సీతారామ లక్ష్మణులు సుతీర్ణ మహాముని ఆశ్రమానికి వెల్లుట

రాముడు సుతీర్ణుడి ఆశ్రమానికి బయలు దేరుతుంటే వైఖానసుడు మొదలైనవారు అతని వెంట కదిలారు. వారందరూ కొన్ని నదులను దాటి, ఒక పర్వతం పక్కగా నున్న అరణ్యం ప్రవేశించారు. ఆ అరణ్యం లోనే సుతిష్ట మహాముని ఆశ్రమం ఉన్నది.

రాముడు తన పేరు చెప్పుకుని నమస్కారం చెయ్యగానే సుతీక్షు డతన్ని కౌగలించుకుని, “రామా, నీవు చిత్రకూటం చేరినప్పటి నుంచీ నీ వార్తలు వింటూనేఉన్నాను. నేను చాలా తపస్సు చేశాను అదంతా నీ కిస్తాను, సీతా లక్ష్మణులతో అన్ని లోకాలూ అనుభవించు” అన్నాడు.

“స్వామి, లోకాలన్నీ నేనే సంపాదించు కుంటాను. నాకి అరణ్యంలో నివాసయోగ్య మైన స్థానం ఉంటే చెప్పండి చాలు” అన్నాడు రాముడు.

“కావాలంటే ఈ ఆశ్రమంలోనే ఉండ వచ్చు. ఇక్కడ మృగ బాధ తప్ప మరే బాధా లేదు,” అని సుతీక్షుడు చెప్పాడు.

“నేను పొరపాటున ఆశ్రమ మృగాలను చంపినట్టయితే మీకు కోపం రావచ్చు. అందుచేత ఈ ఆశ్రమం నాకు వద్దు.”. అన్నాడు రాముడు.

సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి అక్కడే సుఖంగా గడిపారు. మర్నాడు ఉదయం కాలకృత్యాలు ముగించి సుతీర్ణుడితో, “స్వామీ, నా వెంట వచ్చిన మునులు తొందర చేస్తున్నారు. మాకు సెలవిప్పించండి,” అన్నాడు.

సీత రామలక్ష్మణుల ఆయుధాలు తెచ్చి ఇచ్చింది. దారిలో సీత రాముడితో, “ప్రపంచంలో మూడు మహా పాపాలు: అబద్ధం చెప్పటమూ, పరస్త్రీని కోరటమూ, ఆకారణ, వైరమూనూ. అన్నిటిలోకీ ఆకారణ వైరం చాలా చెడ్డది. మొదటి రెండు పాపాలూ నిన్నంటలేవు, నాకు తెలుసు. కాని మనకు ఏ కీడూ చేయని రాక్షసులను నీ వెందుకు చంపాలి? వారిని చంపుతానని ఈ ఋషులు కెందుకు మాట ఇవ్వాలి? అసలు ఆయుధాలు వెంట ఉండటమే ఒక కీడు. పూర్వం ఒక ముని తపస్సు చేసు కుంటూ ఉంటే తపోభంగం కలిగించటానికి ఇంద్రుడు ఒక భటుడి రూపంలో వచ్చి తన కత్తిని భద్రంగా దాచి ఉంచమని, మళ్ళీ వచ్చి తీసుకుంటాననీ చెప్పాడట. ఆ ముని ఆ కత్తిని కాపాడటానికి వెంట ఉంచుకుని తిరుగుతూ, మొదట్లో పళ్ళూ ఫలాలూ కోశాడట. కాని రానురాను అతడి బుద్ధి హింసవైపు మళ్ళి, చివరకు చచ్చి నరకానికి వెళ్ళాడట. అందుచేత మనం కనీసం ఈ అరణ్యవాస కాలంలో నైనా ఆయుధాలు విసర్జించి తపస్సు చేసు కుందాం. తిరిగి అయోధ్యకు వెళ్ళాక క్షత్రియధర్మం పాటించవచ్చు. ఇది ఆదేశం. కాదు, సూచన మాత్రమే,” అన్నది.

రాముడు సీతతో, ” ఆ మునులందరూ ప్రాధేయ పడితే వారి కోరికపై, రాక్షసులను చంపి వారి తపస్సు నిర్విఘ్నంగా కొనసాగిస్తానని మాట ఇచ్చాను. నిన్నూ, లక్ష్మణుణ్ణి, నా ప్రాణాలనూ వదులుతాను గాని చేసిన ప్రతిజ్ఞ విడవను,” అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *