సంపాతి తన వృత్తాంతం వానర సేనకు వివరించుట

సంపాతి తన తమ్ముడి మరణ వార్త విని కన్నీరు కార్చుతూ, “జటాయువును చంపిన ఆ దుర్మార్గుడు రావణుడి పైన పగ తీర్చుకుందామన్నా నేను ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి, ఏం చేసేది? వెనక వృత్రాసురుడి వథ జరిగిన రోజుల్లో నేనూ, జటాయువూ పోటీ పడి ఒకరి కన్న ఒకరం వేగంగా ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళాం. మిట్ట మధ్యాహ్నపు ఎండ తీవ్రతకు తట్టుకోలేక జటాయువు వివశుడై సోలి పోయాడు. అప్పుడు నేను ప్రేమ కొద్దీ నా రెక్కలు చాచి వాడికి నీడ ఇచ్చాను. దానితో నా రెక్కలు మాడి పోయాయి; నేను ఈ వింధ్య పర్వతం పైన పడ్డాను. తరువాత నాకు నా తమ్ముడి సమాచారమే తెలియలేదు,” అన్నాడు.

ఈ మాట విని అంగదుడు, “అయ్యా, నీవు జటాయువు అన్నవైతే ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో, ఎంత దూరాన ఉంటాడో చెప్పు,” అన్నాడు.

“నాయనా, న్యాయానికి నేను స్వయంగా రామకార్యం చెయ్యవలసిన వాణ్ణిగాని, ముసలివాణ్ణి, అశక్తుణ్ణి కావటంచేత వాక్సహాయమైనా చేస్తాను. రావణుడు సీతను తీసుకునిపోయిన మాట నిజమే. అతను లంకలో ఉంటాడు. అది ఇక్కడికి నూరామడల దూరాన సముద్ర మధ్యంలో ఉన్నది. లంకలోనే లంకా నగరం ఉన్నది. దాన్ని విశ్వకర్మ బంగారు ద్వారాలతో, బంగారు అరుగులతో, గొప్ప ప్రాకారాలతో నిర్మించాడు. ఆ లంకలోని రావణుడి అంతఃపురంలో సీత రాక్షస స్త్రీల మధ్య దుఃఖిస్తూ ఉన్నది. గద్ద జాతివాణ్ణి కావటం చేత ఇక్కడి నుండే రావణుణ్ణి, సీతనూ చూడగలుగుతున్నాను. మీరక్కడికి వెంటనే వెళ్ళి నట్టయితే సీత తప్పక కనబడుతుంది,” అన్నాడు సంపాతి.

అప్పుడు జాంబవంతుడు సంపాతితో, ‘అయ్యా, సీతను రావణుడు పట్టుకుపోగా చూసింది ఎవరు ?” అని అడిగాడు. మిగిలిన వానరులు సంపాతి చెప్పే మాటలను ఆసక్తితో వినటానికి ఎదురు చూశారు.

సుపార్శ్వుడు రోజూ నియమం తప్పకుండా. నాకు ఆహారం తెచ్చి ఇస్తూ ఉంటాడు. అలాటిది వాడు ఒకనాడు వేళమించి, సూర్యాస్తమయం అయినాక రావటమేగాక వట్టి చేతులతో వచ్చాడు. అసలే ఆకలి దహించుకుపోతూ ఉండటంచేత నేను వాణ్ణి బాగా తిట్టాను. నా కోపం పోగొట్టుతూ వాడు జరిగిన సంగతి చెప్పాడు. వాడు నా ఆహారం నిమిత్తం మహేంద్ర పర్వతం వద్ద జంతువులు నడిచే దారికి అడ్డంగా నిలిచి ఉన్నాడట. ఆ సమయంలో నల్లని శరీరం గల వాడొకడు సూర్యోదయం లాగా వెలిగిపోయే ఒక స్త్రీని తీసుకుపోతూ అటుగా వచ్చాడట. ఆ మగవాణ్ణి, ఆడదాన్ని నాకు ఆహారంగా తీసుకు వద్దామని సుపార్శ్వుడు ఆలోచిస్తుండగా ఆ నల్లటివాడు చాలా మంచి తనంగా దారి విడవమని కోరాడట. మర్యాదగా అడిగాడుగదా అని నా కొడుకు దారి ఇచ్చాడట. ఈ సంగతి తెలిసి అక్కడి మునులు సుపార్శ్వుడితో, ‘ఇవాళ నీవు బతికి బయట పడటం నీ అదృష్టం! నిన్ను దారి అడిగినవాడు మరెవరో కాదు, లంకా నగరాన్ని ఏలే రావణుడు. వాడు ఎత్తుకు పోతున్నది రాముడి భార్య అయిన సీత !’ అని అన్నారట. ఇదంతా జరగటం మూలాన వాడు నాకు వేళకు ఆహారంతీసుకు రాలేకపోయానని చెప్పాడు.”అన్నాడు సంపాతి.

తరవాత సంపాతి తన తమ్ముడికి ఇన్ని నీళ్ళు విడిచి, స్నానం చేసి ఒక చోట కూర్చున్నాడు. వానరులు అతని చుట్టూ చేరి కూచున్నారు. సంపాతి మళ్ళీ వారితో ఇలా అన్నాడు.

“నేను సూర్యుడి వేడికి రెక్కలు కాలి ఇక్కడ పడిపోయానని చెప్పాను కాదూ? ఆరు రోజులపాటు నాకు స్పృహలేదు. ఆ తరవాత, నేను పడినది వింధ్య పర్వతం మీద అని తెలుసుకున్నాను. అప్పుడిక్కడ నిశాకర మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన గొప్ప తపస్వి. అదివరకు నేనూ, మా జటాయువూ ఆ మహర్షిని ఎరుగుదుము. నేను మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ ఆయన ఆశ్రమానికి వచ్చి ఆయన దర్శనం కోసం ఒక చెట్టు కింద నిలిచాను. కొంత సేపటికి మహర్షి స్నానం చేసి అటుగా వచ్చాడు. ఆయన తిన్నగా ఆశ్రమంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి నన్ను చూసి నేను వచ్చిన పని అడిగాడు. నా దుస్థితికి కారణం ఏమిటన్నాడు. నన్ను గుర్తించాడు కూడా. నే నాయనతో జరిగినదంతా చెప్పాను.”

“నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని కూడా ఆయనతో అన్నాను. నాకు దుఃఖం ఆగలేదు. ఆయన కొంతసేపు కళ్ళు మూసి ధ్యాన నిమగ్నుడై, ‘నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి, జవసత్వా లేర్పడతాయి. భవిష్యత్తులో దశరథుడనే రాజు పుట్టబోతాడు. అతని కొడుకు భార్యతో అరణ్యవాసం చేయవస్తాడు. వారు జనస్థానంలో ఉండేటప్పుడు రావణుడనే రాక్షసరాజు రాముడి భార్యను అపహరిస్తాడు. ఆమె కోసం వెతకమని రాముడు పంపగా వానరులు నీ వుండే చోటికి వస్తారు. వారికి నీవు సీత సంగతి చెప్పు. నీవు ఎక్కడికీ పోలేవు గనక ఇక్కడే ఉండటం మంచిది.’ అన్నాడు.

“ఇదంతా ఎనిమిది వేల ఏళ్ళనాటి మాట. నాకీ సంగతి చెప్పిన నిశాకరమహర్షి నూరేళ్ళ అనంతరం దేహం చాలించాడు. నా మనసు అయోమయంలో పడిపోయింది. రావణుడు బలశాలి అయితేనేంగాక, ఆ దుర్మార్గుడు సీతను తీసుకుపోవటం నా కొడుకు కళ్ళారా! చూశాడని తెలిసినప్పుడు, వాడితో పోరి సీతను విడిపించి ఉండవలిసింది అని నా కొడుకును మందలించాను. నా తమ్ముడు ప్రాణాలు విడిచాడు, నా కొడుకు ఏమీ చేయనేలేదు. రావణుడు మహాపరాక్రమ వంతుడనటానికి సందేహం లేదు. కాని మీరు తక్కువవాళ్ళు కారు. సుగ్రీవుడు సరి అయిన వాళ్ళనే ఎంచి పంపాడు. మీరు వెళ్ళినట్టయితే సీత తప్పక కనిపిస్తుంది. తరువాత రామ లక్ష్మణుల బాణాలతో ఆ రావణుడు తప్పక చస్తాడు. వాడు నా తమ్ముడైన జటాయువును చంపినందుకు నా పగకూడా తీరుతుంది.”

ఈ విధంగా సంపాతి వానరులతో చెబుతూండగానే అతనికి కొత్త రెక్కలూ, ఈకలూ మొలుచుకు వచ్చాయి. సంపాతి ఆనందంతో, “చూశారా, నిశాకరమహర్షి చెప్పినది అక్షరాలా జరిగింది. మీరు వెళ్ళే పని జరుగుతుందని కూడా ఆయన అన్నాడు. అందుచేత మీకు కార్యసిద్ధి తప్పక అవుతుంది,” అంటూ ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసి వానరులు కూడా కొత్త ఉత్సా హంతో దక్షిణంగా బయలుదేరారు. సీత జాడ తెలిసిన సంతోషంతో వాళ్ళు గెంతారు, సింహనాదాలు చేశారు. ఈ విధంగా వెళ్ళి. వారు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *