శ్రీ రాముని జననం

పుత్రకామేష్టి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు. ఆశ్లేషా నక్షత్రంలో మిట్టమధ్యాన్నంవేళ సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. అయోధ్యానగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు. వీధులు జనంతోనూ, నాట్యం చేసేవాళ్లతోనూ, గాయకులతోనూ కిటకిట లాడిపోయాయి. దశరధుడు అంతు లేని గోదానాలూ, అన్నప్రదానాలూ చేయించాడు. నలుగురు పిల్లలూ క్రమంగా ఎదిగి పెద్ద వారవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాక పోయినా రామ లక్ష్మణులు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు. అదేవిధంగా భరత శత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు. వారు నలుగురూ వేదశాస్త్రాలు అధ్యయనం చేసి, విలువిద్యలో ఆరితేరి, తండ్రికి ఎప్పుడూ శుశ్రూషలు చేస్తూ యవ్వనవంతులయారు.

దశరథుడు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ, పురోహితులతోనూ ఆలో చనలు ప్రారంభించాడు. రాజూ, మంత్రులూ ఈ ఆలోచనలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి, తొట్రుపడుతూ, “మహారాజా, కుశిక వంశం వాడు, గాధి రాజుకుమారుడు, విశ్వామిత్ర మహాముని తమ దర్శనంకోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు.” అని చెప్పారు. వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంట బెట్టుకుని, విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. విశ్వామిత్రుడు, “రాజా, నీవూ, నీ ప్రజలు క్షేమంగా ఉంటున్నారా ? శత్రుభయమేమీలేదుగదా !” అని కుశలప్రశ్నలు చేసి, వసిష్ఠాది మునులను పలకరించి రాజ భవనం ప్రవేశించి ఉచితాసనంమీద కూర్చున్నాడు. “మహామునీ, మీరాక నా కెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావలిసినదేమిటి?” అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు.

Viswamitra visiting Dasaradha for taking Rama with him

విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, “రాజా, నేను వచ్చిన పని నెరవేర్చి సత్య సంధు అనిపించుకో. నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు, బల పరాక్రమవంతులు, నా యజ్ఞవేదిక పై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి, నా , వ్రతసంకల్పం పాడుచేశారు. ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రతసంకల్పం భంగమవుతుంది. అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నా వెంట నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ,సుబాహులనే ఆ రాక్షసులు భగ్నం చెయ్యకుండా ఈ కుర్రవాడు రక్షిస్తాడు. రాముడు ఆ రాక్షసులను సులువుగా చంప గలడు. ఆ సంగతి, వసిష్ఠుడుకూడా ఎరుగును,” అన్నాడు.

ఈ మాటలు వినగానే దశరథుడి గుండె బద్దలయినట్టయింది, భయమూ దుఃఖమూ ముంచుకొచ్చాయి. ఆయన సింహాసనం మీది నుంచి లేచి గడగడా వణుకుతూ, ” మహా మునీ, రాముడు పసివాడు. వాడి కింకా పదహారేళ్లయినా నిండలేదు. వాడికి విలు విద్యకూడా సరిగా రాదు. వాడు రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేస్తాడు.

“నా దగ్గర ఒక అక్షౌహిణి సేన ఉన్నది. నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను. ఇంతకూ ఆ రాక్షసు లెవరు? ఎంత ఒడ్డూ పొడుగూ ఉంటారు? ఎవరి కొడుకులు?” అన్నాడు. దానికి విశ్వామిత్రుడిలా చెప్పాడు : “రావణుడనే రాక్షసరాజును నీ వెరుగుదువు కదా! అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులు పొందాడు. ఇంతకూ ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తూ తమ్ముడు. అతను స్వయంగా యజ్ఞభంగం చెయ్యలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహులను పంపుతూ ఉంటాడు.”

“ఓయమ్మో ! రావణుడే? అతడి ముందు నేనే నిలవలేనుగదా, పసివాడు రాముడెలా నిలుస్తాడు ? ఆ మహాశక్తి మంతుడి పైకి రాముణ్ణి పంపించటం ఎంత మాత్రమూ పొసగదు,” అన్నాడు దశరథుడు. కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్ర బడ్డాయి. “మహారాజా, ఆడినమాట తప్పే వాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు!” అంటూ ఆయన చివాలున లేచాడు.

అప్పుడు వసిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ, “రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడినమాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తెస్తున్నావు.  విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? ఆయనకు తెలియని అస్త్రం లేదు, కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా? నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదమూ రాదు.” అని బోధించాడు. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామ లక్ష్మణులను పిలిపించి, వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు.

విశ్వా మిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామ లక్ష్మణులు ఒకరి వెనక ఒకరుగా ఆయనను అనుసరించారు. వారిద్దరి వద్దా విళ్ళున్నాయి. వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులున్నాయి. వేళ్లకు కూడా తొడుగులున్నాయి. వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడి వెనకగా నడవసాగారు.

Rama and Laxmana following Viswamitra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *