అశోక వనాన్ని నాశనం చేసి, హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేయుట

రాక్షసులేపాటి పరాక్రమవంతులో, యుద్ధం చెయ్యటంలో వారికీ, వానరులకూ గల తారతమ్యం ఏమిటో తెలుసుకుని వెళ్ళితే సుగ్రీవుడి ఆజ్ఞను సరిగా నెరవేర్చినట్టవుతుందని అతనికి అనిపించింది. పనిలోపనిగా రావ ణుడికి కూడా వానర పరాక్రమం ఏమిటో చూపినట్టూ అవుతుంది! రావణుణ్ణి రెచ్చ గొట్టాలంటే నందన వనంలాగున్న అశోక వనాన్ని నాశనం చెయ్యటం కన్న మంచి మార్గం లేదనుకుని హనుమంతుడు తన శక్తి కొద్దీ అశోకవనంలోని చెట్లను కూలదోయ సాగాడు. క్రీడా సరోవరాలను ధ్వంసం చేశాడు. క్రీడా పర్వతాలను కూలదోశాడు. అశోక వనమంతా భీభత్సమైపోయింది. చెట్ల మీది పక్షులన్నీ భయపడి అరిచాయి. లతలూ, తీగలు తెగి వాడు ముఖాలు వేశాయి. ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఎంత మంది రాక్షసులు వచ్చినా యుద్ధం చెయ్యటానికి సిద్ధపడి హనుమంతుడు వెలపలి ద్వారం వద్ద చేరాడు.

హనుమంతుడు చేసిన విధ్వంసానికి రాక్షస స్త్రీలందరూ పరిగెత్తుకొచ్చి హనుమంతుణ్ణి చూశారు. వాళ్ళు చూస్తున్నారని తెలిసి, అసలే పెంచి ఉన్న తన శరీరాన్ని హనుమంతుడు మరింత పెంచాడు. వాళ్ళు సీతతో, “వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపారు? నీతో ఏమిటి మాట్లాడాడు?” అని అడిగారు.

“అతనేవడో నాకేం తెలుస్తుంది? రాక్షస మాయలు మీ రాక్షసులకే తెలియాలి! అతన్ని చూస్తే నాకూ భయంగానే ఉంది. ఎవరతను? మీరే చెప్పండి,” అన్నది సీత.

సీత ఇలా అనగానే రాక్షస స్త్రీలు హడలి పోయారు. వారిలో కొందరు సీతను రక్షించటానికి ఉండిపోతే, మిగిలిన వారు రావణుడితో చెప్పటానికి పరిగెత్తారు. వాళ్ళు రావణుడితో, “భయంకరమైన దేహము, అపారమైన బలము కల వానరుడెవడో వచ్చి సీతతో ఏదో మాట్లాడాడు. వాడిప్పుడశోకవనంలో ఉన్నాడు. వాడెవడని అడిగితే సీత చెప్పటంలేదు. ఎవరు పంపగా వచ్చాడో గాని ఆ వానరుడు అంతఃపుర వనమంతా నాశనం చేసేశాడు. ఒక్క ప్రదేశమైనా వదిలిపెట్టలేదు. సీత కూర్చునే చెట్టు మాత్రం విరవ లేదు. సీత ఒక శింశుపా వృక్షం కిందికి వెళ్ళింది. దాన్ని కూడా వాడు విరవ లేదు. అశోకవనం ధ్వంసం చేశాడు గనకా, నీవు తెచ్చిన సీతతో మాట్లాడాడు గనకా, రెండు విధాలా వాడు చంపదగిన వాడే,” అన్నారు.

రావణుడీ మాటలు విని ఆగ్రహావేశం చెంది, హనుమంతుణ్ణి పట్టుకోమని తనంత పరాక్రమంగల ఎనభైవేల మంది రాక్షసులను కింకరులనే పేరుగల వాళ్ళను ఆజ్ఞాపించాడు. వారు వివిధాయుధాలతో బయలు దేరి వెళ్ళి, అశోకవన ద్వారం వద్ద ఉన్న హనుమంతుడి పైకి విజృంభించారు. వారు తనను చుట్టుముట్టగానే హనుమంతుడు. తన తోకను నేలకేసి కొట్టి గట్టిగా అరిచాడు. ఆ ధ్వనికీ, అతను భుజాలు చరచుకున్న చప్పుడుకూ లంక అంతా మారుమోగింది.

“జయం రామలక్ష్మణులది, వానర రాజైన సుగ్రీవుడిది! నేను రాముడికి దాసుణ్ణి. నా పేరు హనుమంతుడు. శత్రు హంతకుణ్ణి. వెయ్యిమంది రావణులు నాకు యుద్ధంలో సాటిరారు. ఈ రాక్షసులంతా చూస్తూండగానే ఈ లంకానగరాన్ని నాశనం చేసి, సీతకు నమస్కరించి, రాముడి వద్దకు తిరిగిపోతాను,” అని హనుమంతుడు గట్టిగా అరిచాడు.

ఎర్రగా పర్వతాకారుడై కనిపించే హనుమంతుణ్ణి, అతని అరుపూ చూసి రాక్షసులు భయపడ్డారు గాని, రాజాజ్ఞ తప్పదు గనక రాక్షసులతని పైన తమ ఆయుధాలను ప్రయోగించారు. హనుమంతుడు ద్వారం వద్దనే ఉన్న పెద్ద పరిఘను చేత బట్టుకుని, దానితో రాక్షసులను చావ మోదాడు. ఇలా కింకరులనే రాక్షసులను మట్టుబెట్టి, ఇంకా యుద్ధకాంక్ష తీరక, హనుమంతుడు ద్వారం వద్దనే వేచి ఉన్నాడు.

ఈలోపల పారిపోయిన రాక్షసులు కొందరు రావణుడి వద్దకు వెళ్ళి, కింకరులందరూ హనుమంతుడి చేత చచ్చారని చెప్పారు. రావణుడు మండిపడి గుడ్లు తిప్పుతూ, హనుమంతుడితో యుద్ధం చెయ్యమని ప్రహస్తుడి కొడుకైన జంబుమాలి అనే వాణ్ణి, యుద్ధంలో ఓటమి ఎరగని మహా శూరుణ్ణి ఆజ్ఞాపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *