రాముడు ఆశ్వమేధయాగం చేయుట

రాముడు చేసిన అద్భుతమైన యజ్ఞానికి వాల్మీకి తన శిష్యులతో కూడా వచ్చి, ఋషి వాటికలో తన కోసం ప్రత్యేకించిన పర్ణశాలలో బస చేశాడు. తాను రచించిన రామాయణాన్ని ఎక్కడపడితే అక్కడ గానం చెయ్యటానికి తన శిష్యులకు ఆయన అనుమతి ఇచ్చాడు. ఆయన కుశలవులతో, “మీ రెవరి బిడ్డలని ఎవరన్నా అడిగితే వాల్మీకి శిష్యులమని చెప్పండి. డబ్బిస్తే పుచ్చుకోకండి. రాముడు పిలిస్తే ఆయన ఎదట కూడా రామాయణాన్ని గానం చెయ్యండి. రాజు గనక ఆయన పట్ల మర్యాద చూపండి,” అన్నాడు. ” అలాగే, తాతా,” అని వాళ్ళు పర్ణశాల నుంచి బయలుదేరారు.

వాళ్ళు రాగతాళయుక్తంగా రామాయణాన్ని గానం చేస్తున్న సంగతి విని రాముడు. వారిని పెద్ద సదస్సు మధ్యకు పిలిపించి, గానం చెయ్యమన్నాడు.

మహా సదస్సులో మునులూ, రాజులూ, పండితులూ, పౌరాణికులూ, సంగీతవేత్తలూ, కళాకారులూ, నాట్యం తెలిసినవారూ, ఇంకెందరో ఉన్నారు.

ఆ రోజు కుశలవులు రామాయణం నుంచి మొదటి ఇరవై సర్గలూ పాడారు. రాముడు లక్ష్మణుడితో, ” ఈ కుర్రవాళ్ళకు. పద్దెనిమిది వేల సువర్ణాలిప్పించు,” అన్నాడు. కాని లక్ష్మణుడు వారికి వేరు వేరుగా బంగారం ఇవ్వబోతే వాళ్ళు, “ఈ బంగారం మా కెందుకు ? మేము అరణ్యంలో కందమూల ఫలాలు తిని జీవించేవాళ్ళం,” అన్నారు.

రాముడా మాటలు విని ఆశ్చర్యపడి, ‘అబ్బాయిలూ, మీరు పాడే ఈ కావ్యం ఎంత ఉంటుంది? దాన్ని ఎవరు రాశారు?” అని అడిగాడు.

“దీన్ని వాల్మీకి మహాముని రాశారు. ఆయన కూడా ఈ యజ్ఞానికి వచ్చిఉన్నారు. మీకు వినాలని ఉంటే రోజూ గానంచేస్తాం,” అన్నారు సీతకొడుకులు.

రాముడు సరేనన్నాడు. పిల్లలు రోజూ వచ్చి, అందరి సమక్షంలో కొన్ని సర్గలు చొప్పున చాలా రోజుల పాటు రామాయణాన్ని గానం చేశారు. ఈ గానంతో ఆ పిల్లలు సీత కొడుకులేనన్నది అందరికీ స్పష్టమయింది.

రాముడు తన దూతలను పిలిచి, “మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి, సీత పవిత్రురాలైన పక్షంలో, ఆమె ఇక్కడికి వచ్చి ఆ సంగతి నిరూపించటానికి ఆ మహాముని అనుమతిని కోరుతున్నానని ఆయనతో చెప్పండి,” అని పంపాడు.

దూతలు వచ్చి రాముడి కోరికను విన్నవించగానే వాల్మీకి మహాముని, “సీత రాముడి కోరిక ప్రకారం వచ్చి శపథం చేస్తుంది,” అని చెప్పాడు.

దూతలు ఆ మాట చెప్పగానే రాముడు. సభికుల ఎదుట సీత తన పవిత్రతను వెల్లడించుకోబోతున్నదని ప్రకటించాడు. అందరూ ఈ మాటకు సంతోషించి, రాముణ్ణి అభినందించారు.

మర్నాడు తెల్లవారగానే రాముడు యజ్ఞ వాటికకు వెళ్ళి, మహామునులందరికీ కబురు చేశాడు. రాక్షసులనూ, వానరులనూ, నానాదేశాల నుంచి వచ్చిన నాలుగు వర్ణాల వారినీ పిలిపించాడు. అందరూ వచ్చి కూర్చుని ఉండగా వాల్మీకి మహాముని సీతను వెంటబెట్టుకుని వచ్చాడు. వాల్మీకి వెనక నడిచివచ్చే సీతను చూడగానే అందరికీ గుండెలు నీరయిపోయాయి.

వాల్మీకి రాముడితో, “రామా, ఈ సీత మహా ఇల్లాలు, ధర్మం తప్పనిది. లోకాపవాదుకు వెరచి ఈమెను నా ఆశ్రమం వద్ద వదిలిపెట్టావు. కనక నీకు ఆమె యందు విశ్వాసం కుదిరేటట్టుగా శపథం చేస్తుంది. ఈ బిడ్డలిద్దరూ సీత కొడుకులు. నేనెన్నడూ అబద్ధమాడిన వాణ్ణి కాను. వీరు నీ కొడుకులు. నేను అంతులేని తపస్సు చేశాను.. సీత నిజంగా చెడ్డదైతే, నా తపస్సు ఫలించకపోవుగాక! లోకాపవాదానికి వెంచావే గాని ఆమెలో ఎలాంటి దోషం లేదని నీకూ తెలుసు,” అన్నాడు.

రాముడు వాల్మీకికి నమస్కరించి, “మునీశ్వరా, మీరన్నది నిజమే. లంకలోనే అగ్నిదేవుడు సీత పవిత్రతకు సాక్ష్యం పలికాడు. అందుకే నేనీమెను నా వెంట ఇంటికి తెచ్చాను. ఈ పిల్లలు నా పిల్లలేనని కూడా నాకు తెలుసును.ఈ మహాసభలో సీత తన నిర్దోషిత్వం రుజువు చేసుకునేటట్టుంటే నేనామెను సంతోషంగా ఏలుకుంటాను,” అన్నాడు.

కాషాయవస్త్రాలు ధరించి ఉన్న సీత చేతులు జోడించి, నేల చూస్తూ, “నా మనస్సులో రాముణ్ణి తప్ప మరెవరినీ స్మరించని పక్షంలో భూదేవి నాకు దారి ఇచ్చుగాక! మనోవాక్కాయాల నేను రాముణ్ణి పూజించే దాన్నయితే భూదేవి నాకు దారి ఇచ్చుగాక! రాముడు తప్ప నాకింకేమీ తెలియని పక్షంలో భూదేవి నాకు దారి ఇచ్చుగాక !” అన్నది.

సీత ఇలా అంటూండగానే బలవంతులైన నాగకుమారులు ఒక దివ్యమైన సింహాసనాన్ని మోస్తూ భూమిలో నుంచి పైకి వచ్చారు. సింహాసనం ఎంతో అద్భుతంగా ఉన్నది. నాగకుమారుల తలలోని రత్నాలు వింతగా మెరుస్తున్నాయి. ఆ సింహాసనం మీద ఉన్న భూదేవి తన రెండు చేతులూ చాచి, సీతను ఎత్తి సింహాసం మీద కూర్చో బెట్టింది. వెంటనే సింహాసనం పాతాళానికి దిగిపోయింది.

ఇది చూసి అందరూ నిశ్చేష్టితులయిపోయారు. కొందరు సీతనే చూస్తూ ఉండిపోయారు. మరికొందరు రాముణ్ణి చూశారు. ఆ తరవాత ఒక్కసారిగా కలకలం బయలు దేరింది. వానరులు ఏడ్చారు. “ఎంతసాధ్వి!” అని మునులు మెచ్చుకున్నారు.

రాముడు చేతికర్ర మీద బరువు వేసి తలవంచుకుని చాలా సేపు కన్నీరుగార్చి,”నేనింత కష్టం ఎన్నడూ అనుభవించలేదు. ఓ భూదేవీ, నా సీతను నా కిచ్చెయ్యి, లేదా నాకు కూడా దారి ఇయ్యి. ఎవరురా, నా ధనుర్బాణాలు తెండి. ఈ భూమిని బద్దలు చేస్తాను.” అని ఆవేశపడ్డాడు. అందరూ చేరి అతన్ని ఓదార్చారు.

వాల్మీకి కుశలవులను వెంటబెట్టుకుని తన పర్ణశాలకు వెళ్ళాడు. ఆ రాత్రి సీతను గురించిన స్మరణలతోనే గడిచిపోయింది.

మర్నాడు మళ్ళీ సభ జరిగినప్పుడు కుశలవులు ఉత్తర రామాయణాన్ని గానం చేశారు. దానితోనే యజ్ఞకాండ ముగిసింది.. యజ్ఞానికి వచ్చిన వారినందరినీ తగిన విధంగా సత్కరించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అతను వచ్చేటప్పుడు తన కొడుకులను వెంట తెచ్చుకున్నాడు. అతను మరొక స్త్రీని పెళ్ళాడక, బంగారు సీతను పక్కనే ఉంచుకుని అనేక అశ్వమేధ, వాజపేయ యజ్ఞాలు చేశాడు. అతను ధర్మం నిలబెట్టటానికి యత్నిస్తూ, న్యాయంగా పరిపాలన చేసి, ప్రజల ఆదరం పొందాడు. అతని పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉన్నది. అకాలమరణాలూ,ఈతిబాధలూ లేవు.

కాలక్రమాన కౌసల్య, సుమిత్రా, కైకేయీ మరణించారు. వారికి రాముడు ఉత్తరక్రియలు చేసి గొప్పగా దానధర్మాలు చేశాడు.

కొంత కాలం గడిచాక రాముడి వద్దకు కైకేయి అన్న అయిన యుధాజిత్తు వద్ద నుంచి గార్డ్యుడు పదివేల గుర్రాల కానుకతో సహా వచ్చి, “రామా, మీ మామ నీతో ఇలా చెప్పమన్నాడు. సింధునదికి రెండు పక్కలా గల గంధర్వదేశం శోభతో కూడినది. అక్కడ శైలూషుడి సంతతికి చెందిన గంధర్వులు మూడుకోట్లమంది, మహాబలవంతులున్నారు. వారిని జయించి గంధర్వ దేశాన్ని వశపరుచుకో. నీ హితం కోరి ఈ మాట చెప్పాను,” అని యుధాజిత్తు తరపున సందేశమిచ్చాడు.

“మంచిది. ఈ కుర్రవాళ్ళు భరతుడి కొడుకులు: తక్షుడూ, పుష్కలుడూ అనేవాళ్ళు. వీళ్ళవెంట భరతుణ్ణి, సేననూ పంపుతాను. భరతుడు గంధర్వులను జయించి, గంధర్వదేశాన్ని రెండుగా విభజించి, తన ఇద్దరి కొడుకులనూ వాటికి రాజులుగా చేసి తిరిగి వస్తాడు,” అన్నాడు.

ఆ ప్రకారమే భరతుడు పెద్ద సేనను వెంటబెట్టుకుని పదిహేను రోజులు ప్రయాణం చేసి, కేకయ దేశాన్ని చేరి, యుధాజిత్తును కలుసుకున్నాడు. తరువాత ఇద్దరూ కలిసి గంధర్వుల మీదికి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో గంధర్వులు నశించారు. భరతుడు వారి దేశాన్ని జయించి, తక్షుడికి తక్షశిల అనే నగరాన్నీ, పుష్కలుడికి పుష్కలావతి అనే నగరాన్ని ఏర్పాటు చేసి, ఆ పట్టణాలలో అయిదేళ్ళపాటు ఉండి, అయోధ్యకు తిరిగి వచ్చాడు.

ఇక లక్ష్మణుడి కొడుకులైన అంగదుడికి, చంద్రకేతుడికి రాజ్యాలు ఏర్పాటు కావలిసి ఉన్నది. వాళ్ళు ఏలదగిన దేశం ఏదన్నా ఉంటే చూడమని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. కారుపథమనే దేశం అందుకు తగి ఉన్నదని లక్ష్మణుడన్నాడు. దాన్ని అంగదుడి కోసమూ, చంద్రకాంత మనే దేశాన్ని చంద్రకేతుడి కోసమూ ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని నిర్ణయం జరిగింది. అంగదుడి వెంట లక్ష్మణుడూ, చంద్రకేతుడి వెంట భరతుడూ వెళ్ళి ఆయా దేశాలలో వారికి రాజ్యం ఏర్పాటు చేసి అయోధ్యకు తిరిగి వచ్చారు.

కాలం గడిచిపోయింది. ఒకనాడు యముడు ముని వేషంలో రాముడి రాజ భవనానికి వచ్చి, లక్ష్మణుణ్ణి చూసి, “లక్ష్మణా, నేను ఒక గొప్ప మహర్షి దూతగా రాముణ్ణి పని మీద చూడవచ్చానని రాముడితో చెప్పు,” అన్నాడు.

లక్ష్మణుడా మాట చెప్పగానే రాముడు మునిని లోపలికి పంపమన్నాడు. యముడు వచ్చి, రాముడిచ్చిన అర్ఘ్యపాద్యాలు స్వీకరించి, “రామా, మనం ఏకాంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడుకునేటప్పుడెవరైనా వచ్చేపక్షంలో నీవు వారికి మరణశిక్ష విధించాలి. అందుకిష్టమయే పక్షంలో నేను వచ్చిన పని చెబుతాను,” అన్నాడు.

రాముడు సరేనని, లక్ష్మణుణ్ణి పిలిచి, ” లక్ష్మణా ద్వారపాలకుణ్ణి పంపేసి, నువే ద్వారం వద్ద ఉండు. మేం మాట్లాడుకుంటుండగా ఎవరు లోపలికి వచ్చినా మరణ దండన తప్పదు,” అని చెప్పాడు. తరవాత యముడు రాముడితో, “రామా, నేను మారువేషం ధరించి వచ్చిన యముణ్ణి, బ్రహ్మ పంపగా వచ్చాను. బ్రహ్మ నీతో ఇలా చెప్పమన్నాడు. నీవు రావణ సంహారం కోసం అవతరించిన విష్ణువువు. నీవు భూలోకానికి వచ్చిన పని అయిపోయింది. నీకు ఎప్పుడు తిరిగి రావాలని ఉంటే అప్పుడు తిరిగి రా,” అన్నాడు.

రాముడు నవ్వి, “నీ రాక నాకు చాలా సంతోషం కలిగించింది. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాను,” అన్నాడు.

లోపల రాముడు యముడితో ఇలా మాట్లాడే సమయంలో దుర్వాసుడు వచ్చి, “లక్ష్మణా ఇప్పుడే నేను రాముణ్ణి చూడాలి,” అన్నాడు.

“స్వామి, మా అన్న మరొక పనిలో నిమగ్నుడై ఉన్నాడు. కొంచెం ఆగాలి. మీరేం పని మీద వచ్చారో, నా వల్ల మీకేం కావాలో చెప్పండి,” అన్నాడు లక్ష్మణుడు.

దుర్వాసుడు ఉగ్రుడై, “వెంటనే నన్ను రాముడి దగ్గరికి తీసుకుపోక పోయావో మీ వంశమంతా నిర్మూలమయేటట్టు శపిస్తాను,” అన్నాడు. తాను ఒక్కడే చచ్చినా నష్టం లేదనీ, వంశమంతా సర్వనాశం కారాధని ఆలోచించి లక్ష్మణుడు లోపలికి వెళ్ళి రాముణ్ణి పిలిచాడు.

రాముడు లేచివచ్చి, దుర్వాసుడికి నమస్కరించి, “స్వామీ, ఏమి ఆజ్ఞ?” అని అడిగాడు.

“నాకు వెంటనే భోజనం పెట్టించు,” అన్నాడు దుర్వాసుడు. రాముడాయనకు భోజనం పెట్టించాడు. దుర్వాసుడు భోజనం చేసి, సంతోషించి వెళ్ళిపోయాడు.

రాముడికి తన శపథం జ్ఞాపకం విచారం కలిగింది. లక్ష్మణుడతన్ని సమీపించి, ” అన్నా, నా కోసం దిగులు పడకు. నన్ను చంపి నీ మాట నిలబెట్టుకో,” అని చెప్పాడు.

రాముడు తన మంత్రి పురోహితులను పిలిచి వారికి జరిగిన దంతా చెప్పి వారి సలహా కోరాడు.

“రామా, లక్ష్మణుణ్ణి విడిచి పెట్టెయ్యి. త్యాగం వధతో సమానం. ధర్మభంగం కలగరాదు,” అని వసిష్ఠుడన్నాడు.

లక్ష్మణుడు రాముడికి నమస్కారం చేసి, తన ఇంటికి కూడా పోకుండా, తిన్నగా సరయూతీరానికి వెళ్ళి, శ్వాస స్తంభింపజేసి, యోగం పట్టాడు. ఇంద్రుడు విమానంలో అదృశ్యంగా దిగివచ్చి లక్ష్మణుణ్ణి. శరీరంతో సహా స్వర్గానికి తీసుకుపోయాడు. విష్ణువులో నాలుగో భాగం తిరిగి వచ్చేసింది.

తరువాత రాముడు సభచేసి, “లక్ష్మణుడి లాగే నేను కూడా వెళ్ళిపోతాను. భరతుడికి పట్టాభిషేకం చేసే ఏర్పాట్లు చెయ్యండి.” అన్నాడు. ఆ మాటవిని భరతుడికి మతి పోయినట్టయింది. “నువు లేని రాజ్యం నాకెందుకు? కుశలవులకు పట్టంకట్టు. కోసలకు కుశుణ్ణి, ఉత్తరకోసలకు లవుణ్ణి రాజును చెయ్యి. మనం స్వర్గానికి పోతున్నామని శత్రుఘ్నుడికి కబురు చేద్దాం,” అన్నాడతను.

భరతుడన్న ప్రకారమే కుశలవుల పట్టాభిషేకం జరిగింది. శత్రుఘ్నుణ్ణి పిలుచుకు రావటానికి మధురాపురానికి దూత వెళ్ళాడు. శత్రుఘ్నుడు తన రాజ్యాన్ని కూడా తన కొడుకులైన సుబాహుడు, శత్రుఘాతీ అనే వాళ్ళకు పంచి అయోధ్యకు తిరిగి వచ్చాడు.

రాముడు స్వర్గానికి పోతున్నాడన్న వార్త విని సుగ్రీవ విభీషణులు సపరివారంగా వచ్చేశారు. సుగ్రీవుడు అంగదుడికి పట్టాభిషేకం చేసి మరీవచ్చాడు.

తరవాత రామ ప్రస్థానం ప్రారంభమయింది. రాముడు సన్నని బట్ట కట్టుకుని, చేత దర్భలు పట్టుకుని, మౌనంగా నడవసాగాడు. అతని వెంట అంతఃపుర స్త్రీలూ, భరతశత్రుఘ్నులూ, మంత్రులూ, భృత్యులూ, వానరులూ బయలుదేరారు. కొంత దూరం నడిచి రాముడు సరయూ నదిని చేరాడు. రాముడు ఆ నదిలో పాదాలు పెట్టాడు. అతనికి బ్రహ్మ పిలుపు వినబడింది. రాముడికి, భరతశత్రుఘ్నులకూ వైష్ణవ శరీరాలు వచ్చేశాయి. విష్ణువు బ్రహ్మను చేరాడు. అతనితో బాటు అవతరించిన వారందరూ తమతమ లోకాలకు తిరిగి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *