కబంధుని కథ

ఒకప్పుడు ఈ కబంధుడు ఇంద్రుడికి తీసిపోని దేవరూపం గలవాడు. అయితే అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెట్టుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, ” నీకి రూపమే శాశ్వతంగా ఉండిపోవు గాక !”. అని శపించాడు. అప్పు డీ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని శాప విముక్తి ఎలాగని అడిగాడు. “ఎప్పుడు రాముడు అడవికి వచ్చి, నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది,” అని ముని చెప్పి వెళ్ళిపోయాడు. స్థూలశిరుడిచ్చిన ఈ శాపం అతి విచిత్రంగా ఫలించింది. శాపం తగలక మునుపే కబంధుడు బ్రహను గురించి అతి దారుణమైన తపస్సు చేశాడు. బ్రహ్మ అతడి తపస్సు మెచ్చుకుని అతనికి దీర్ఘాయువు వరంగా ఇచ్చాడు. “బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయు విచ్చాడు గనక నన్నిక దేవేంద్రుడు కూడా ఏమీ చేయలేడు,” అని గర్వించి, అతను ఇంద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో అతని తలనూ, కాళ్ళనూ శరీరంలోకి తోసేసి మొండెంలాగా తయారుచేశాడు.

ఆ రూపంతో ఎలా బతకటం? అందుచేత అతను ఇంద్రుణ్ణి ఎంతగానో వేడుకుని తన ప్రాణాలు తీసెయ్యమన్నాడు. “బ్రహ్మ దేవుడు నీకు దీర్ఘాయు విచ్చి ఉండగా నేను నీ ప్రాణాలెలా తియ్యను ? నేనా పని చెయ్యను,” అన్నాడు ఇంద్రుడు.

“తిండి తినటానికి నోరుకూడా లేకుండా నేను దీర్ఘ కాలం ఎలా జీవిస్తాను?” అని కబంధుడు అడిగాడు.

అప్పుడింద్రుడు అతనికి అతి దీర్ఘమైన చేతులూ, కడుపులో పదునైన కోరలు గల నోరూ ఏర్పాటు చేశాడు. అతడికి కబంధ రూపం ఏర్పడింది. ముని శాపం ఫలించింది. ఆ తరవాత కబంధుడు అక్కడే ఉండిపోయి అందిన ప్రతి ప్రాణినీ తింటూ వచ్చాడు. కబంధుడీ కథంతా చెప్పినాక రాముడు, “నా భార్య అయిన సీతను రావణు డనేవాడు ఎత్తుకుపోయాడు. అతని పేరు తెలుసే తప్ప, ఎక్కడ ఉంటాడో, ఎవడో, అతని శక్తి ఎటువంటిదో మాకు తెలియదు. అష్ట కష్టాలూ పడి సీతను వెతుకుతున్న మాకు నీబోటివాడు సహాయం చెయ్యటం భావ్యం,” అన్నాడు.

దానికి కబంధుడు, “నా కిప్పుడు దివ్య జ్ఞానం ఏమీలేదు. నన్ను మీరు దహించి నట్టయతే నిజరూపం పొంది మీకు చేతనైన సహాయం చేస్తాను, సలహా ఇవ్వగలుగుతాను,” అన్నాడు.

రామలక్ష్మణులు ఒక పల్లపు ప్రదేశంలో చితి పేర్చి దాని పైన కబంధుణ్ణి పెట్టి దహనం చేశారు. కొద్ది సేపట్లో ఆ చితిని తోసుకుని ఒక దివ్యపురుషుడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని, అనేక దివ్యాభరణాలతో పైకి వచ్చాడు. అతను హంసలతో అలంకరించబడిన విమానంలో కూచుని ఆకాశంలోకి లేచి, రాముడితో ఇలా అన్నాడు.

“రామా, సీతను తిరిగి సంపాదించుకోవటానికిగాను నీకు ఒక వ్యక్తి సహాయం చెయ్యగలడు. అతడు కూడా నీలాగే రాజ్యాన్నీ, భార్యనూ పోగొట్టుకుని, అన్న భయం చేత పంపాసరోవర సమీపాన ఋశ్య మూకపర్వతం మీద నలుగురు అనుచరులతో ఉంటున్నాడు. అతను సుగ్రీవుడనే పేరు గల వానరరాజు, వాలి అనేవాడి తమ్ముడు, సత్యసంధుడు, సమర్థుడు, పరాక్రమశాలి. సీతను వెదకటానికి అతను సహాయపడగలడు. నీవు ముందుగా అతని వద్దకు వెళ్ళి అగ్నిసాక్షిగా అతనితో స్నేహం చేసుకో. అతను కోరిన సహాయం చెయ్యి, అతని నుంచి సహాయం పొందు. అతని భటులైన వానరులు సీత ఎక్కడ వున్నది. తప్పక తెలుసుకోగలరు.”

కబంధు డీ మాటలు చెప్పి, ఋశ్య మూకానికి వెళ్ళే మార్గం వివరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు.

సుగ్రీవుణ్ణి కలుసు కోవటం లక్ష్యంగా పెట్టుకుని రామలక్ష్మణులు పంపాసరోవరం కేసి బయలుదేరారు. వారు మర్నాటికి పంపాసరస్సు యొక్క పడమటి గట్టు చేరు కుని, అక్కడ చెట్ల మధ్య అందమైన శబరి ఆశ్రమం చూశారు.

ఈ ఆశ్రమంలో మతంగమహాముని ఉండేవాడు. ఆయన పెద్ద తపశ్శక్తి సంపన్నులైన శిష్యులుండేవారు. శబరి అనే సన్యాసిని ఆ శిష్యులకు సేవచేస్తూ తాను కూడా తపస్సు చేసింది. రాముడు చిత్రకూటానికి వచ్చిన సమయంలో ఆ మతంగ శిష్యులు ఐహికజీవితం చాలించి స్వర్గానికిపోతూ శబరితో, “రాముడు నీ ఆశ్రమానికి రాగలడు. అతనికి చక్కగా అతిథి సత్కా రాలు చేసి పుణ్యలోకాలు పొందు,” అని చెప్పారు. వారు వెళ్ళినాక వృద్ధురాలైన శబరి రాముడి రాకకు ఎదురుచూస్తూ, వన్యాహారాలూ, ఫలాలూ అతని కోసం దాచి ఉంచింది.

శబరి రామలక్ష్మణులకు వందనం చేసి ఈ సంగతి తెలిపింది. రాముడి కోరికపై ఆమె రాముడికి తపోవనమంతా చూపింది. అక్కడ మునులు తమ తపశ్శక్తి చేత సప్త సముద్రాలు సృష్టించుకున్నారు. వారి యాగ వేదిక చెక్కు చెదరకుండా ఉన్నది. ఏనాడో ఆ మునులు కట్టిన పుష్పమాలలు వాడకుండా నిలిచి ఉండటం రాముడుచూశాడు. ఇలా అక్కడి వింతలన్నీ చూపించి శబరి రాముడితో, ఇంక నేను దేహం చాలించి నా యజమానులైన మహా మునులను చేరుకుంటాను,” అన్నది. తరవాత ఆమె అగ్నిప్రవేశం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది.

రాముడు ఆ వనం చూసి, అక్కడి సప్తసముద్రాలలో స్నానం చేసి, తర్పణాలు విడిచిన మీదట అతనికి మనశ్శాంతి కలిగింది, భవిష్యత్తు గురించి ఆశ పుట్టు కొచ్చింది. అతను లక్ష్మణుడితో సహా ఆ ఆశ్రమం దాటి పంపాసరస్సుకు వెళ్ళాడు. దానికి సమీపంలోనే మతంగ సరస్సున్నది. రాముడు అందులో స్నానం. చేసి లక్ష్మణుడితో, “లక్ష్మణా, ఈ సమీపంలోనే ఋశ్యమూక పర్వతం పైన సుగ్రీవుడుంటాడు. నీవు బయలుదేరి అతని వద్దకు వెళ్ళు.” అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *