రావణుడు ఇంద్రుడితో యుద్ధం చెయుట

రావణుడు వరుణలోకం నుంచి బయలుదేరి లంకకు తిరిగివస్తూ, దారిలో కనిపించిన అందగత్తెలైన కన్యలను వేలసంఖ్యలో చెరపట్టి తెచ్చి పుష్పకంలో ఎక్కించు కున్నాడు. వాళ్ళందరూ గొల్లున ఏడుస్తూ, రావణుణ్ణి శాపనార్థాలు పెట్టారు.

అతను ఇంటికి చేరుతూండగానే అతని చెల్లెలు శూర్పణఖ ఎదురువచ్చి, పెద్ద పెట్టున ఏడుస్తూ, “ఏం చెప్పేది? నా భర్తను మిగిలిన కాలకేయులతోబాటు చంపి నన్ను విథపను చేసేశావు. బావ మరిది అన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది” అని నిందించింది.

” అమ్మాయీ, జరిగినదానికి ఏడ్చి లాభమేమిటి? యుద్ధోన్మాదిగా ఉన్న సమయంలో, వీడు నా వాడన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. ఇకముందు నువు మన ఖరుడి వెంట ఉండు. వాడు నీ కేకొరతా లేకుండా చూస్తాడు. పధ్నాలుగు వేల రాక్షసులకు వాణ్ణి నాయకుడుగా చేసి, దూషణుణ్ణి కూడా తోడిచ్చి దండకా రణ్యాన్ని రక్షించటానికి పంపిస్తున్నాను. వాళ్ళంతా నీకు విధేయులై ఉండి, నువు కోరినట్టు చేస్తారు.” అన్నాడు రావణుడు. ఆ ప్రకారమే శూర్పణఖ ఖరదూషణులు వెంట దండకారణ్యానికి వెళ్ళి అక్కడ సుఖంగా జీవిస్తూ వచ్చింది.

తరవాత రావణుడు నికుంఖిల వనానికి వెళ్ళి అక్కడ యజ్ఞం చేస్తున్న తన కుమారుణ్ణి, మేఘనాదుణ్ణి చూసి, కౌగలించుకుని, “ఇక్కడ ఏం చేస్తున్నావు నువు?”. అని అడిగాడు.

ఆ ప్రశ్నకు సమాధానం శుక్రాచార్యుడు చెప్పాడు. “నీ కొడుకు ఏడు యజ్ఞాలు తలపెట్టాడు. అగ్నిష్టోమము, ఆశ్వమేధమూ, రాజసూయమూ, గోమేధమూ, వైష్ణవమూ అన్నవి గాక, అత్యంత దుర్లభ మైన మహేశ్వర యజ్ఞం చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, కామగమనంగల రథాన్నీ, అంతటా చీకటి ఆవరింపజేయుగల మాయనూ, శక్తివంతమైన ధనుర్బాణాలనూ వరంగా పొందాడు. ఇప్పుడు చేస్తున్నదే ఆఖరుయజ్ఞం.”

శుక్రాచార్యుడు చెప్పిన ఈ మాటలతో ఏమాత్రమూ తృప్తిపడక రావణుడు, “మీరు చేసిన పని ఏమీ బాగాలేదు. మన శత్రువులైన ఇంద్రాదులను అర్చించటానికి ద్రవ్యం నష్టపరిచారు. సంపాదించిన పుణ్యం చాలు,” అని మేఘనాదుణ్ణి తన వెంట తీసుకుపోయాడు.

అప్పుడు విభీషనుడు రావణుడికొక దుర్వార్త చెప్పాడు. రావణుడికి చెల్లెలి వరస అయిన కుంభీనస అనే పిల్ల రావణుడి ఇంట పెరుగుతున్నది. రావణుడి తల్లికి పెదనాన్న అయిన మాల్యవంతుడి కూతురి కూతురు కుంభీనస. మధువనే రాక్షసుడు వచ్చి, ఎవరూ లేని సమయంలో దాన్ని ఎత్తుకుపోయాడు. ఆ సమయంలో రావణుడు దిగ్విజయం వెళ్ళి ఉన్నాడు, కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు, విభీషనుడు నీటిలో ముణిగి తపస్సు చేసుకుంటున్నాడు.

తాను ఎందరు కన్యలను అపహరించి తెచ్చినా తన చెల్లెలిని ఎవరో అపహరించారనే సరికి రావణుడు మండి పడ్డాడు. అతను కుంభకర్ణుణ్ణి నిద్ర లేపించి, రాక్షస వీరులనూ, సైనికులనూ యుద్ధానికి సిద్ధం చేయించి, మధువు వుండే మధుపురం మీదికి వెళ్ళాడు.

తన భర్తను చంపటానికి తన అన్న అయిన రావణుడు పెద్ద సేనతో వస్తున్నాడని తెలిసి, కుంభీనస ఏడుస్తూ అతనికి ఎదురు వచ్చి, “అన్నా, నీ బావమరిదిని చంపి నాకు వైధవ్యం కలిగించకు,” అని బతిమాలింది.

రావణుడు కుంభీనస దైన్యానికి కరిగి, “నీ భర్తను చంపనులే. అతను ఎక్కడ ఉన్నాడో చూపించు. నేను దేవతలను జయించటానికి స్వర్గానికి వెళుతున్నాను.. అతన్ని కూడా వెంట తీసుకుపోతాను,”. అని చెప్పాడు.

కుంభీనస తన భర్త అయిన మధువు వద్దకు వెళ్ళి, ” మా అన్న నిన్ను దేవతలతో యుద్ధం చెయ్యటానికి పిలుస్తున్నాడు. వెళ్ళు. అలాటి వాడి స్నేహం మనకు చాలా మంచిది,” అని చెప్పింది.

మధువు రావణుడి వద్దకు వచ్చి, అతన్ని అర్ఘ్యపాద్యాలతో సత్కరించి, ఎన్నో మర్యాదలు చేశాడు,

రావణుడు ఒక్క రాత్రి తన బావమరిది ఆతిథ్యం స్వీకరించి, మర్నాడు బయలుదేరి వైశ్రవణుడుండే కైలాసం వద్దకు చేరుకున్నాడు. అప్పటికి సాయంకాలం కావటం చేత రావణుడి సేన అక్కడే విడిసింది.

ఆ రాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కాస్తున్నాడు. చల్లని మందమారుతం వీస్తున్నది. చెట్ల మధ్య కిన్నరులు బృందగానాలు చేస్తున్నారు. కుబేరుడి మందిరంలో అప్సరసలు పాడే పాటలు వినవస్తున్నాయి. అంతటా పూలు వాసనలు వెదజల్లుతున్నాయి, కొండ మీద కూర్చుని వెన్నెలలో చుట్టూ ఉండే దృశ్యాలు చూస్తున్న రావఋణుడికి విరహబాధ పుట్టుకొచ్చింది.

ఆ సమయంలో అప్సరస అందరిలోకీ మిన్న అయిన రంభ, నిద్రలోముణిగి ఉన్న రావణుడి సేనల మధ్యగా నడుచు కుంటూ అటుగా వచ్చింది. ఆమె దివ్యాభరణాలు ధరించి, దివ్య పుష్పమాలలు వేసుకుని, తలలో మందారాలు పెట్టుకుని, నల్లని ముసుగు వేసుకుని, రెండో లక్ష్మీదేవిలాగా రావటం చూసి రావణుడు కూర్చున్నచోటి నుంచి లేచి వెళ్ళి, ఆమె చెయ్యి పట్టుకుని, “ఇప్పుడు నువు ఎవరి దగ్గిరికి పోతున్నావు? ఎవడా అదృష్టశాలి? నేను తక్కువ వాణ్ణి కాను. మూడు లోకాలలోనూ నన్ను మించినవాడు లేడు. నిన్ను చేతులుమోడ్చి వేడుకుంటాను. నా కోరిక తీర్చి వెళ్ళు” అన్నాడు.

రంభ అతని మాటలు విని వణికిపోతూ, “మీరు నాతో ఇలా మాట్లాడకూడదు. నాకు ఇతరులు బాధ కలిగిస్తే రక్షించవలిసిన వారు. నేను మీకు కోడలు వరస దాన్ని. మీ అన్న కొడుకు నలకూబరుడు నాకోసం వేచిన్నాడు నేనతన్ని తప్ప మరెవ్వరినీ ప్రేమించ లేను,” అని వేడుకున్నది.

“మీ అప్సరసలకు మొగుడూ, వావి వరసలూ ఎక్కడివి?” అంటూ రావణుడు రంభను బలాత్కరించాడు.

రంభ నలిపివేసిన పువ్వు లాగానూ, తెంపివేసిన లతలాగానూ అయిపోయి, పుట్టెడు సిగ్గుతోనూ, భయంతోనూ, దుఃఖంతోనూ వెళ్ళి నలకూబరుడి కాళ్ళ మీద పడి రావణుడు తనకు చేసిన అన్యాయం గురించి చెప్పింది.

నలకూబరుడు కోపోద్రేకంతో జలం స్పృశించి, ” ఈ రావణుడు ఇక ముందు తనను కోరని స్త్రీని బలాత్కరించే పక్షంలో వాడి తల వెయ్యి ముక్కలవుతుంది,” అని శపించాడు.

ఈ శాపం సంగతి విన్నాక రావణుడు చెరబట్టి తెచ్చిన స్త్రీలలో పతివ్రతలైన వాళ్ళు పరమానందం చెందారు. రావణుడు కూడా అదిమొదలు స్త్రీలను బలాత్కరించటం మానుకున్నాడు.

రావణుడు కైలాసం నుంచి బయలుదేరి తన సైన్యాలను స్వర్గం పైకి నడిపించుకు వెళ్ళాడు. రాక్షస సేన నాలుగు వైపుల నుంచి స్వర్గాన్ని ముట్టడించుతున్నదన్న వార్త విని, ఇంద్రుడు దేవగణాలను యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరించి, విష్ణువు వద్దకు వెళ్ళి, “రావణుడు దండెత్తి వచ్చాడు. ఏం చేసేటట్టు ? నీ సహాయంతో పూర్వం ఎందరో రాక్షసులను జయించాను. చక్రం పట్టుకుని వెళ్ళి రావణుడితో యుద్ధం చేస్తావా ?” అని అడిగాడు.

“నే నిప్పుడు వాడితో యుద్ధం చెయ్యను. వాడు మన చేతిలో చావడు. వాడికింకా కాలం తీరలేదు. ప్రస్తుతానికి నువే వాణ్ణి ఎదిరించు. నీ కేమీ భయంలేదు,” అన్నాడు విష్ణువు.

దేవతలకూ, రాక్షసులకూ గొప్ప యుద్ధం జరిగింది. రావణుడి బలాలకు అతని తాత అయిన సుమాలి నాయకత్వం వహించి, ఈ యుద్ధంలో సావిత్రుడనే వసువు చేతిలో చనిపోయాడు. రాక్షస సేన కూడా బాగా దెబ్బతిన్నది. పదింట తొమ్మిది వంతుల మంది రాక్షసులు చచ్చారు. ఇంద్రుడు గొప్పగా యుద్ధం చేసి రావణుణ్ణి ప్రాణాలతో పట్టుకున్నాడు. ఈ సంగతి తెలిసి మేఘనాదుడు తన మాయను ప్రయోగించి, అదృశ్యుడుగా యుద్ధం చేస్తూ వచ్చి, ఇంద్రుణ్ణి పట్టుకుని తన తండ్రిని విడిపించి, ” యుద్ధం అయిపోయింది. మనం గెలిచాం. అడుగో, ఇంద్రుడు మనకు చిక్కాడు. నువు యథేచ్ఛగా మూడు లోకాలూ వీలుకోవచ్చు.” అన్నాడు.

ఇంద్రుణ్ణి పట్టుకుని మేఘనాదుడు ఇంద్రజిత్తు అయాడు. తన కొడుకునూ, పట్టుబడిన ఇంద్రుణ్ణి తీసుకుని రావణుడు లంకకు తిరిగి వెళ్ళాడు. ఇంద్రుణ్ణి విడిపించటానికి దేవతలు బ్రహ్మను వెంట బెట్టుకుని లంకకు వెళ్ళారు. బ్రహ్మ కొలుపులో ఉన్న రావణుడితో, “నీ కొడుకు పరాక్రమం నిజంగా చాలా గొప్పది. దాన్ని చూసి నేను సంతోషించాను. ఇక నుంచీ నీ కొడుకు ఇంద్రజిత్తు అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. వాణ్ణి ఎవరూ జయించలేరు. వాడి సహాయంతో దేవతలను జయించాపుగద, ఇక ఇంద్రుణ్ణి విడిచిపెట్టెయ్యి,” అన్నాడు.

“తాతా, ఇంద్రుణ్ణి విడిచిపెట్టేతీరాలనే పక్షంలో నాకు అమరత్వం అయ్యి,” అన్నాడు ఇంద్రజిత్తు.

“నాయనా, ఏ ప్రాణికి పరిపూర్ణమైన అమరత్వం లేదు,” అన్నాడు బ్రహ్మ.

“అలా అయితే, నాక్కూడా పరిపూర్ణ మైన అమరత్వం వద్దు. నేను నీకు తృప్తి కలిగే లాగా రోజూ అగ్నిని మంత్రాలతోనూ, హవ్యాలతోనూ అర్చిస్తాను. నేను యుద్ధానికి బయలుదేరే ముందు గుర్రాలు పూన్చిన రథం అగ్ని నుంచి రావాలి; దాని పైన నేనున్నంతసేపూ నాకు అమరత్వం ఉండాలి. అదే నేను కోరే వరం. నేను అగ్నిని అర్చించటం పూర్తికాని పక్షంలో చస్తే చస్తానుగాక” అన్నాడు ఇంద్రజిత్తు.

బ్రహ్మ దీనికి ఒప్పుకున్న మీదట అతను దేవేంద్రుణ్ణి విడిచిపెట్టేశాడు. ఇంద్రుడితో సహా దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు.

యుద్ధోన్మాదంతో రావణుడు భూలోకం పర్యటించేటప్పుడు అతనికి కొన్ని అపజయాలు కూడా కలిగాయి. వాటిని గురించి కూడా అగస్త్యమహాముని రాముడికి చెప్పాడు.

వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుణ్ణి గెలవాలనే ఉద్దేశంతో రావణుడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని మాహిష్మతీ నగరానికి వెళ్ళాడు. అర్జునుడు ఆ రోజే తన భార్యలతోసహా నర్మదానదిలో జలక్రీడలాడటానికి బయలుదేరి వెళ్ళినట్టు తెలిసింది.

రావణుడు సపరివారంగా తాను కూడా నర్మదానదికి వెళ్ళి, అక్కడ స్నానం చేసి శివపూజ చెయ్యటానికి కూర్చున్నాడు. అతని మంత్రులు పూజా పుష్పాలు తెచ్చి నదీతీరాన పెద్ద పోగు పోశారు. రావణుడు తన వెంట ఎప్పుడూ ఉండే బంగారు లింగాన్ని ఒక ఇసుక తిన్నె మీద పెట్టి, అర్చించి, దాని ముందు పాడుతూ నాట్యం చెయ్యసాగాడు.

నర్మదానది తూర్పు నుంచి పడమరగా ప్రవహించి, పడమటి సముద్రంలో పడు తుంది. అలాటి నది ఇప్పుడు పడమర నుంచి తూర్పుగా ప్రవహించసాగింది. అంతే గాక నది అంతకంతకూ పొంగి, రావణుడు పూజించిన పుష్పాలను తనతోబాటు తీసుకు పోయింది. అది చూసి రావణుడు చిటికెలు వేసి శుకసారణులను పిలిచి, నర్మద ఎదురు ప్రవహించడానికి కారణం తెలుసుకు రమ్మన్నాడు.

వాళ్ళు వెళ్ళి చూసేసరికి కార్తవీర్యార్జునుడు తన భార్యలతో జలక్రీడ లాడుతూ కనిపించాడు. అతను తన వెయ్యిచేతులు తోనూ నదీ ప్రవాహాన్ని అడ్డేసరికి, నది పొంగి ఎదురు ప్రవహించుతున్నది. శుకసారణులు తిరిగి వచ్చి రావణుడితో ఈ సంగతి చెప్పారు. వాళ్ళు వర్ణించిన “మహావృక్షం” లాటి మనిషి కార్తవీర్యార్జునుడే అయి ఉంటాడని గ్రహించి రావణుడు యుద్ధానికి బయలుదేరి వచ్చి, కార్తవీర్యార్జునుడి మంత్రులతో, “రావణుడు యుద్ధానికి పిలుస్తున్నాడని మీ రాజుతో చెప్పండి,” అన్నాడు.

“యుద్ధానికి మంచి సమయం చూశావే! రాజు స్త్రీలతో జలక్రీడలాడేటప్పుడు యుద్ధానికి పిలుస్తారా? రేపు వచ్చి నీ చేతులు తీటతీర్చుకో,” అన్నారు మంత్రులు. కాని రావణుడు అప్పుడే యుద్ధం కావాలన్నాడు. కార్తవీర్యార్జునుడి మంత్రులు తమతో ముందు యుద్ధం చెయ్యమన్నారు.

ఉభయపక్షాల వారికీ యుద్ధం జరిగింది. రాక్షసులు విజృంభించి అర్జునుడి పరివారంలో చాలా మందిని చంపారు, కొందరిని తిన్నారు కూడా. ఈ యుద్ధపు కోలాహలం విని కార్తవీర్యార్జునుడు తన భార్యలకు భయపడవద్దని చెప్పి, గద తీసుకుని, దాన్ని తన అయిదువందల చేతులతోనూ, గిర గిరా తిప్పుతూ, యుద్ధం జరిగే చోటికి వచ్చాడు. ప్రహస్తుడు ముసలం తీసుకుని అతని దారికి అడ్డంగా నిలబడ్డాడు. అర్జునుడు ప్రహస్తుడు విసరిన ముసలాన్ని తన గదతో విరగగొట్టి అతని వెంటపడ్డాడు. గదతో కొట్టిన దెబ్బలకు ప్రహస్తుడు పడిపోగానే మారీచ శుకసారణ ధూమ్రాక్ష మహోదరులు మొదలైనవారు పారిపోయారు.

ఆ తరవాత రావణుడు అర్జునుడితో యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరూ గదలతో ఒకరి నొకరు మోదుకున్నారు, కాని కొండల్లాగా ఏ ఒకరూ చలించలేదు. చిట్టచివరకు అర్జునుడు బలం కొద్దీ తన గదతో రావణుడి రొమ్ము మీద కొట్టే సరికి, అది తుంపులు తుంపులై పోయింది. అయితే ఆ దెబ్బతో రావణుడు వివశుడై పడిపోయాడు. వెంటనే అర్జునుడు రావణుణ్ణి పట్టి కట్టేసి, తన పట్టణానికి తీసుకుపోయాడు.

ఈ సంగతి స్వర్గంలో ఉన్న పులస్త్య బ్రహ్మకు తెలిసింది. ఆయన మాహిష్మతికి ఆదరాబాదరా వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఆయనకు ఎంతో భక్తిగా అతిథిసేవ చేసి, ఆయన వచ్చిన పని అడిగాడు.

“నాయనా, లోకాలన్నీ జయించి ఆజేయుడనిపించుకున్న నా మనమణే గెలిచావు. ఏమి నీ పరాక్రమం! ఏమి నీ కీర్తి! వాణ్ణి విడిచిపెట్టెయ్యి,” అన్నాడు పులస్త్యుడు.

కార్తవీర్యార్జునుడు మారు మాటాడక రావణుడి కట్లు విప్పి, అగ్నిసాక్షిగా అతనితో అహింసాస్నేహం చేసుకుని, వస్త్రాభరణాలు కానుకగా ఇచ్చి పంపేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *