హనుమంతుడు అశోక వనంలో సీతను చూచుట

శింశుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టు పక్కలన్నీ కలయ జూశాడు. అశోక వనం దేవేంద్రుడి నందన వనం లాగుంది. దాని నిండా పూల చెట్లూ, పళ్ళ చెట్లూ ఉన్నాయి. పక్షులూ, మృగాలూ ఉన్నాయి. అక్కడక్కడా దివ్యమైన భవనాలూ, అరుగులూ, తామర పూలూ, కలువ పూలూ గల మడుగులున్నాయి. అన్నిటి కన్న అశోక వృక్షాలు జాస్తిగా ఉన్నాయి.

కొద్ది దూరంలో ఒక ఎత్తయిన తెల్లని మండపం ప్రకాశిస్తున్నది. అందులో వెయ్యి స్తంభాలున్నాయి. దానిలో పగడాలతో తయారు చేసిన మెట్లూ, బంగారు అరుగులూ ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలో ఉన్నది.

తరవాత హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కొట్టుకుని ఉన్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆమె బాగా కృశించి, నిట్టూర్పులు పుచ్చుతూ, దైన్యంతో కూడుకుని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకుని ఉన్నది. నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడ లాగా అట్ట కట్టుకుపోయి తుంటి దాకా వెళ్ళాడుతున్నది.

ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు ఈ విధంగా వితర్కించుకొన్నాడు. రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు. ఆ స్త్రీలో తనకూ, సుగ్రీవాదులకూ కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి. నిండు చంద్రుడి వంటి ముఖం. తీర్చినట్టుండే కనుబొమలు, నల్లని వెంట్రుకలు, అందమైన నడుము—సీత ఎంత కృశించి, శోక సముద్రంలో ముణిగి ఉన్నా ఈ లక్షణాలు దాగటం లేదు. ఇవి గాక రాముడు సీత గుర్తులు కొన్ని చెప్పాడు. అందుచేత హనుమంతుడు ఆమె సీతే నని నిర్ణయించు కోవటానికి చాలా శ్రద్ధగా చూశాడు.

రాముడు చెప్పిన ఆభరణాలలో కొన్నిటిని ధరించటం ఇష్టంలేక ఆమె చెట్టు కొమ్మలకు తగిలించింది. వాటిలో చెవులకు పెట్టుకునేవీ, చేతులకు పెట్టుకునేవి ఉన్నాయి. అవి తీసి వేసినట్టుగా సీత చెవులకూ, చేతులకూగుర్తులు కానవస్తున్నాయి. అదీ గాక సీత ఋశ్యమూక పర్వతం పైన మూట గట్టి పడ వేసిన ఆభరణాలలో ఇవి లేవు. అదీ గాక సీత నగలను మూట గట్టిన పచ్చపట్టు వస్త్రమూ, ఆమె ఇప్పుడు కట్టుకొన్న చీరా ఒకటిగానే ఉన్నాయి కాకపోతే చీరె చాలా మాసి ఉన్నది. ఇవన్నీ అలోచించి హనుమంతుడు ఆమె సీతే నని నిశ్చయించుకుని పరమానందం చెందాడు.

మరుక్షణమే సీత స్థితి తలుచుకుని హనుమంతుడి గుండె నీరైపోయింది. జనకుడి కుమార్తె, దశరథుడి పెద్ద కోడలు, ఎన్నో సుఖాలు అనుభవించ వలిసిన ఈ సీత కంటికి మంటికీ ఏకధారగా ఏడుస్తూ, శుష్కించి, ఈ భయంకర రాక్షస స్త్రీల మధ్య ఇలా కుమిలిపోవటమేమిటి? ఈ సీత కోసం రాముడు ఎందరు రాక్షసులను చంపాడు! ఈమె కోసమే గదా అతను వాలిని చంపి సుగ్రీవుడికి పట్టం గట్టాడు! ఈమె కోసమే గదా తాను సముద్రాన్ని లంఘించి లంకకు వచ్చాడు! ఈమె కోసం రాముడు మూడు లోకాలూ తల్లకిందులు చెయ్యమన్నా చేస్తాడు. ” పరాయి వాడిని నాకే ఈ సీతను చూసి ఇంత బాధ కలుగుతూంటే రాముడి కింకా ఎంత దుఃఖం కలుగుతూండపచ్చు?” అనుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *