సీతారామ లక్ష్మణులు అడవికి ప్రయాణం అవ్వుట

రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ సమస్కారం చేసి, తల్లితో, “అమ్మా దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్ను మూసి తెరిచేసరికి గడిచిపోతాయి,” అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్క తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసు కున్నాడు. ఆమె, “లక్ష్మణా, ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య ! అన్నను ఆపద రాకుండా చూసుకో, నాయనా !” అని చెప్పింది.

ఆ ముగ్గురూ బయటికి వచ్చారు. పెళ్ళి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా, ముందుగా రధమెక్కి కూచున్నది. తరవాత రామలక్ష్మణు లెక్కి కూచున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలూ, ఆయుధాలూ, కవచాలు, చిన్న గునపమూ, బుట్టా ఉంచాడు. రథం కదిలింది.

విధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తు తున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కొందరు రధానికెదురుగా పచ్చి సుమంత్రుణ్ణి, ” మళ్ళీ ఎప్పటికి చూస్తామో, కాస్సేపు, చూడనియ్య. రథం మెల్లిగా తోలు, బాబూ” అని బతిమాలారు.

ఉన్నట్టుండి దశరథుడు, “నేను రాముణ్ణి చూడాలి!” అంటూ తన యింటి నుంచి బయటికి వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో బాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. “సుమంత్రుడా, రథం కాస్త ఆపు” అని కేక పెట్టాడు దశరథుడు. ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు.

వెనక్కు తిరిగి చూస్తున్న రాముడి కి దృశ్యం దుర్బరమయింది. అతను సుమం త్రుడితో, “రథం వేగంగా తోలు. ఈ దుఃఖాన్ని ఎంత సేపు చూడగలను? ఎలా చూడటం? అంతగా మహారాజు అడిగితే, జనం చేసే గోలలో ఆయన కేక వినిపించ లేదని బొంకు,” అన్నాడు. రాముడు రథాన్ని వెన్నంటి వచ్చే వారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుర్రాలను వడిగా తోలాడు.

దశరథుడితో మంత్రులు, “మహారాజా, వాళ్ళు త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువదూరం సాగనంప గూడదు,” అని చెప్పారు. దశరథుడు శరీర మంతా చెమటలు దిగగారుతూ, భార్యలతో సహా అక్కడే నిలబడి, క్రమంగా దూరమై పోతున్న రథాన్ని చూశాడు.

రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్లి పోవటంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండి పోయింది. దానితోబాటే అయోధ్యా నగరమంతా పాడు పడినట్టయి పోయింది. ఎక్కడి పనులక్కడ ఆగి పోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగి పోయినట్టుగా విస్తుపోయారు.

రాముడి వెనుక కొంతదూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్యా, కైకేయీ చెరొక రెక్కా పట్టుకుని నిల బెట్టారు. దశరథుడు కైకేయితో, “నన్నంటకు. నేను నీ భర్తను కాను. నిన్ను విడిచి పెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు” అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు. 

ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్యా దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది.

ఈ లోపల సీతా రామ లక్ష్మణు లెక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి ఆరణ్యవాసం వెళ్లవద్దని నిర్బంధం చెయ్యసాగారు. రాముడెన్ని చెప్పినా వారు వినిపించుకోలేదు. 

సుమంత్రుడు గుర్రాలను విప్పి, కడిగి, నీరు తాగించి, నది ఒడ్డున తిరగనిచ్చి, తరవాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడూ, లక్ష్మణుడూ తయారుచేసిన ఆకుల పక్కమీద పడుకుని రాముడూ, సీతా నిద్రపోయారు. సుమంత్రుడూ, లక్ష్మణుడూ రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణ వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపోయారు.

తెల్లవారుతూండగా రాముడు లేచి, ఇళ్ళు వాకిళ్ళు విడిచి పెట్టి చెట్ల కింద నిద్రపోతున్న పౌరులను చూసి, లక్మలుడితో, “వీరంతా లేవకముందే మనం రథమెక్కి సాగిపోవటం మంచిది. లేకపోతే వీరు మనని వదలరు. మనతోపాటే వచ్చేస్తారు” అన్నాడు.

సుమంత్రుడు రథం సిద్ధంచేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, “రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా. అప్పుడు జనం మసం వెళ్లిన జాడ తెలుసుకోలేక పోతారు.” అన్నాడు. సుమంత్రుడు రథాన్ని . అలాగే తిప్పి తెచ్చినాక సీతా రామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూచుని ఉత్తరంగా బయలుదేరారు. తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతా రామ లక్ష్మణులు లేరు. తమను వంచించిన నిద్రనూ, దైవాన్ని తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్లారు. తెల్లవారే సరికే రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి, కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *