సీతారామ లక్ష్మణులు శరభంగ మహాముని ఆశ్రమానికి వెల్లుట

సీతారామ లక్ష్మణులు శరభంగ మహాముని ఆశ్రమాన్ని చేరవస్తూ ఉండగా రాముడి కొక వింత దృశ్యం కనిపించింది. భూమికి ఎత్తుగా ఒక కాంతివంతమైన రథం కనిపించింది. దానికి ఆకు పచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి. సూర్యుడులాగా వెలిగి పోతున్న ఒక మహా పురుషుడు, కాంతివంతమైన ఆభరణాలూ, స్వచ్ఛమైన బట్టలూ ధరించి, నేలను అంట కుండా ఆశ్రమంకేసి పోవటం కనిపించింది. ఆయన వెంట ఆయనలాటి వాళ్ళే అనేక మంది పరివారంగా ఉన్నారు. అందరూ పాతికేళ్ళ వయస్సుగల వాళ్ళే.

రాముడు లక్ష్మణుడికి ఈ దృశ్యం చూపించి, “లక్ష్మణా, అది దేవేంద్రుడు లాగుంది. నేను వెళ్ళి తెలుసుకువస్తాను. నీవు, సీతా ఇక్కడే ఉండండి,” అంటూ శరభంగాశ్రమం కేసి బయలుదేరాడు..

ఈ వచ్చినది నిజంగా దేవేంద్రుడే. శర భంగ మహామునిని బ్రహ్మలోకానికి తీసుకు వెళ్ళటానికి స్వయంగా తన రథంలో వచ్చాడు. రాముడు తన కోసం వస్తున్నాడని గ్రహించి ఇంద్రుడు శరభంగుడితో, “రాముడు నన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు. అతనివల్ల ఒక మహాకార్యం జరగాలి. అది ముగిసినదాకా అతనికి కనపడటం నా కిష్టం లేదు.” అని చెప్పి తన రథ మెక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

తన ప్రయత్నం విఫలంకాగా రాముడు సీతాలక్ష్మణులను కలుపుకుని శరభంగుడి వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పటికే శరభంగుడు అగ్ని ప్రవేశం చెయ్యటానికి ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు.

రాముడు దేవేంద్రుని గురించి అడగగా ఆయన, “అవును, నేను తపశ్శక్తి చేత బ్రహ్మలోకం సాధించుకున్నాను. నన్ను తీసుకు పోవాలని ఇంద్రుడు వచ్చాడు. నీపు నా కోసం వస్తున్నావని తెలిసి, నిన్నుచూసి మరీ పోదామనుకున్నాను. నేను సాధించిన బ్రహ్మలోక స్వర్గలోకాలను నీకు దానం చేస్తాను, పుచ్చుకో,” అన్నాడు.

“స్వామీ, నాకు కావలిసిన లోకాలను నేనే సంపాదించుకుంటాను. ప్రస్తుతం ఈ అరణ్యంలో నాకు వాసయోగ్యమైన చోటేదో చెప్పండి,” అన్నాడు రాముడు.

“ఈ యేటి వెంబడే పోతే సుతీక్ష మహాముని ఆశ్రమం వస్తుంది. ఆయన నీకు తగిన చోటు చూపించ గలుగుతాడు. పాము కుబుసాన్ని విడిచినట్టు నేనీ దేహాన్ని విడవటం చూసి మరీ వెళ్ళండి,” అంటూ శరభంగ మహాముని అగ్నిలో ఆజ్యం పోసి అందులో ప్రవేశించాడు. ఆయన శరీరం అస్థికలతో సహా దగ్ధమయాక, ఆయన ఇరవై అయిదేళ్ళ ప్రాయంగల దివ్య శరీరంతో అగ్ని నుంచి వెలువడటం చూసి సీతా రామలక్ష్మణులు నివ్వెర పోయారు.

శరభంగుడు దేహం చాలించగానే ఆశ్రమంలోని మునులందరూ రాముడి. వద్దకు పచ్చి, “రామా, పంపాతీరంలోనూ, చిత్రకూటంలోనూ, మందాకినీ తీరంలోనూ ఉండే ఋషులను రాక్షసులు చెప్పరాని హింసలు పెడుతున్నారు. వాళ్ళచేత చచ్చిపోయిన మునుల శరీరాలు ఎలాపడి ఉన్నాయో చూడు. క్రూరులైన ఈ రాక్షసుల బారినుంచి ఋషులను కాపాడాలి,” అన్నారు.

“నేను అరణ్యవాసం రావటంలో తండ్రి అజ్ఞను పాలించే మేలు ఒకటేననుకున్నాను, ఇప్పుడు నాకు మీ మూలంగా మరొక మేలు కూడా చేకూరుతుందన్న మాట, నేను తప్పక రాక్షసుల బారి నుండి మునులను కాపాడతాను,” అని రాముడన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *