భరతుడు అయోద్యకు వచ్చుట

భరతుడు పెద్ద వాళ్ళ అనుమతి తీసుకుని అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా అయోధ్య నగరం చేరుకున్నారు వారు ఏడు రోజులు ప్రయాణించారు.

దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడ కల వచ్చింది అది వచ్చినప్పటి నుంచి అతని మనసులో ఏదో ఆందోళన గానే ఉన్నది అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహము ఉల్లాసము లేవు జనం నీరసించినట్టున్నారు నగరం పాడుపడినట్టున్నది.

భరతుడు ముందు తన తండ్రి నగరకు వెళ్లి అక్కడ ఆయన కనిపించకపోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు ఆసనం మీద నుంచి లేచి తన కాళ్లకు నమస్కారం చేసిన భరతుడి తన చెంత కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేస్తూ “నీవు బయలుదేరి ఎన్నాళ్ళు అయింది నాయనా మీ మామ తాత క్షేమంగా ఉన్నారా నీకు అక్కడ సుఖంగా జరిగిందా?” అని ప్రశ్నించింది.

భరతడు అన్నిటికీ సమాధానమిచ్చి “అమ్మ నాన్నగారెక్కడ పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నేను ఆయన కాళ్లకు మొక్కాలి” అన్నాడు “ఆయన పెద్దల్లో కలిసిపోయారు నాయనా” అంటూ కైకేయి చావు కబురు చెప్పింది ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలిపోయాడు కైకేయి అతన్ని ఊరడించ యత్నించింది.

కొంతసేపు భరతుడు తండ్రి కోసం సోకించి “అయితే అమ్మ ఆయన ఆఖరి క్షణంలో నాకేమన్నా చెప్పాడా ఆయన ఆఖరు మాటలేమిటి” అని అడిగాడు.

“ఓ రామా ఓ లక్ష్మణా ఓ సీత అంటూ ఆయన ప్రాణాలు వదిలారు నాయనా” అన్నది కైకేయి భరతుడు ఆశ్చర్యంతో “అదేమిటి రాముడు సీత లక్ష్మణుడు దగ్గర లేరా” అని అడిగాడు.

“అరణ్యవాసానికి వెళ్లారుగా నాయన రాముడు నార బట్టలు జడలు ధరించి అరణ్యానికి వెళుతుంటే సీతా లక్ష్మణుడు కూడా వెళ్లారు” అన్నది కైకేయి

భరతుడు మరింత ఆశ్చర్యపడి “ఏం రాముడు ఏం పాపం చేశాడు, అతను పాడు పనిలేవి చేయడే బ్రూణహత్య చేసిన వాడికి విధించినట్టు అతనికి అరణ్యవాస శిక్ష ఎందుకు వేశారు” అన్నాడు.

“అదేం కాదులే మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసే యత్నం ఉన్నట్టు విని నేను ఆయనను రెండు వారాలు కోరాను ఆ పట్టాభిషేకం నీకు చేసి రామున్ని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపమన్నాను మహారాజు సరేనన్నారు కనుక వశిష్ఠుడు మొదలైన వారంతా చేయవలసిందంతా చేస్తారు నీవు చక్కగా పట్టాభిషేకం చేసుకో” అన్నది

కైకేయి చెప్పిన ఈ మాటలు విని భరతుడు మండిపడి పెట్టవలసిన నాలుగు మాటలు పెట్టాడు “నీవు మొగుణ్ణి చంపావు, రాముణ్ణి అడవికి పంపావు, నీ ముఖం చూస్తే పాపం!” అన్నాడు. “జ్యేష్ఠుడికి రాజ్యాభిషేకం జరగటం క్షత్రియవంశ ధర్మ మని నీకు తెలియదా? రామలక్ష్మణులు లేకుండా నేనీ రాజ్యభారం ఎలా మోయగల ననుకున్నావు?” అని అడిగాడు.

“నే నిప్పుడే వెళ్ళి ఆ రాముణ్ణి పిలుచుకు వచ్చి రాజ్యాభిషేకం చేసి అతనికి దాస్యం చేస్తాను,” అని తల్లితో చెప్పాడు. ఇంత పని చేసినందుకు కైకేయిని నిప్పుల్లో పడమన్నాడు, లేదా అరణ్యానికి వెళ్ళమన్నాడు, అదీ కాకపోతే గొంతుకు ఉరిపోసుకు చావమన్నాడు.

ఇంతలో మంత్రులు వారున్న చోటికి వచ్చారు. భరతుడు వారితో తనకు రాజ్య కాంక్ష ఏమీ లేదనీ, రాజ్యం కావాలని తాను తన తల్లితో చెప్పి ఉండలేదనీ,, జైకేయి తన తండ్రిని వరాలు కోరటంగాని,, సీతా రామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళి.. పోవటంగాని, దూరదేశంలో ఉన్న తనకూ, శత్రుఘ్నుడికి తెలియనే తెలియవనీ స్పష్టంగా చెప్పేశాడు.

తరవాత భరత శత్రుఘ్నులు కౌసల్య వద్దకు వెళ్ళారు. ఆమెను ఆలింగనం చేసు కుని ఆమెతోబాటు తాముకూడా ఏడ్చారు. ఆమె భరతుడితో కైకేయి తనకు చేసిన ద్రోహం గురించి చెబుతూంటే భరతుడికి. తనను కూడా తన తల్లితో జతచేసినట్టు అని పించింది. రాముడి అరణ్యవాసానికి తాను సమ్మతించలేదని అతను ఘోరమైన ఒట్లు పెట్టుకుని వేదన పడ్డాడు. కౌసల్య అతన్ని ఊరడించింది.

దుఃఖ సముద్రంలో ఉన్న భరతుడితో వసిష్ఠుడు, “నాయనా, ఈ విచారం కట్టి పెట్టి దశరథ మహారాజుకు ఉత్తర క్రియలు చెయ్యి,” అని హెచ్చరించాడు. తైల భాండం నుంచి పైకి తీసిన తండ్రి శవాన్ని చూసి భరతుడు, “నాయనా, నీవు పోయావు, రాము డడవిలో ఉన్నాడు, ఈ రాజ్యభారం ఎవరు మోస్తారు?” అని దుఃఖించాడు.

దశరథుణ్ణి పల్లకీలో ఎక్కించి నగరం బయటకి తీసుకు పోయారు. శవానికి ముందుగా పురజనులు, వెండి బంగారు నాణాలు వెదజల్లుతూ, చందనమూ, అగరూ, గుగ్గిలము, మొదలైన ధూపాలు వేస్తూ నడిచారు. దశరథుడి భార్యలు పల్లకీలలో వెళ్ళారు. శవాన్ని చితిపై పెట్టినాక దశరథుడి భార్యలు భరతుడితో బాటు చితిచుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు. భరతుడు తండ్రికి నిప్పు పెట్టినాక అందరూ నగరానికి తిరిగి వచ్చారు.

భరతుడు తండ్రికి పది దినాలు మైల పట్టి తరవాత రెండు రోజులపాటు శ్రాద్ధాలు చేశాడు. బ్రాహ్మణులకు అన్న దానమూ, వస్త్ర దానమూ, ఇతర దానాలూ చేశాడు. పదమూడో రోజు ఆస్థిసంచయనం చేసేటప్పుడు భరతుడూ, అతనితోపాటు శత్రుఘ్నుడూ తండ్రిని తలుచుకుని వివశులై విలపించారు.

తరువాత ఒక చోట భరత శత్రుఘ్నులు జరిగిన దాన్ని గురించి మాట్లాడుకున్నారు; తన అన్న అయిన లక్ష్మణుడు తన తండ్రికి ఎందుకు అడ్డుపడలేదా అని శత్రుఘ్నుడు ఆశ్చర్యం వెలిబుచ్చు తూండగా, మంధర మహారాణిలాగా అలంకరించుకుని ఆట కోతిలాగా తయారై ఆటుగా వచ్చింది. ద్వారపాలకులు దాన్ని పట్టుకుని శత్రుఘ్నుడి దగ్గరికి తెచ్చి, “ఇదుగో! అన్ని పాపాలకూ మూలమైన మంధర!” అన్నారు.

శత్రుఘ్నుడు కోపావేశంలో మంధరను పట్టుకుని దాన్ని హత మార్చే ఉద్దేశంతో జరజరా ఈడ్చుకు పోసాగాడు. మంధర వెంట ఉండే దాసీలు బెదిరిపోయి కౌసల్య దగ్గిరికి పరిగెత్తారు. మంధర కప్పు ఎగిరిపోయేటట్టు కేకలు పెట్టసాగింది. కైకేయి మంధరను విడిపించ టానికి వస్తే శత్రుఘ్ను ‘డామెను నోటికి వచ్చినట్టు తిట్టాడు.

అప్పుడు కైకేయ పరిగెత్తి వెళ్ళి భరతుణ్ణి పిలుచుకు వచ్చింది. భరతుడు శత్రుఘ్నుడితో, “ఆడదాన్ని చంపుతావా? ఈ మాట తెలిస్తే రాముడు మన ముఖం చూస్తాడా? రాముడి అగ్రహానికి గురి కావలిసి వస్తుందని ఆగాను కాని, నేను కైకేయిని ఎప్పుడో చంపకపోయానా? గూనిదాన్ని వదిలిపెట్టు,” అన్నాడు.

దశరథుడు పోయిన పధ్నాలుగో రోజు ఉదయం పెద్దలందరూ భరతుడి వద్దకు వచ్చి, “రాజపుత్రా, రాజ్యానికి నాయకుడు లేడు. అదృష్టవశాత్తూ జనంలో అరాజకం సాగలేదు. నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకోవటం మంచిది,” అన్నారు.

భరతుడు వారితో, “జ్యేష్ఠుడే రాజు కాపటం మా వంశాచారం. అందుచేత ‘నన్ను రాజు కమ్మని మీరు కోరటం ఉచితం. కాదు. నా తల్లి కోరిందిగదా అని పట్టం కట్టుకోను. నేను అరణ్యానికి వెళ్ళి జ్యేష్ఠు డైన రాముణ్ణి రాజును చేసి తీసుకువచ్చి, “అతనికి బదులుగా నేనే అరణ్యవాసం చేస్తాను. రాజ్యాభిషేకం అరణ్యంలోనే జరుగుతుంది గనక అభిషేక సంబారాలన్నీ నా వెంట తీసుకు పోవటానికీ, నాతోబాటు చతురంగబలాలతో కూడిన సేనను వెంట బెట్టుకు వెళ్ళటానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి.” అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *