హనుమంతుడు సీతను కలుసుకోనుట

సీత దుఃఖ వివశురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో, రాక్షస స్త్రీలో తనను తప్పక చంపుతారనీ, తాను రాముడి కొరకు అంత కాలమూ ఎదురు చూడటం నిష్ప్రయోజన మయిందనీ ఆమె అనుకున్నది. నోరెండిపోతూ ఆమె శింశుపా వృక్షం కిందికి పోయి, ఆత్మ హత్య చేసుకునే ఆలోచన చేస్తూ తన జెడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభ శకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఆమెకు ఈ శుభశకునాలు చూసి కొత్త ప్రాణం వచ్చినట్టయింది.

ఇంతసేపూ శింశుపా వృక్షంలో కూర్చుని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు. అన్నీ విన్నాడు. కాని అతనికి ఏం చెయ్యటానికి ఒకంతట పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి, ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగి పోతే సీతకు రాముడి విషయం తెలియదు; ఆమె ఇక్కడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీ గాక, “సీత ఏమన్నది?” అని రాముడు తప్పక అడుగుతాడు. “నే నామెతో మాట్లాడలేదు,” అంటే రాముడు తన చూపులతోనే నన్ను దగ్ధం చేస్తాడు. పోనీ సీతతో మాట్లాడ తామంటే రాక్షస స్త్రీ లంతా ఉన్నారు. సంస్కృతంలో మాట్లాడితే వాళ్ళకు అర్ధంకాని మాట నిజమే కాని, సీత తనను చూసి – రావణుడే మాయా రూపంలో వచ్చాడను కుంటుందేమో! అప్పుడామె భయపడి కెవ్వున అరవగానే రాక్షస స్త్రీలు తన పైకి ఆయుధాలతో వస్తారు. తన చేత దెబ్బతిని వాళ్ళు రాక్షస యోధులను పిలుచుకు వస్తారు. వాళ్ళతో యుద్ధం చేసి అలసిపోతే తాను మళ్ళీ నూరు యోజనాల సముద్రం లంఘించలేక పోవచ్చు. ఒక వేళ తాను రాక్షసులు చేతిలో చావటమే జరిగితే సీత వార్త చెప్పేవాడుండడు.

నేను చెప్పే మాటలు సీత అలకించాలి, కాని ఆమె నన్ను చూసి భయపడగూడదు. అలా మాట్లాడే మార్గమేది ?” అని హనుమంతుడు దీర్ఘంగా ఆలోచించి అందుకొక మంచి మార్గం కనిపెట్టాడు. అతను చెట్టు కొమ్మల మాటున సీతకు కనిపించకుండా కూర్చుని, ఆమెను చూస్తూ ఇలా ప్రారంభించాడు.

“దశరథుడనే ఒక గొప్ప రాజు. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు మిక్కిలి అందమైనవాడు, గొప్ప విలుకాడు. తండ్రి ఆజ్ఞ చేత ఆ రాముడు భార్యనూ, తమ్ముణ్ణి వెంట బెట్టుకుని అరణ్యాలకు వెళ్లాడు. అక్కడ అతను ఖరుడు మొదలైన అనేక రాక్షసులను చంపాడు. ఈ సంగతి తెలిసి రావణుడు మాయలేడి సహాయంతో రాముణ్ణి మోసపుచ్చి, అతని భార్య అయిన సీతను అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ వచ్చి, సుగ్రీవుడనే అతనితో స్నేహం చేసి, వాలి అనే వానర రాజును చంపి, ఆ రాజ్యాన్ని సుగ్రీవుడి కిచ్చాడు.ఆ సుగ్రీవుడు సీతాదేవిని వెతకటానికి అన్ని దిక్కులకూ వేలకు వేల వానరులను పంపాడు. ఆ ప్రయత్నంలో నేను నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి ఈ లంకకు వచ్చి, రాముడు వర్ణించిన సీతను చూడగలిగాను.”

హనుమంతుడీ మాటలని మౌనం వహించగానే సీత ఆశ్చర్యంతోనూ, సహజమైన భయంతోనూ తల ఎత్తి శింశుపా వృక్షం కేసి చూసింది. ఆమెకు హనుమంతుడు కనిపించాడు. సీత తన కళ్లనూ, చెవులనూ తానే నమ్మలేక, తాను కలగంటున్నాననీ, కలలో కోతి కనిపించటం చాలా చెడ్డదనీ భయపడింది. తరువాత ఆమె తాను కల కనటం లేదని రూఢిచేసుకుని, భ్రమపడుతున్నాననుకున్నది.

ఈలోపల హనుమంతుడు చెట్టుదిగి వచ్చి, కొంతదూరంలో నిలబడి నమస్కారం చేసి, “అమ్మా, జీర్ణించిన పట్టుచీరె కట్టుకుని, చెట్టుకొమ్మ పట్టుకుని నిలబడి ఉన్నావు, నీ వెవరవు? ఏ జాతికి, ఏ గణానికి చెందిన దానివి? నిన్ను చూస్తే దేవతవనిపిస్తున్నది. నీ తండ్రి ఎవరు ? భర్త ఎవరు? పెద్ద దుఃఖంలో ఉన్నావు. నీ బంధువు ఎవరైనా పోయారా జనస్థానం నుంచి రావణుడు అపహరించి తెచ్చిన సీతవే అయితే ఆ మాట వెంటనే చెప్పు అన్నాడు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *