రామ లక్ష్మణులు కబంధుడిని సంహరించుట

చెట్లూ, పొదలూ నరికి కీకారణ్యం మధ్యగా దారి చేసుకుంటూ రామలక్ష్మణులు జనస్థానం దాటి మూడుకోసుల దూరం వెళ్ళి క్రౌంచారణ్యం ప్రవేశించారు. వారు దారిలో మధ్యమధ్య విశ్రాంతి తీసుకుంటూ, దారి పొడుగునా సీతను వెతుకుతూ క్రౌంచారణ్యం దాటి మతంగాశ్రమ ప్రాంతం చేరి అక్కడ ఒక పెద్ద గుహను చూశారు. అది చీకటి గుహ.

రామలక్ష్మణులు ఆ గుహ దగ్గిరికి వెళ్ళే సరికి అందులో వారికి ఒక వికారమైన పెద్దరాక్షసి కనిపించింది. దాన్ని చూస్తేనే మామూలు మనుషులు దడుచుకుంటారు, అసహ్యపడతారు. పెద్ద నోరూ, పెద్ద కళ్ళూ,పెద్ద పొట్టా, కోరలూ, గరుకైన చర్మమూ గల ఆ రాక్షసి సింహాలనూ, పులులనూ పీక్కుతింటూ రామలక్ష్మణులను చూసింది. వెంటనే అది, పరిగెత్తుకుని, ముందు నడిచే లక్ష్మణుడి వద్దకు వచ్చి, అతన్ని మోహించి పట్టుకున్నది.

అది లక్ష్మణుడితో, “నా పేరు అయోముఖి. ఇంతకాలానికి నాకు నచ్చినవాడవు దొరికావు. మనిద్దరమూ పెళ్ళాడి అరణ్య మంతా విహరించుదాం, నాతో రా !” అన్నది, లక్ష్మణుడికి ఆగ్రహాం వచ్చి కత్తి దూసి దాని ముక్కు, చెవులూ నరికేశాడు. అసలే వికారంగా ఉన్న ఆ రాక్షసి మరింత భయంకరంగా అయి, పెడబొబ్బలు పెడుతూ అరణ్యంలోకి పారిపోయింది. తరువాత వారిద్దరూ సీత కోసం ఆ వనమంతా వెదక నారంభించారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక భయంకరమైన ధ్వని పుట్టి ఆకాశానా, దిక్కులా మారుమోగింది. రామలక్ష్మణులా ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళి గుబురుగావున్న ఒక పొదలో ఒక వింత ఆకారాన్ని చూశారు.

ఆ ఆకారం చిన్న కొండ ప్రమాణంలో ఉన్నది. నల్లగా ఉన్నది. దానికి తలా, మెడా, కాళ్ళూ లేవు. వక్షస్థలంలో ఒక పెద్ద కన్ను కాంతివంతంగా ప్రకాశిస్తున్నది. దాని కొక పెద్ద రెప్ప కూడా ఉన్నది. దానికి కిందుగా పొట్టలో పెద్ద నోరున్నది. మొండెం లాగున్న ఈ ఆకారానికి అతిదీర్ఘమైన . చేతులు మాత్రం ఉన్నాయి.

ఈ వింత అవతారం కబంధుడనే రాక్షసుడు. అలా ఒకే చోట కదలకుండా ఉండి, అతి దీర్ఘమైన చేతులు చాచి, ఎంతో దూరాన ఉన్న జంతువులనూ, మనుషు లనూ కూడా పట్టి భక్షిస్తూ ఉంటాడు.

రామలక్ష్మణులు తన ఎదటికి రాగానే కబంధుడు ఇద్దరిని చెరొక చేత్తోనూ బలంగా పట్టేసి, తన కేసి లాక్కోసాగాడు. ఎంతో బలమూ, ఆయుధాలూ ఉండి కూడా ఆ అన్నదమ్ములు వాడి చేతిపట్టు వదిలించుకోలేక పోయారు. లక్ష్మణుడు భయపడి పోయి, “అన్నా, నన్ను వీడికి బలి ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకుని, వెళ్ళి సీతను వెతుకు!” అన్నాడు.

రాముడు లక్ష్మీణుడికి భయపడ వద్దని ధైర్యం చెప్పాడు.

ఇంతలో కబంధుడు భయంకరమైన గొంతుతో, ” ఇద్దరూ బలిసిన ఆబోతుల్లాగున్నారు. మిమ్మల్ని విడవను. నా నోటికి చిక్కారు,” అన్నాడు.

ఆ మాటలు వినగానే రాముడికి భయంతో నోరెండుకు పోయింది. క్షణం క్రితం లక్ష్మణుడికి ధైర్యం చెప్పినవాడు కాస్తా నీరు కారిపోయి , “మన రోజులు బాగాలేవు. అన్ని కష్టాలే. మన కిలాంటి ఘోర మరణం రాసిపెట్టి ఉన్నదికాబోలు. కాలం తీరితే ఎంతెంత మహావీరులు కూడా యుద్ధంలో చావటం లేదా ?” అన్నాడు.

అంతలో లక్ష్మణుడికి పరాక్రమం వచ్చేసింది. అతను రాముడితో, వీడు మనని తినటానికి సిద్ధంగా ఉన్నాడు. వీడి బలమంతా చేతుల్లోనే ఉంది. వీడి చేతులు రెండూ నరికెద్దాం!” అన్నాడు.

కబంధుడీ మాటలు విని మండిపడి నోరు తెరిచి ఇద్దరినీ మింగబోయాడు. సరిగా ఆ క్షణంలోనే రాముడు వాడి కుడిచేతినీ, లక్ష్మణుడు వాడి ఎడమచేతిని నరికేశారు. ఆ దెబ్బతో కబంధుడు పెడబొబ్బలు పెడుతూ పడిపోయాడు.

వాడు రామలక్ష్మణులను, “మీరెవరు?” అని అడిగాడు. లక్ష్మణుడు వాడికి తమ సంగతి చెప్పి, ” ఈ వింత ఆకారం గల నీ వెవడవు ? ఈ వనంలో ఎందుకున్నావు?” అని అడిగాడు.

“మీ రిద్దరూ రామలక్ష్మణులా ? మీరు ఈ అరణ్యానికి రావటం నాకు చాలా మంచిదయింది. నా కథ చెబుతాను వినండి” అంటూ కబంధుడు తన వృత్తాంతం వారికి యిలా చెప్పాడు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *