సుమంతుడు అయోద్యకు తిరిగి వెళ్ళుట
అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళి పోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి, రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన అయిదు రోజులకు తిరిగివచ్చాడు.
దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి, సింహానంపైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు కొపోద్రేకంతో స్పృహతప్పి కింద పడిపోయాడు.
కౌసల్య సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, “మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపి వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైక ఎమున్నా అనుకుంటుంది అనా? ఆవిడగారిక్కడ లేదుగా!” అని చెప్పింది. దశరథుడితో బాటు కౌసల్యా, ఇతర అంతఃపుర కాంతలూ రోదనాలు చేశారు.
నా ఆజ్ఞకు ఎంత విలవ ఉన్నదో నాకు తెలియదు. నీవు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా! లేదా నన్ను ఆ రాముడి దగ్గరికైనా తీసుకుపో,” అన్నాడు దశరథుడు.
కౌసల్య కూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకు పొమ్మన్నది. సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ, రామలక్ష్మణులు సులువుగా అరణ్యవాసం పూర్తి చేయగలరనీ, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదనీ, రాముడు లేని అయోధ్య ఆమెకు ఆరణ్య మనిపించి ఉండేదని అన్నాడు.
మర్నాడంతా కౌసల్య దశరథుణ్ణి దెప్పుడు మాటలతో బాధించింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టు కున్నది. అసలే బాధ పడుతున్న తనను దెప్పడు మాటలతో హింసించవద్దని దశరథుడు చేతులు జోడించి కౌసల్యను వేడు. కున్నాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది.