రామ లక్ష్మణులు విరాధుడిని సంహరించుట

రాముడు సీతా లక్ష్మణులతో సహా మహా భయంకరమైన దండకారణ్యం ప్రవేశించాడు. అరణ్యం అంచునే ఋష్యాశ్రమాలున్నాయి. ఆశ్రమాలుండే ప్రాంతం అందంగానూ, వాసయోగ్యంగానూ ఉన్నది.

అక్కడ ఋషులు సీతా రామలక్ష్మణులకు చక్కని ఆతిథ్య మిచ్చి, “రామా, రాజు దుష్టశిక్షణ చేస్తాడు గనక ప్రజలకు తండ్రి వంటి వాడు. మేము నీ రాజ్యంలో ఉన్నాం. నీవు పట్టణములో ఉన్నా, అరణ్యంలో ఉన్నా మాకు రాజువే. అందు చేత నీవే మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి,” అన్నారు.

రాముడు ఆ ఆశ్రమాలలో రాత్రి గడిపి ఉదయం కాగానే సీతా లక్ష్మణులతో సహా నిర్జనమైన భీకరారణ్యం ప్రవేశించాడు. ఈ భయంకరారణ్యంలో అందమన్నది లేదు. ఎటు చూసినా భయంకరమైన దృశ్యాలే. చెట్లు చీకాకుగా ఉన్నాయి. నీటి మడుగులు అసహ్యం పుట్టిస్తున్నాయి. సమస్త భీకర జంతువులూ ఆ అరణ్యంలో తిరుగాడుతున్నాయి.

దారిలేని ఆ అరణ్యంలోపడి వారు పోతూండగా వారికొక రాక్షసుడు ఎదురయాడు. వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు. పెద్ద నోరు; పెద్ద పొట్ట చూస్తేనే రోత పుట్టే. ఆకారం! వాడి చేతిలో ఒక పెద్ద శూలం ఉన్నది. దానికి సింహాలూ, పులులూ, తోడేళ్ళూ, జింకలూ, ఒక ఏనుగు తలాగుచ్చి ఉన్నాయి. ఆ రాక్షసుడు సీతా రామ లక్ష్మణులను చూస్తూనే యముడిలాగా మీదికి వచ్చి, సీతను అవలీలగా ఎత్తి చంకన పెట్టుకుని, “మీరు ఆయువు తీరి ఈ అరణ్యంలోకి వచ్చినట్టున్నారు. మీరు చూస్తే ఋషి వేషాలు ధరించారు, మరి మీ వెంట ఈ ఆడది ఎందుకున్నది? నేను దీన్ని పెళ్ళాడేస్తాను. ఋషులను తినటం నాకు అలవాటే. అందు చేత మిమ్మల్ని చంపి మీరక్తం తాగేస్తాను,” అన్నాడు.

రాక్షసుడి చంకలో చిక్కి గిలగిలా కొట్టు కుంటున్న సీతను చూడగానే రాముడికి దుఃఖంతో నోరార్చుకు పోయింది. అతను లక్ష్మణుడితో, “ఏ ఉద్దేశంతో కైకేయి నన్ను అడవికి పంపిందో ఆ ఉద్దేశం కొంచెం కొంచెమే నేరవేరుతున్నది. లక్ష్మణా, తండ్రి చనిపోయినా, రాజ్యం పోయినా కలగని బాధ వీడు సీతను తాకటం చేత కలుగు తున్నది!” అన్నాడు కన్నీరు కార్చుతూ

రాముడి దుఃఖం చూసి లక్ష్మణుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. “నేను పక్కన ఉండగానే అలా విచారిస్తావేమిటి? ఒక్క బాణంతో నేను వీడి ప్రాణాలు తీస్తాను,” అని అతను రాముడితో అని, రాక్షసుడితో వెటకారంగా, “నాయనా, ఈ అరణ్యంలో సుఖంగా తిరిగే నువ్వెవడవు” అన్నాడు.

“అడిగేవాణ్ణి నేను చెప్పేది మీరు! ఇటుకేసి ఎక్కడికి పోతున్నారు?” అన్నాడు. రాక్షసుడు.

‘”మేము క్షత్రియులం. సదాచారం గల వాళ్ళం. అరణ్యవాసం చేస్తున్నాం. నీ సంగతి చెప్పు” అన్నాడు రాముడు.

“నా సంగతి చెబుతా విను. నా తండ్రి జయుడు, తల్లి శతహ్రద. నా పేరు విరాధుడు. బ్రహ్మను గురించి పెద్ద తపస్సు చేసి నేను ఏ ఆయుధంతో కూడా చావకుండా వరం పొందాను. అందుచేత మీరీ ఆడదాని మీద ఆశ వదులుకుని, పారిపోయి ప్రాణాలు రక్షించుకోండి. మీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం?” అన్నాడు రాక్షసుడు.

రాముడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. “నీచుడా, పర స్త్రీహరణం చేస్తావా? నీకు కాలం మూడింది,” అంటూ అతను విల్లు ఎక్కుపెట్టి ఏడు కరుకైన బాణాలు రాక్షసుడి శరీరంలో దిగిపోయేటట్టు కొట్టాడు.

విరాధుడు ఎగతాళిగా నవ్వుతూ సీతను కింద దించి, ఒక్కసారి ఒళ్ళు విరుచుకునే సరికి ఏడు బాణాలూ వాడి శరీరం నుంచి బయటికి వచ్చి, కింద పడిపోయాయి. వాడు కోపంతో శూలం ఎత్తి రామలక్ష్మణుల పైకి వచ్చాడు.

రాముడు రెండు బాణాలతో వాడి శూలాన్ని ముక్కలు చేశాడు.

కాని విరాధుడు లక్ష్య పెట్టక వారిని పట్టుకోవటానికి యత్నించాడు. రామ లక్ష్మీ ణులు కత్తులు దూసి వాణ్ణి ఎన్నో పోట్లు పొడిచారు. ఆ పోట్లనుకూడా లక్ష్య పెట్టక వాడు ఆ ఇద్దరినీ అవలీలగా చెరొక భుజం మీదికి ఎత్తుకుని అరణ్యానికి అడ్డంపడి నడవసాగాడు.

“వీడిలా మనని ఎక్కడికి తీసుకు పోతాడో చుద్దాం,” అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు.

కాని సీత మాత్రం వాడి చేతులు పట్టు కుని, గట్టిగా ఏడుస్తూ, “అయ్యో, ఈ రాక్షసడు రామ లక్ష్మణులను ఎత్తుకు పోతున్నాడు. నన్ను తోడేళ్ళో పెద్దపులులో మింగేస్తాయి!. “ఓ రాక్షసుడా, నీకు దణ్ణం పెడతాను. వారిని వదిలేసి నన్ను తీసుకుపో!” అన్నది.

సీత చేసిన ఆర్తనాదం వినగానే రామ లక్ష్మణులు కూడబలుక్కుని, తమ చేతులలో ఉన్న కత్తులతో విరాధుడి భుజాలు రెండూ సరికేశారు. వాడు కాస్తా పర్వతం కూలినట్టు కూలాడు. అలా కింద పడిన అ రాక్షసుణ్ణి రామ లక్ష్మణులు పిడికిళ్ళ తోనూ, మోకాళ్ళతోనూ కుమ్మి మన్నంలోకి ఎముక లేకుండా చితక బొడిచారు. అప్పటికీ వాడి ప్రాణం పోలేదు.

విరాధుడు కదలకుండా వాడి కంఠంపైన కాలువేసి బలంగా తొక్కి పట్టి, రాముడు, “లక్ష్మణా వీణ్ణి అలాగే పూడ్చేద్దాం. ఒక పెద్ద గొయ్యి తవ్వు,” అన్నాడు. లక్ష్మణుడు వాడి పక్కనే గొయ్యి తవ్వాడు. రామ లక్ష్మణులు వాణ్ణి ఆ గోతిలోకి తోసేశారు. గోతిలో పడిపోతూ వాడు పెట్టిన పెడబొబ్బకు అరణ్యమంతా దద్దరిల్లింది. తరువాత గుంటను రాళ్ళతో పూడ్చేశారు. రామలక్ష్మణులు.

రాముడు సీతను కౌగలించుకుని, ధైర్యం చెప్పి, లక్ష్మణుడితో, “మనం ఇలాటి అరణ్యానికి అలవాడుపడిన వాళ్ళం కాదు. అందుచేత ఇక్కడ ఉండటం మంచిది కాదు. త్వరగా శరభంగ మహా ముని ఆశ్రమానికి పోదాం,” అన్నాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *