రావణుడు సీతను అశోక వనంలో బంధించుట

లంకాపురం అతి అందమైన నగరం. అక్కడి రాజమార్గాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. అనేక ప్రాకారాలతో కూడి ఉన్న అంతఃపురంలోకి రావణుడు సీతతో సహా ప్రవేశించాడు. అతను భయంకరాకారాలు గల అక్కడి రాక్షస స్త్రీలను పిలిచి, ” నా అనుమతి లేకుండా ఒక పురుషుడు గాని, స్త్రీగాని ఈ సీతను చూడరాదు. ముత్యాలో, రత్నాలో, బంగారమో, బట్టలో – ఈమె ఏమి కోరితే అది ఎల్లా నాతో చెప్పకుండానే ఈమెకు ఇచ్చెయ్యాలి. ఈమె మనస్సుకు కష్టం కలిగించే మాట ఒక్కటి ఎవరైనా అన్నారో తక్షణం వాళ్ళ ప్రాణాలు తీస్తాను,” అని హెచ్చరించాడు.

రావణుడు అంతఃపురం నుంచి బయటికి వచ్చి జట్టీలలాటి ఎనీమిదిమంది రాక్షసులను పిలిచి, “మీరు అన్ని రకాల ఆయుధాలూ పట్టుకుని జనస్థానానికి వెళ్లాలి. ఒకప్పుడక్కడ ఖరుడుండేవాడు. అక్కడి రాక్షసులంతా చావటం చేత ఇప్పుడెవరూ లేరు. ఖర దూషణులనూ, రాక్షస సేననూ రాముడు చంపేశాడు. ఆ రాముడికి మనకూ మధ్య ఇప్పుడు గొప్ప వైరం ఏర్పడింది. అందుచేత ఆ రాముణ్ణి చంపేదాకా నేను నిద్రపోను. ఈ లోపుగా మీరేం చెయ్యా లంటే, ఆ జనస్థానంలో ఉండి, రాముడు ఎప్పుడేం చేసేది నాకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి. మీరు ఒక్క క్షణం కూడా ఏమరుపాటన్నది లేకుండా, రాముణ్ణి చంపే ప్రయత్నంలోనే ఉండాలి. మీ బల పరాక్రమాలు నేను అనేక పర్యాయాలు చూశాను గనక మీకి పని ఇస్తున్నాను.” అని చెప్పాడు.

రాక్షసులు వెళ్ళిపోయారు. తరవాత రావణుడి బుద్ధి సీత మీదికి వెళ్ళింది. అతను త్వరగా తన అంతఃపురానికి తిరిగి వచ్చి, రాక్షసస్త్రీల మధ్య కూచుని దుఃఖ సముద్రంలో ముణిగి ఉన్న సీతను చూశాడు. సీత వద్దు మొర్రో అంటున్నా వినకుండా అతను సీతను బలవంతంగా తీసుకుపోయి తన భవనమంతా చూపించాడు. అది దేవతాగృహాలలాటిది. అందులో అనేక వేల మంది స్త్రీలున్నారు. రకరకాల పక్షులున్నాయి. ఎక్కడ చూసినా రత్నాలూ,దంతంతో చేసిన భాగాలూ, స్ఫటికశిలలూ, వెండితో చేసినవీ, వజ్రవైడూర్యాలు తాపడం చేసిన అందమైన స్తంభాలు ఉన్నాయి. బంగారు ద్వారం గల అద్భుతమైన మెట్ల వరస మీదుగా ఇద్దరూ ఎక్కారు. మెట్ల పక్కన వెండి కిటికీలూ, దంతపు కిటికీలూ ఉన్నాయి. మేడ మీద బంగారు కిటికిలున్నాయి. కొన్ని చోట్ల గోడలో రత్నాలు పొదిగారు. తన ఐశ్వర్యంతో సీతను భ్రమింప జెయ్యటానికిగాను రావణుడు ఇవన్నీ సీతకు చూపాడు.

అతను సీతతో, “నీవు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన దానివి. నా భార్యవయ్యావో నా మిగతా భార్యలందరికీ రాణిని చేస్తాను. ఈ మహానగరం దేవతలకు కూడా గెలవరాని నిన్ను ఇక్కడి నుంచి తీసుకు పోగలవాడు మూడు లోకాలలోనూ లేడు. నన్ను కూడా దాసుడుగా చేసుకుని ఈ లంకా రాజ్యాన్ని నీవే ఏలు. ఎప్పుడో ఏదో పాపం చేసి వనవాసం అనుభవించావు. ఇక నీ పుణ్యం అనుభవించు. విమానంలో మనం ఇష్టం వచ్చినట్టు విహరింతాం. దుఃఖిస్తుంటే నీ అందమైన ముఖం కళారహి తంగా ఉన్నది. అందుచేత విచారం మాను!” అన్నాడు.

ఇంత చెప్పినా సీత చలించలేదు. ఆమె తనకూ రావణుడికీ మధ్య ఒక గడ్డిపోచ అడ్డంగా పట్టుకుని, అతని కేసి చూస్తూ, “నాకు ఒకడే దేవుడు. అతడు నా భర్త అయిన రాముడు. అతని చేతిలో నీకు చావు రాసిపెట్టి ఉన్నది. ఈ లంకకు వైధవ్యప్రాప్తి తప్పదు. నా శరీరాన్ని బంధించు, కోసుకుతిను గాక, నేను పాతివ్రత్య భంగం సహించను,” అని జవాబిచ్చింది.

రావణుడు మండిపడి, “అయితే నా మాట విను. నీకు పన్నెండు మాసాలు గడు విచ్చాను. ఈ లోపుగా నీవు నా కోరికను ఆమోదించకపోతే నా వంటవాళ్ళచేత నిన్ను ముక్కలు ముక్కలుగా కోయించి ఫలహారం వండిస్తాను !” అన్నాడు.

తరవాత అతను రాక్షసస్త్రీలను పిలిచి, “ఈమెను అశోకవనానికి తీసుకుపోయి మీరంతా చుట్టూ ఉండి జాగ్రత్తగా రక్షించండి. నయానో భయానో ఈమెను దారికి తీసుకు రండి,” అని ఆజ్ఞాపించాడు.

ఆ ప్రకారమే రాక్షసస్త్రీలు సీతను అశోక వనానికి తీసుకువెళ్లారు. ఆ వనంలోని చెట్లు ఎల్లప్పుడూ పూలతోనూ, పళ్ళతోనూ నిండి ఉంటాయి. వనం నిండా పకులున్నాయి. రాక్షసస్త్రీలు సీతను అక్కడికి చేర్చి చుట్టూ కూచున్నారు. ఆమెకు దుఃఖమూ, భయమూ పట్టుకున్నాయి. ఆమె రాముణ్ణి తల్చుకుని దుఃఖం పట్టలేక మూర్ఛపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *