోయారు.

ఈ సంగతి విని కుబేరుడు మరి కొందరు యక్షులను రావణుడి పైకి పంపాడు. వారిలో

సంయోధకంటకుడనే వాడు మారీచుడి పై చక్రాయుధం ప్రయోగించి, కొండపై నుంచి కిందికి పడేటట్టు కొట్టాడు. మారీచుడు తెప్పరిల్లి తన పైకి వచ్చి యుద్ధం చేసే సరికి ఆ యక్షుడు పారిపోయాడు.

అలాగే అలకానగరం లోపలికి ప్రవేశించకుండా అడ్డంగా ఉండిన ఒక యకుణ్ణి రావణుడు తోరణం పీకి, కొట్టి చంపేశాడు. తరువాత యక్షులందరూ రణరంగం నుంచి పారిపోయి, నదులలోనూ, గుహలలోనూ దాక్కున్నారు.

తాను రెండోసారి పంపిన యక్షులు కూడా ఓడిపోయే సరికి కుబేరుడు మాణిభద్రుడనే మహాయక్షుణ్ణి రాక్షసుల పైకి పంపాడు. ఆ మాణిభద్రుడు నాలుగువేల యక్షులను వెంట తీసుకుని యుద్ధం ప్రారంభించాడు. వారందరూ అనేక ఆయుధాలతో తమ మీద విరుచుకుపడే సరికి రాక్షసులు పరిగెత్తసాగారు. తరవాత ఉభయ పక్షాలకూ దొమ్మి యుద్ధం జరిగింది. ఆ దొమ్మి యుద్ధంలో ప్రహస్తుడొక వెయ్యిమంది యక్షులనూ, మహోదరుడు మరొక వెయ్యి మందినీ, మారీచుడు దారుణంగా రెండు వేల మంది యక్షలనూ చంపారు. మాయలు తెలియని యక్షులు రాక్షసులు ముందెలా నిలుస్తారు.

అయినా మాణిభద్రుడు గొప్ప యుద్ధం చేశాడు. ధూమ్రాక్షుడు తనను ముసలంతో గుండెల మీద కొట్టినా చలించక, మాణిభద్రుడు తన గద గిరగిరా తిప్పి నెత్తిన కొట్టే సరికి ధూమ్రాక్షుడు నేల కరిచాడు. అది చూసి రావణుడు మాణిభద్రుడి పైకి వచ్చాడు. మాణిభద్రుడు తన పైన మూడు శక్తులు వరసగా ప్రయోగించినా లక్ష్యపెట్టక, రావణుడతని నెత్తి మీద కొట్టాడు. ఆ దెబ్బతో మాణిభద్రుడి కిరీటం ఒక పక్కకు ఒరిగిపోయి, అతనికి పార్శ్వమౌళి అనే పేరు కూడా వచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *