లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించుట

దుఃఖంతో మతి చెడి ఉన్న రాముడితో విభీషణుడు మరొక విషయం కూడా బయట పెట్టాడు. నికుంభిలా హెూమం చేస్తూండగా మధ్యలో ఎవడు నీతో యుద్ధం చేస్తాడో వాడి చేతిలో నీకు చావున్నది,” అని బ్రహ్మ ఇంద్రజిత్తుకు చెప్పాడు. ఇప్పుడా హెూమాన్ని భగ పరచటానికి అవకాశం దొరికింది.

తరవాత రాముడి ఆజ్ఞ పొంది లక్ష్మణుడు సుగ్రీవ హనుమంత విభీషణులనూ, వాసర సేననూ వెంట బెట్టుకుని, ఇంద్రజిత్తు హోమ కార్యం భంగం చేసి అతణ్ణి చంపటానికి బయలుదేరాడు. వారి దారికి అడ్డంగా రాక్షస సేన నిలబడి ఉన్నది. ఇంద్రజిత్తు హోమం పూర్తి చేసే లోపలనే ఆ రాక్షస సేనను నిర్మూలించ వలసి ఉంటుందని లక్ష్మణుడితో విభీషణు ఉన్నాడు. ఆ సేన నిర్మూలమయితే హెూమం ముగియకపోయినా ఇంద్రజిత్తు బయలుదేరి వస్తాడు, అప్పుడతన్ని తేలికగా కడతేర్చవచ్చు.

ఈ మాట విని వానరసేన రాక్షస సేనపై విరుచుకుపడింది. ఉభయపక్షాలూ దారుణంగా పోరాడాయి. వానరులూ, రాక్షసులూ కూడా పెద్ద సంఖ్యలోనే చచ్చారుగాని, రాక్షసులు వానరుల ముందు నిలవలేక బెదిరిపోయారు.

ఆ వార్త విని ఇంద్రజిత్తు హోమ కార్యం పూర్తికాకుండానే లేచి వచ్చి రథమెక్కాడు. రాక్షససేన అతని రథం చుట్టూ మూగింది.

కాని హనుమంతుడు పర్వతాకారం ధరించి, పెద్ద పెద్ద చెట్లతో రాక్షసులను చావ మోద సాగాడు. రాక్షసులు వేల సంఖ్యలో హను మంతుణ్ణిు చుట్టు ముట్టారు. తన మీద రక రకాల ఆయుధాలను ప్రయోగించే ఆ రాక్షసు లందరితోనూ హనుమంతుడు ఒకేసారి భయంకరంగా యుద్ధం చేశాడు.

రాక్షసులను అదేపనిగా హనుమంతుడు మట్టుపెట్టుతూ ఉండటం చూసి ఇంద్రజిత్తు తన రథాన్ని అతనికేసి నడిపించాడు. ఇంద్రజిత్తు వేసే బాణాలతో తీవ్రంగా గాయపడి హనుమంతుడు, “దుర్మార్గుడా, నీవు నిజంగా వీరుడవైతే ఆయుధాలు లేకుండా వట్టి చేతులతో నాతో యుద్ధం చెయ్యి,” అని అతడి కేసి వెళ్ళాడు.

“ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బాణాలతో చంపెయ్యగలడు. నీవు వెళ్ళి ఇంద్రజిత్తు నెదుర్కొని యుద్ధం చేసి చంపెయ్యి.” అని లక్ష్మణుడితో విభీషణు అన్నాడు.

వెంటనే ఇద్దరూ కలిసి నికుంభిల కేసి వెళ్ళారు. అది నల్లని రాక్షసిలాగా కనిపించే జమ్మి చెట్టు కింద ఉన్నది. ఇక్కడే ఇంద్రజిత్తు భూతాలకు బలులిచ్చి, యుద్ధానికి బయలుదేరుతాడు.

“లక్ష్మణా ఇంద్రజిత్తు జమ్మి చెట్టును ప్రవేశించక ముందే అతన్ని రథాశ్వసారధి సహితంగా నిర్మూలించు,” అన్నాడు విభీష ణుడు. లక్ష్మణుడు చప్పున జమ్మి చెట్టు మొదలు వద్దకు వెళ్ళి నిలబడి, ఇంద్ర జిత్తును తనతో యుద్ధానికి రావలసిందిగా ఆహ్వానించాడు.

ఇంద్రజిత్తు లక్ష్మణుడితో ఏమీ అనక, విభీషణుడి కేసి తిరిగి, “విభీషణా, నీకు కులాభిమానం లేదు. ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన వాడివి నాకెలా ద్రోహం తల పెట్టావు? నీకు బంధుత్వం గాని, మమకారం గాని, ధర్మం గాని లేదు. అయిన వారిని వదిలి శత్రువులకు భృత్యుడవయావు! అయిన వారి మధ్య గౌరవంగా ఉండటం కన్న శత్రువుల వద్ద నీచుడుగా ఉండటం నీకు సమ్మతమయింది. నీ బుద్ధి నశించింది. అందుకే నా హెూమానికి విఘ్నం కలిగించటానికి లక్ష్మణుణ్ణి ప్రోత్సహించి జమ్మిచెట్టు దగ్గరికి తీసుకు వచ్చావు. ఇలాటి పని ఇంకెవడూ చెయ్యడు,” అన్నాడు.

ఆ మాటలకు విభీషణుడు, “నా సంగతి. తెలియనట్టుగా ఎందుకిలా మాట్లాడతావు? నేను రాక్షసుడనై పుట్టానే గాని, నాది రాక్షస స్వభావం కాదు. నేను అధర్మం సహించ లేకనే నా సొంత అన్నను వదిలిపెట్టేశాను. మంచి వాడైనా పావులను అంటిపెట్టుకుని పాపాత్ముడౌతాడు. దుష్ట సర్పాలను దూరంగా ఉంచాలి. పర ధనాన్ని, పర స్త్రీలను కోరటమూ, స్నేహితులను నమ్మక పోవటమూ నాశహేతువులు, వాటిమూలంగా నీ తండ్రీ, నీవూ కూడా చావనున్నారు. మాయా సీతను వధించి రామ లక్ష్మణులకు అవమానం కలిగించిన నీవు బతికి ఉండటానికి తగవు. లక్ష్మణుడి చేతిలో చచ్చి నరకానికి వెళ్ళు,” అన్నాడు.

ఇంద్రజిత్తు మహాకోపంతో అస్త్రాలు ఎదురుగా ధరించి రధ మెక్కి, హనుమంతుడి వీపు మీద ఉన్న లక్ష్మణుడితో, “రాత్రి యుద్ధంలో నిన్నూ, నీ అన్ననూ, నా బాణాలతో మూర్ఛపోగొట్టాను. అది నీవు మరిచి అయినా ఉండాలి, లేక నీకు చావు దగ్గిర పడి అయినా ఉండాలి,” అన్నాడు.

దానికి లక్ష్మణుడు, “ఓరి రాక్షసుడా ? నీవు మమ్మల్ని మాటలతోనే చంపుతున్నావు గాని నిజంగా చంపటం నీ తరం కాదు. కార్యశూరుడు ప్రగల్భాలు పలకడు. నీవు దొంగ లాగా మాకు కనిపించకుండా యుద్ధం చేశావు. అది వీరుడు చేసే పనికాదు. ‘ఇలా కనిపిస్తూ నీ ప్రతాపం ఏ పాటిదో చూపు,” అన్నాడు.

మరుక్షణమే ఇంద్రజిత్తు అమిత వేగంగా లక్ష్మణుణ్ణి తన తీక్షమైన బాణాల పరం పరతో కొట్టి సింహనాదం చేశాడు. లక్ష్మిణుడు కూడా ఇంద్రజిత్తును క్రూరమైన బాణాలతో కొట్టాడు. ఇద్దరూ సమంగా యుద్ధం సాగించారు.

మధ్యలో విభీషణుడు లక్ష్మణుడితో,”ఇంద్రజిత్తు ధైర్యం సన్నగిల్లుతున్నది.వాడి ముఖంలో వెలవెలపాటు కనిపిస్తున్నది. వీలయినంత త్వరలో వీణ్ణచంపెయ్యి,” అని హెచ్చరించాడు. నిజంగానే లక్ష్మణుడి బాణాలకు ఇంద్రజిత్తు క్షణంపాటు సృహ తప్పి, అంతలోనే మళ్ళీ తెప్పిరిల్లాడు. మళ్ళీ ఇద్దరూ యుద్ధం సాగించారు. ఇద్దరూ అమితమైన పట్టుదలతో పోరాడుతూ ఒకరి నొకరు బాగా గాయ పరచుకున్నారు.

వారి యుద్ధం చూస్తూంటే విభీషణుడికి కూడా యుద్ధం చెయ్యాలనిపించింది. అతను తన నలుగురు మంత్రులతో సహా రాక్షసులను సంహరించుతూ, వానరులతో, “వానర వీరులారా, ఇంక రావణుడికి మిగిలి ఉన్న వీరుడు ఈ ఇంద్రజిత్తు ఒక్కడే. మిగిలిన వాళ్ళ నందర్నీ మీరే చంపేశారు.. వీడు నా అన్న కొడుకు, అందుచేత నా చేత్తో నేను వీణ్ణి చంపలేను. ఆ పని లక్ష్మణుడు చేస్తాడు. ఇంద్రజిత్తుకు అండగా ఉన్న రాక్షసులను మీరు చంపేసి, ఇంద్రజిత్తు చావుకు తోడ్పడండి.” అన్నాడు.

వానర వీరులు ఎంతో ఉత్సాహంతో తోకలాడిస్తూ, సింహనాదాలు చేస్తూ రాక్షసులపైన తలపడ్డారు.

ఈ లోపల లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారధిని చంపేశాడు. ఇంద్రజిత్తు తనరథాన్ని తానే నడుపుకుంటూ యుద్ధం సాగించాడు. ఆ సమయంలో నలుగురు వానరవీరులు ఇంద్రజిత్తు యొక్క రథాశ్వాల పైనపడి వాటిని చంపేశారు, అతని రధాన్ని విరిచి పారేశారు. ఇంద్రజిత్తు నేల పైకి దిగి లక్ష్మణుడితో యుద్ధం సాగించాడు.

అతను తన రాక్షసులతో “నేను రహస్యంగా నగరంలోకి పోయి ఇంకో థంతో తిరిగి వస్తాను. నాకు అడ్డంగా నిలబడి మీరు వానరులతో యుద్ధం చేస్తూ ఉండండి. వానరులు నా దారికి అడ్డం రాకుండా చూడండి,” అన్నాడు. అతను రాక్షసులు వెనక నుంచి, వానరుల కంట పడకుండా లంకా నగరంలోకి వెళ్ళి పోయాడు. అతను మరొక రథం పైన యుద్ధ భూమికి తిరిగి వచ్చి, లక్ష్మణ విభీషణుల నెదుర్కొన్నాడు. ఎప్పుడు వెళ్ళాడో తెలియ కుండా మరొక రథంలో ప్రత్యక్ష మైన ఇంద్రజిత్తు ఉపజ్ఞను వాళ్ళిద్దరూ మెచ్చుకున్నారు.

మళ్ళీ ఇంద్రజిత్తూ, లక్ష్మణుడూ యుద్ధం సాగించారు, మరొకసారి లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారధిని చంపాడు. కాని రథాశ్వాలు సారధి అవసరం లేకుండానే రథాన్ని నడప వలిసిన విధంగా నడిపాయి. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో బాటు విభీషణుడి మీద కూడా బాణాలు వేశాడు. విభీషణుడు మండిపడి తన గదతో ఆంద్రజిత్తు రథాశ్వాలను చంపేశాడు.

ఇంద్రజిత్తు నేల పైకి దూకి, శక్తి తీసు కుని విభీషణుడి పైన విసిరాడు. లక్ష్మణుడు దాన్ని తన బాణాలతోనే పది ముక్కలుగా నరికేశాడు. తరవాత ఇంద్రజిత్తూ, లక్ష్మణుడూ ఒకరి పైన ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. అవి ఒక దాన్నొకటి తాకేసరికి నిప్పు రవ్వలూ, మంటలూ, పొగా బయలుదేరాయి. ఇలా కొంత సేపు ఒకరి అస్త్రాల నొకరు ధ్వంసం చేసుకున్నాక లక్ష్మణుడు ఒక దివ్య బాణంతో ఇంద్రజిత్తు తల నరికేశాడు.

విభీషణుడూ, వానరులూ సింహ నాదాలు చేశారు. రాక్షసులు పారిపోయారు.

ఇంద్రజిత్తును చంపేసి వానరులకు మితి లేని ఆనందాన్ని కలిగించి, లక్ష్మణుడు హనుమంతుణ్ణి, విభీషణుణ్ణి వెంటబెట్టుకుని సుగ్రీవుడూ, రాముడూ ఉన్న చోటికి వెళ్ళాడు. ” ఇంద్రజిత్తు చచ్చాడు,” అని లక్ష్మణుడు చెప్పగానే, రాముడు అతన్ని కౌగలించుకుని, ” ఇక రావణుడూ చచ్చిన వాడే, లక్ష్మణా, నీవు చేసినది చాలా గొప్ప పని! ” అన్నాడు.

వైద్యంలో నిపుణుడైన సుషేణుడు వచ్చి, లక్ష్మణు విభీషణులకు గుచ్చుకున్న బాణాలు తీసేసి, చికిత్స చేశాడు. వానరసైనికులు ఉత్సాహంతో గంతులు వేయసాగారు.

దేవేంద్రుణ్ణి సైతం జయించిన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చి పోయాడని వినగానే రావణుడు మూర్ఛ పోయాడు. అతను స్పృహ తెలిసి ఇంద్రజిత్తు కోసం చాలాసేపు దుఃఖించి, దుర్భరమైన రోషంతో, “అస్తమానమూ రాముణ్ణి ధ్యానించే సీత బతికి ఉండటం దేనికి? ఇప్పుడే చంపేస్తాను “అంటూ కత్తి దూసి సీత ఉన్న చోటికి వేగంగా. బయలుదేరాడు. అతన్ని మంత్రులూ, భార్యలూ వెంబడించిరాసాగారు. మంత్రులు వారించటానికి యత్నిస్తే రావణుడు వినిపించుకోలేదు.

సీత అతడి రౌద్రాకారాన్ని అంత దూరం లోనే చూసి తనకు చావు మూడిందని భయపడింది.

ఆనాడే హనుమంతుడి వీపు మీద ఎక్కి రాముడి వద్దకు వెళ్ళిపోనందుకు పశ్చా త్తాపపడింది.

చిట్టచివరకు రావణుడికి సుపార్శ్వుడనే మంత్రి అడ్డంపడి, “నీ వంటి బుద్ధి మంతుడు ఆడదాన్ని చంపట మేమిటి? చాతనయితే సీతను వశపరుచుకో. ఈ కోప మంతా రాముడి పైన చూపించు. ఇవాళ కృష్ణ చతుర్దశి. యుద్ధ ప్రయత్నం ప్రారంభించి, రేపు అమావాశ్య నాడు రామలక్ష్మ ణులతో యుద్ధం చెయ్యి,” అన్నాడు. సుపార్శ్వు డన్న మాటలు నచ్చి, రావణుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు.

అతను తన సేనాపతులతో, “ఇవాళ మీరంతా వెళ్ళి రాముడితో యుద్ధం చెయ్యండి. అతన్ని మీరు చంపలేకపోయినా, మీతో పోరాడి నీరసించి ఉండే రాముణ్ణి నేను రేపు అవలీలగా చంపుతాను,”. అని చెప్పాడు.

రాక్షసులు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి వానరులపై దారుణ యుద్ధకాండ సాగించే సరికి రాముడు పూనుకుని, వారిని తన బాణాలతో లక్షల సంఖ్యలో అంతమొందించాడు. లంకా నగరంలో చచ్చిన రాక్షసుల భార్యల ఆర్తనాదాలు మిన్ను ముట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *