హనుమంతుడు అశోక వనంలో సీతను చూచుట

హనుమంతుడు శింశుపా వృక్షం కొమ్మల మీద కూర్చుని. రాత్రి చాలా భాగం గడిచింది. రాక్షస బ్రాహ్మణులు వేదాధ్యయనం ప్రారంభించారు. మంగళ వాద్యాలు మోగాయి. రావణుడు వాటి ధ్వనికి మేలుకొని, సీతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వెంటనే అతను సమస్తాభరణాలూ ధరించి, వెలిగిపోతూ అశోక వనానికి బయలుదేరాడు. అతని వెంట నూరు మంది స్త్రీలు వచ్చారు. వారిలో కొందరు బంగారు దీప స్తంభాలూ, కొందరు చామరాలూ, మరి కొందరు విసన కర్రలూ పట్టుకున్నారు. ఒకతి తన కుడి చేతిలో మణి మయమైన మద్య భాండం తీసుకున్నది, మరొకతి రావణుడి వెనుక నుంచి బంగారు కర్ర గల తెల్ల గొడుగు పట్టింది.

వారందరూ అశోక వన ద్వారం దగ్గిరికి వచ్చే సరికి, చెట్టు మీద ఆకుల చాటున ఉన్న హనుమంతుడు వారిని చూశాడు. రావణుణ్ణి ఇంకా బాగా చూడటానికి హనుమంతుడు కింది కొమ్మ మీదికి దిగాడు.

రావణుడు ఇంకా అంత దూరంలో ఉండగానే సీత భయంతో కంపించిపోయిది. ఆమె ముడుచుకుని కూర్చుని ఏడవసాగింది. కటికనేల మీద కూర్చుని, భయపడి ఏడుస్తూ, దుమ్ము కొట్టుకుని ఉన్న సీతతో రావణుడిలా అన్నాడు.

“నన్ను చూసి ఎందుకు భయపడతావు, సీతా? ఇక్కడ నీకు హాని చేసే వారెవరూ లేరు. నేనా నీ మీది మోహంతో తపించి పోతున్నాను. కాని నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఎందుకలా శోకిస్తావు ? నన్ను నమ్ము, స్నేహ బుద్ధితో చూడు. తలదువ్వుకోక, మురికి బట్ట కట్టుకుని, అర్థం లేని ఉపవాసాలు చెయ్యటం నీ కెంత మాత్రమూ తగదు. కారిపోయిన నీటి లాగా పోయిన యౌవనం తిరిగి రాదు. భోగాలు అనుభవించు. నీ వంటి అందగత్తె సృష్టిలో లేదు. నన్ను చేపట్టితే నిన్ను అగ్ర భార్యను చేస్తాను. ప్రపంచమంతా జయించి నీ తండ్రి జనకుడికి కానుకగా ఇస్తాను. అదృష్ట హీనుడై, రాజ్యం పోగొట్టుకుని, అడవులలో అలమటించే ఆ రాముడింకా బతికి ఉంటాడా అని నా సందేహం. ఒక వేళ బతికి ఉన్నా అతడు నిన్ను చూడను కూడా లేడు. పూర్వం తన భార్యను ఇంద్రుడెత్తుకు పోతే హిరణ్యకశిపుడు నారదుడి చేత అడిగించి తెచ్చుకున్నాడు. రాముడి గతీ అంతే. అయితే అతను ఎంత వినయంగా అడిగినా నేను నిన్నివ్వను. కృశించి,మట్టి కొట్టుకుని ఉంటేనే నీ అందం నా మనస్సు హరించేస్తున్నదే, చక్కగా అలంక రించుకుని, మంచి బట్టలు కట్టుకుని, సంతోషంగా ఉంటే ఎలా ఉంటావో! హాయిగా తిను, తాగు, సుఖించు. నీ కేమిటి లోపం?”

ఈ మాటలు విని సీత ఒక గడ్డి పోచను తనకూ రావణుడికీ మధ్యగా పట్టుకుని, దీనస్వరంతో ఇలా చెప్పింది.

“నా మీది ఆశ వదులుకో. పాపిష్టి వాడికి మోక్షం ఎంత దుర్లభమో, నీకు నేనూ అంతే. నేనింకొకడి భార్యను, పతి వ్రతను. నీ భార్యలను ఇతరులు కోరితే నీ కెలా ఉంటుందో ఆలోచించుకో. నీకు బుద్ధి చెప్పే వారెవరూ లేరో, లేక చెప్పినా నీవు వినవో! కాని నీవు చేసిన పని నీకూ, నీ రాజ్యానికి, రాక్షస కులానికి చేటు కలిగించేది. నాకు కావలసింది నీ అంతఃపుర స్త్రీల పై పెత్తనమూ కాదు, డబ్బూ కాదు, ఇంకేదీ కాదు నా భర్త వెంట ఉండటం. నాలుగు కాలాలపాటు సుఖంగా ఉండాలంటే నన్ను రాముడి దగ్గర చేర్చు. రాముడితో స్నేహం చేసుకో. శరణన్న వారిని రాముడు క్షమించగలడు. లేదా, రామ లక్ష్మణుల మూలంగా నీకు సర్వ నాశనం తప్పదు. నీవు పిరికిపందవు. రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసుల నందరినీ చంపెయ్యటం చూసి భయపడి, రామలక్ష్మణు లిద్దరూ బయటికి వెళ్ళి ఉండగా నన్ను దొంగిలించి తెచ్చావు. వారి గాలి ఏమాత్రం సోకినా, పులుల వాసన తగిలిన కుక్కలాగా నీవు పారిపోయి ఉందువు. అటువంటి రామలక్ష్మణులతో యుద్ధం పెట్టుకోకు.”

సీత ఆడిన ఈ పరుష వచనాలకు రావణుడు మండిపడి, “నీ వన్న ఈ మాటలలో ప్రతి ఒక్క మాటకూ నిన్ను చంపవచ్చును. కాని నీ మీది మోహం చేత నేనా పని చెయ్యలేకుండా ఉన్నాను. నేను చెప్పిన గడువింకా రెండు మాసాలున్నది. ఈ లోపల నా భార్యవు కావటానికి సమ్మతించవో, నిన్ను ఉదయపు ఫలహారం కింద వడించుకు తింటాను,” అన్నాడు.

అతను సీత వెంట ఉన్న రాక్షస స్త్రీలతో, “మీరు నయానో, భయానో ఈ సీత మనస్సు నా మీదికి మళ్ళేటట్టు చేయండి. ఆమె కిష్టం లేని పనులు చేయటానికి కూడా ఇప్పుడనుజ్ఞ ఇస్తున్నాను,” అన్నాడు.

రావణుడి వెంట ఉన్న భార్యలలో దేవ గంధర్వ స్త్రీలు సీతను చూసి జాలిపడి, తమ సానుభూతిని ఆమెకు సంజ్ఞల ద్వారా తెలియ జేశారు. రావణుడి కడగొట్టు భార్య అయిన ధాన్యమాలిని రావణుణ్ణి కౌగ లించుకుని, ” ఈమెకు నీపై ఇష్టం లేదు. ఆమె పైన ఎందుకు లేని పోని ఆశ పెట్టుకుంటావు? ఆమెకు సుఖపడే గీత లేదు. అందుకే నిన్ను వరించటం లేదు,” అన్నది. రావణుడి మాట విని చిరునవ్వు నవ్వి స్త్రీలతో సహా తన యింటికి తిరిగి వెళ్ళాడు. అతను వెళ్ళి పోగానే రాక్షస స్త్రీలు సీతను మాటలతో హింసించారు, ఆయుధాలతోబెదిరించారు. కొందరు రావణుణ్ణి పొగడారు. కొందరు రాముణ్ణి తిట్టారు. “మేము చెప్పినట్టు చెయ్యకపోతే నిన్నిప్పుడే తినేసి, సీత చచ్చిపోయిందని రావణుడితో చెబుతాం,” అన్నారు. “మళ్ళీ పోట్లాడు కోకుండా దీన్ని ముందుగానే ముక్కలు ముక్కలుగా కోసి సమంగా పంచండి,” అన్నది మరొకతె. కల్లు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని మరొకతె అన్నది.

సీతకు ఒక వంక భయమూ, మరొక వంక అసహ్యమూ కలిగాయి. ఆమె తాను కూర్చున్న చోటి నుంచి లేచి శింశుపా వృక్షం కేసి నడిచి ఒక ఆశోక వృక్షం కింద దాని కొమ్మ పట్టుకుని నిలబడి తన దుస్థితిని గురించి తలుచుకుని బాధపడింది. రామ లక్ష్మణులు మరణించి ఉంటారా, రావణుడు వారిని ఈపాటికి చంపించి ఉంటాడా. అని ఆమెకు కొంచెంసేపు అనుమానం కలిగింది. వాళ్ళు సన్యసించారేమోనని మరొకసారి సందేహించింది. రాక్షస స్త్రీలు ఆమెను చుట్టు ముట్టి ఇంకా భయపెడుతూనే ఉన్నారు.

ఇంతలో త్రిజట అనే ముసలి రాక్షసి అప్పుడే నిద్ర లేచి, పెద్దగా మూలుగుతూ, “సీతను తినెయ్యకండర్రా, కావలిస్తే నన్ను తినండి. నా కొక భయంకరమైన కల వచ్చింది,” అన్నది. రాక్షస స్త్రీలు ఈ మాటకు భయపడి, దాని చుట్టూ మూగి ఏం కల వచ్చిందని త్రిజట నడిగారు. త్రిజట ఇలా చెప్పింది.

“రాముడు తెల్లటి పూల మాలలు వేసుకుని, తెల్ల బట్టలు కట్టుకుని, దంతంతో చేసిన పల్లకీలో ఎక్కి, లక్ష్మణుడితో సహా, వెయ్యి హంసలు మోస్తుండగా ఆకాశ మార్గాన లంకకు వచ్చాడట. ఈ సీత తెల్లని చీర కట్టుకుని, సముద్రం మధ్య ఉండే శ్వేతపర్వతం మీద ఉన్నట్టు నాకు కలలో కనిపించింది. రామలక్ష్మణులు నాలుగు దంతాలు గల పెద్ద ఏనుగు నెక్కి లంకలో సంచరించటం కనిపించింది. ఆ రామ లక్ష్మ ణులు సీతను సమీపించారు.”

“రాముడెక్కిన ఏనుగు శ్వేతపర్వత శిఖరం పైగా ఉంటే సీత దాని పైకి ఎక్కింది. తరవాత, రాముడి తొడపైన కూర్చున్న సీత లేచి, చేతులతో సూర్య చంద్రులను పట్టుకుంటున్నట్టు కనిపించింది. ఆ తరవాత రాముడు ఎనిమిది తెల్ల యెద్దులు లాగే రధం మీద సీతతో ఇక్కడికి రావటం చూశాను. సీతా రామ లక్ష్మణులు పుష్పక విమాన మెక్కి ఉత్త రంగా వెళ్ళటం నాకు కనిపించింది. ఇక రావణుడు గన్నేరు పూల మాలలు ధరించి, ఒళ్ళంతా నూనె పూసుకుని, ఎర్ర బట్ట కట్టుకుని, తాగిన మత్తులో నేల పైన పడి ఉండటం కనిపించింది.”

“ఇంకోసారి రావణుడు పుష్పక విమానం నుంచి కిందపడి, నున్నని, జుట్టు లేని తలతో, నల్లని బట్టలు కట్టుకున్న ఆడది ఈడుస్తున్నట్టు కనిపించాడు. మరొకసారి రావణుడు ఎర్ర పూల మాలలూ, రక్త చందనమూ ధరించి, నూనె తాగుతూ, నవ్వుతూ, నాట్యం చేస్తూ, మతిపోయి గాడిదలు పూన్చిన రథం పైన పోతూ కనిపించాడు. ఒకసారి రావణుడు గాడిద నెక్కి దక్షిణంగా పోతూ, దాని మీద నుంచి తల్ల కిందులుగా నేల మీద పడటం చూశాను. అక్కడి నుంచి లేచి అతను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతూ ఒక బురద గుంటలో పడి ముణిగి పోయాడు.”

“కుంభ కర్ణుడు కూడా ఇలాటి స్థితిలోనే కనిపించాడు. రావణుడి కొడుకులు శరీరంపై నూనె పోసుకోవటం కనిపించింది. రావణుడు పందినీ, ఇంద్రజిత్తు మొసలిని, కుంభ కర్ణుడు ఒంటెనూ ఎక్కి దక్షిణంగా పోవటం చూశాను. గోపురాలూ, తోరణాలూ విరిగి పడిపోయిన లంక సముద్రంలో ముణగటం కనిపించింది. రాముడి దూత అయిన ఒక కోతి లంకను తగలబెట్టాడట. అందుచేత మీ అఘాయిత్యం చాలించి సీతతో మంచిగా ఉండండి, లంకకు చేటు రానున్నది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *