ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చుట

సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరథుడు ఎంతో సంతోషించి, వశిష్ట మహాముని అనుమతి పొంది, తన భార్యలను, మంత్రులను వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు. రోమపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యమిచ్చి, తన ఇంట వారం రోజులు ఉంచుకొని, ఆయన వచ్చిన పని తెలుసుకుని, తన అల్లుడైన ఋష్యశృంగుని, తన కుమార్తె అయిన శాంతను దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకొన్నాడు, వెంటనే దశరథుడి దూతలు, అయోధ్య నగరాన్ని అలంకరించే ఏర్పాట్లు చేయడానికి ముందుగా బయలుదేరి వచ్చేశారు.

ఋష్యశృంగుడు వచ్చి దశరధుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. వసంత రుతువు ప్రవేశించింది. దశరథుడు ఋష్యశృంగుడు తో “ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి అన్నాడు” ఋష్యశృంగుడు సరే అన్నాడు.

అశ్వమేధ యాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసేవారు, వేదాలు చదివేందుకు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైన మునులు బ్రాహ్మణ శ్రేష్టులు పిలిపించ బడ్డారు. ఏమేమి వస్తువులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైన వారు చెప్పారు. సమర్ధుడైన వాణ్ని గుర్రం వెంట పంపారు. సరయు నదికి ఉత్తర గట్టున యజ్ఞశాల నిర్మించారు. యజ్ఞ కార్యాలలో పాల్గొనటానికి వడ్రంగులను, బేల్దారిలను, చిత్రకారులను, నాట్యశాస్త్రంలో ప్రవీణులను  వినియోగించారు. యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు. బ్రాహ్మణులకు కుటీరాలు, భోజనాలకు విశాలమైన పందిళ్ళు తయారు చేశారు. సమస్తమైన రాజులకు చతుర్ వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్లాయి. మిధిలా రాజు అయినా జనకుడికి, కాశీ రాజుకు, దశరథుడి మామగారైన కైకేయ మహారాజుకు, రోమపాదుడు కి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి అనేక మంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. రావలసిన వారంతా వచ్చి బసలలో విడిది చేశారు. 

మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని దశరథుడు యజ్ఞశాల కు బయలుదేరి వచ్చాడు యజ్ఞ కర్మ ఆరంభమైంది మొదటి   హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హోమం కొనసాగించారు. యజ్ఞశాల అతిథులతో కళకళలాడింది భోజనం రాసులుగా పోసారు, వర్ణ వివక్ష లేకుండా అందరికీ తృప్తిగా భోజనం పెట్టి వస్త్ర దానం చేస్తూ వచ్చారు. అశ్వమేధం మూడు రోజుల యాగం, అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋషులకు భూమి యావత్తు దానం చేశాడు. వారు రాజుతో “మహారాజా భూమిని పాలించడం మా వల్ల అయ్యే పని కాదు అందుచేత మాకు భూమికి బదులుగా మణులు, బంగారము, గోవులు మరొకటి ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు? అన్నారు దశరథుడు వారికి పది లక్షల గోవుల్ని, వంద కోట్ల బంగారు నాణాలని,నాలుగు వందల కోట్ల వెండి దానం చేశాడు. తమకు ముట్టిన  ధనమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి సమర్పించారు. దానిని వంతుల ప్రకారం పంచుకున్నారు. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యిచాచాడు. వెంటనే దశరథుడు తన చేతి కడియం తీసి బ్రాహ్మణునికి ఇచ్చేశాడు. బ్రాహ్మణులు అందరూ దశరధుడిని దీవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *