అశోక వనాన్ని నాశనం చేసి, హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేయుట

రాముడికి గుర్తుగా ఉండగలందులకు సీత హనుమంతుడితో ఒక పాత సంఘటన చెప్పింది. ఈ సంఘటన చిత్రకూట పర్వతం వద్ద గంగాతీరాన ఒక ఋష్యాశ్రమంలో సీతా రాములుండగా జరిగింది. ఒకనాడు సీత అక్కడి పుష్పవనంలో విహరించి అలసి పోయి రాముడి తొడపై కూర్చున్నది. అప్పుడొక కాకి వచ్చి సీత రొమ్ముమధ్య పొడిచింది. సీతకు కోపం వచ్చి, మట్టిబెడ్డతో దాన్ని తరిమింది. కాని ఆ కాకి వెళ్ళిపోక మాటిమాటికి సీత మీదికి రాసాగింది. కాకి చేత అవస్థపడుతూండే సీతను చూసి రాముడు హేళన చేసి, కోపం తెప్పించి తరువాత ఆమెను ఓదార్చాడు. తరవాత సీత రాముడి తొడపై తల పెట్టుకుని చాలా సేపు నిద్రపోయింది. ఆమె నిద్రలేవగానే రాముడు ఆమె తొడపై తల పెట్టుకుని తాను కూడా నిద్రపోయాడు. ఆ కాకి తిరిగి వచ్చి సీతను మళ్ళీ రొమ్ములో గీరి మాంసం తినసాగింది. ఆమెకు పెద్ద గాయమై రక్తం కారి రాముడు కూడా తడిశాడు.

కాకి బాధ భరించలేక సీత రాముణ్ణి నిద్ర లేపింది. రాముడు నిద్ర లేచి, సీత రొమ్మున గాయం చూసి మండిపడుతూ, ‘ఇంతగా నిన్ను గాయపరిచిన దుర్మార్గు డెవరు?” అని అడిగాడు. అతను అటూ ఇటూ చూసే సరికి గోళ్ళనిండా నెత్తురుతో కాకి కనిపించింది. రాముడు దర్భాసనం నుంచి ఒక దర్భను లాగి బ్రహ్మాస్త్రం పఠించాడు. ఆ దర్భ ప్రళయాగ్ని లాగా ప్రజ్వరిల్లుతూ కాకి పైకి వెళ్ళింది.

ఆ కాకి ఇంద్రుడి కొడుకు, పక్షులలో మేటి, పర్వతాలలో ఉండేది, వాయు వేగం గలది. బ్రహ్మాస్త్రం వెంట పడగా ఆ కాకీ మూడు లోకాలూ తిరిగింది. ఇంద్రుడు గాని, దేవతలు గాని, మహర్షులు గాని దానిని కాపాడలేకపోయారు. అది తిరిగి రాముడి వద్దకే వచ్చి శరణన్నది. రాముడు శరణాగత వత్సలుడు గనక దాన్ని క్షమించాడు; కాని బ్రహ్మాస్త్రం వృథాపోవటానికి వీలులేనందున ఆ కాకి యొక్క కుడికన్ను నాశనం చేశాడు.

సీత హనుమంతుడికి ఈ సంగతంతా చెప్పి, “ఇంత సమర్థుడై ఉండి కూడా నా భర్త నన్ను రక్షించే ప్రయత్నం చెయ్య లేదంటే నేను చేసి ఉండిన మహాపాపమే కారణమై ఉండాలి,” అన్నది. హనుమంతుడామెను ఓదార్చి, రామలక్ష్మణులకూ, సుగ్రీవుడికి, వానర సమూహానికి ఏం చెప్పమన్నావని అడిగాడు.

“రాముడి కుశలం అడిగానని చెప్పు. ఆయనకు నా సాష్టాంగ నమస్కారం చెప్పు. నన్ను తల్లిలాగా చూసుకున్న లక్ష్మణుడి క్షేమం అడిగానని చెప్పు. అతను సమయానికి దగ్గిర ఉన్నా నన్ను రావణుడపహరించి ఉండలేడు. రాముణ్ణి బయలుదేర దీయటానికి నీకన్న సమర్థులు లేరు,”  అంటూ సీత తన కొంగున కట్టి ఉన్న చూడామణి తీసి హనుమంతుడికిచ్చి, “దీన్ని మా అమ్మ నాకు వివాహ సమయంలో ఇచ్చింది. అప్పుడు దశరథ మహారాజు కూడా అక్కడే ఉన్నాడు. దీన్ని చూడగానే రాముడికి మా అమ్మా, తన తండ్రి, నేనూ జ్ఞాపకం వస్తాం,” అన్నది.

హనుమంతుడిప్పుడు తిరిగి మామూలు రూపం ధరించి ఉన్నాడు. అతనా చూడామణిని తీసుకుని, చేతికి తొడగటం సాధ్యం కాక, వేలికి తగిలించుకున్నాడు.

ఆ హనుమంతుడు సీతకు చెప్పవలిసిన ధైర్యమంతా చెప్పి ఆమెను విడిచి అవతలికి వచ్చి, రావణుడి సంగతి కొంతవరకు అంతు తేల్చుకుని పోదామని నిశ్చయించుకున్నాడు. ఇంత శ్రమపడి లంకకు వచ్చి సీతను మాత్రం చూసి తిరిగి వెళ్ళిపోవటం అతనికి భావ్యంగా తోచలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *