సీత జాడ తెలియక వానర సేనలు దుక్కించుట

వింధ్య పర్వతపు పడమటి పార్శ్వపు టంచున కూచుని, పశ్చిమ సముద్రాన్ని చూస్తూ తమ గడువు ముగిసిందనీ, శిశిరం వెళ్ళి వసంతం కూడా రాబోతోందనీ గుణించుకుని వానరులందరూ చింతలో ముణిగిపోయారు.

అప్పుడు అంగదుడు వానరులతో, “మనమంతా సుగ్రీవుడి ఆజ్ఞకు లోబడి వచ్చాం. ఆయన చెప్పిన గడువు లోపల సీత జాడ తెలుసుకోలేక పోయాం. ఇప్పటికే ఆయన ఆజ్ఞ మీరిన వాళ్ళమయాం. సుగ్రీవుడు చాలా క్రూరుడు, మీదుమిక్కిలి రాజు. మనని క్షమించడు. ఆయన వద్దకు తిరిగి పోవడం కన్న అన్న పానాలు మాని ప్రాయోపవేశం చేసి చావటం మేలు. కావటానికి నేను యువరాజునే కాని నన్ను యువరాజు చేసినది సుగ్రీవుడు కాదు, రాముడు. సుగ్రీవుడికి నా మీద చాలా పగ ఉన్నది. నేను ఇప్పుడు అతడికి దొరికితే నన్ను ప్రాణాలతో వదలడు,” అన్నాడు.

మిగిలిన వానరులు కూడా ఇలాగే భావించారు. కనీసం సీత వార్త అయినా తెలిస్తే రాముడు సంతోషించి, గడువు దాటి నందుకు శిక్ష పడకుండా చూస్తాడేమో! కాని సీత జాడ తెలియక, గడువు దాటి కిష్కింధకు వెళ్ళటం కన్న ఇక్కడే ఉండి పోవటం మేలని వారు భావించారు. ముఖ్యంగా తారుడు వారితో, “ఇంత ఆలోచన దేనికి ? మీ కిష్టమైతే ఈ బిలంలోనే ఉండిపోదాం” అన్నాడు.

అంగదుడి మాట కారితనమూ, ధోరణి గమనిస్తున్న హనుమంతుడు తనలో, “అబ్బో, వీడు సుగ్రీవుడి రాజ్యం కాజేసేలాగే ఉన్నాడే!” అనుకుని వానరులకూ అంగదుడికి మధ్య భేదం కలిగించటానికి గాను, “అంగదుడా, వానరులకు ఈ క్షణం ఉన్న ఆలోచన మరుక్షణం ఉండదు. వీరందరూ భార్యలనూ బిడ్డలనూ వదిలేసి నీ ఆజ్ఞలు పాలిస్తూ నిజంగానే ఇక్కడ ఉండి పోతారని నమ్ముతున్నావా? ఉన్న మాట చెబుతాను విను. నేనుగాని, ఈ జాంబవంతుడుగాని, నీలుడుగాని, సుహోత్రుడుగాని సుగ్రీవుణ్ణి విడిచి నిన్ను అనుసరించటం కల్ల. అదీగాక బలవంతుడితో వైరం కూడదు. ఈ బిలం నిన్ను లక్ష్మణబాణాల నుంచి కూడా రక్షించలేదు. తెగబడి యుద్ధమే చెయ్యటానికైనా నీవు వాలి కన్న బలశాలివి కావుగదా! ఈ వానరులందరూ నీ మాట అనుసరిస్తారని భ్రమ పడితే త్వరలోనే ఒంటరిగాడివై పోతావు. సుగ్రీవుడికి నీ పైన పగ అన్నది నిజం కాదు. నీ తల్లి పై ఆయనకు ప్రేమ గనక ఆమెను బట్టి నీ పైన కూడా ప్రేమే,” అన్నాడు.

ఈ మాట లేవీ అంగదుడి చెవికెక్క లేదు. అతను కోపావేశంతో, “సుగ్రీవుడికి స్థిరబుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి, దయా, పరాక్రమమూ, గాంభీర్యమూ ఏ కోశానా లేవు. అన్న బతికి ఉండగానే తల్లిలాటి వదినెను భార్యను చేసుకున్న పాపి. రాక్షసుడితో పోరాటానికి బిలంలోకి దూరిన తన అన్న బయటికి రాకుండా బిలానికి కొండరాయి అడ్డం పెట్టిన ద్రోహి. తనకు రాజ్య దానం చేసిన రాముణ్ణి మరిచిన కృతఘ్నుడు. లక్ష్మణుడి భయం కొద్దీ సీతాన్వేషణకు గాను మనని పంపాడేగాని అతనికి అధర్మ భయం ఎక్కడిది? అటువంటివాడు, తన కొడుక్కు రాజ్యమిస్తాడుగాని నా కిస్తాడా ? తన ఆజ్ఞ మీరిన వంక పెట్టి నన్ను తప్పక ఉరి తీయిస్తాడు. నేను తిరిగి రాను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. నన్ను వదిలి మీరంతా వెళ్ళండి. రామ లక్ష్మణులకూ, మా పినతండ్రికీ, పినతల్లి రుమకూ నా నమస్కారాలు చెప్పండి. నేనంటే ప్రాణం కన్న ఎక్కువగా చూసే నా తల్లిని ఊరడించండి. ఆమె ఎలాగూ నాకోసం ప్రాణాలు విడుస్తుంది,” అని మిగిలిన వానరులకు నమస్కారాలు చేసి, భూమి మీద దర్భలు. పరుచుకుని వాటిపై ఏడుస్తూ పడుకున్నాడు.

అంగదుణ్ణి చూసి వానరులందరికీ ఆగకుండా దుఃఖం వచ్చింది. వాళ్ళు వాలిని మెచ్చుకుని సుగ్రీవుణ్ణి తిట్టుతూ, తాము కూడా ప్రాయోపవేశం చేయ నిశ్చయించారు. సముద్రంలో స్నానం చేసి తీరాన దర్భలు పరిచి వారంతా తూర్పు ముఖంగా పడుకున్నారు. అలా పడుకుని వారు రాముడు అరణ్యవాసానికి బయలుదేరినది మొదలు జరిగిన సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఉండగా ఒక భయంకరమైన ఆకారం గల గద్ద వారికి కనిపించింది. దానిని చూస్తూనే భయంతో వారు పెట్టిన కేకలకు గుహలన్నీ మారుమోగాయి.

ఆ వచ్చినది జటాయువు అన్న అయిన సంపాతి. అతను వింధ్య పర్వతం మీది ఒక గుహలో ఉంటున్నాడు. అతను గుహలో నుంచి వెలికి వచ్చి, “దేవుడి దయ వల్ల ఇవాళ నాకు కావలిసినంత ఆహారం! ఈ వానరులందర్నీ వరసగా చంపి కడుపు నింపుకుంటాను,” అన్నాడు.

ఆ మాటలు విని అంగదుడు హనుమంతుడితో, “మన కెలాటి గతి పట్టింది? యముడు ఈ గద్ద రూపంలో మనని కడతేర్చ వచ్చాడు. మనమా రాముడి పని తీర్చినవాళ్ళమూ కాలేదు, సుగ్రీవాజ్ఞ నిర్వర్తించిన వాళ్ళమూ కాలేదు. మన కన్న ఆ జటాయువు మేలు; అతను రాముడి కోసం ప్రాణాలు వదిలాడు. మనం రామ కార్యం మీద బయలుదేరామన్న మాటేగాని అది చెయ్యకుండానే ఈ గద్ద నోట పడబోతున్నాం. మన చావుకు ఎన్ని కలిసివచ్చాయో ! జటాయువు ప్రాణాలు వదలక పోతే మనకు సీతను వెతక వలిసిన పనే ఉండేది కాదు; రావణుడి సంగతి అతనే చెప్పేవాడు. రావణుడు సీత నెత్తుకు పోక పోతే ఆమె కోసం వెతికే పనే ఉండేది కాదు. దశరథుడు చావకపోతే ఏనాడో రాముణ్ణి పిలిపించుకుని ఉండేవాడు. అసలు దశరథుడా కైకేయికి వరాలే ఇవ్వకపోతే ఏ బెడద ఉండకనేపోను. ఇవన్నీ మన వానరులందరి ప్రాణం తియ్యటానికే జరిగాయి,” అన్నాడు.

సంపాతి గట్టిగా, “ఎవడది? నా తమ్ముడు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నాడు! ఇంత కాలానికి నా తమ్ముడి పేరు విన్నాను గదా అని సంతోషించాను. నాయనలారా, నా రెక్కలు సూర్య కిరణాలకు కాలిపోయాయి. నేను మీ దగ్గిరికి రాలేను. దయచేసి నన్ను మీరున్న చోటికి దించండి” అని అరిచాడు.

వానరులు ఇదంతా దొంగ ఎత్తనుకున్నారు. అయినా తాము చావటానికి సిద్ధమయే ఉన్నారు గనక ఆ చావు ఈ విధంగా త్వరగా రావటం కూడా మేలేనేమోనని వారికి తోచింది. అంగదుడు మాత్రం లేచి వెళ్ళి సంపాతిని కొండ మీది నుంచి దించి కిందికి తెచ్చాడు.

అతను సంపాతితో రాముడు అరణ్య వాసం రావటమూ, జనస్థానంలో ఉన్న సీతను రావణుడు అపహరించటమూ, అది చూసి జటాయువు రావణుడితో ఘోర యుద్ధం చేసి చనిపోవటము, రామ లక్ష్మణులు సీతను వెతుక్కుంటూ ఋశ్యముకానికి వచ్చి, సుగ్రీవుడి స్నేహం చేసి, వాలిని చంపి, వానర రాజ్యాన్ని సుగ్రీవుడి కివ్వటమూ, సుగ్రీవుడు సీతాన్వేషణకై తమను పంపటమూ, తాము విఫలులై, తిరిగి వెళ్ళలేక ప్రాయోపవేశం చెయ్యటమూ వివరించి చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *