జటాయువు రావణుడితో పోరాడుట

ఒక చెట్టు పైన సీతకు జటాయువు కనిపించాడు.

సీత జటాయువుతో, “నాయనా, జటాయూ ! నన్నీ రాక్షసుడు బలాత్కారంగా తీసుకు పోతున్నాడు. ఈ మాట రాముడికి చెప్పు,” అన్నది.

చెట్టు మీద కునికిపాట్లు పడుతున్న జటాయువు ఈ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి రావణుడితో ఇలా అన్నాడు:

“రావణా, నీవు చేసేది చాలా తప్పు పని, మామూలు మనుషులు తమ భార్యలను పర పురుషుల నుంచి ఎలా కాపాడుకుంటారో రాజైనవాడు ఇతరుల భార్యలను కూడా అలా కాపాడాలి. నేను సౌమ్యుణ్ణి,వృద్ధుణ్ణి, నిరాయుధుణ్ణి. నీవు యువకుడివి, ఆయుధాలు కలవాడివి. అయినా నిన్ను సీత నెత్తుకు పోనివ్వను. రామలక్ష్మణులు దూరాన ఉన్నప్పుడు పిరికిగా నీవీ పని చేస్తున్నావు.”

ఈ మాటలంటూనే జటాయువు రావణుడిపై తలపడ్డాడు. రావణుడు తన రథంలో ఉండి ధనుర్భాణాలతో పోరాడుతుంటే మహా బలశాలి అయిన జటాయువు తన గోళ్ళతోనూ, కాళ్ళతోనూ, ముక్కుతోనూ కలియబడి రావణుడి కవచాన్ని నిర్మూలించాడు. అతని శరీరాన్ని చీరాడు, అతని ధనువులను విరిచాడు, రథపు గాడిదలనూ, సారధినీ కూడా చంపాడు. చివరకు రథాన్నే విరిచాడు.

రావణుడు విరధుడై సీతను చంకన పెట్టుకుని భూమి పైకి దిగవలిసి వచ్చింది. ఇంత చేసిన మీదట జటాయువు అలిసిపోయాడు. అది గమనించి రావణుడు సీతతో సహా మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు. కాని జటాయువు ఎగిరి వెళ్ళి రావణుడికి అడ్డు తగిలాడు. అతను రావణుడితో, “ఛీ, ఛీ! నీవు వీరుడివి కావు, పిరికిపందవు. వీరుడివైతే రామలక్ష్మణులు వచ్చినదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి,” అన్నాడు.

రావణుడు వినిపించుకోక ముందుకు సాగిపోయాడు. జటాయువు రావణుడి వెన్నంటి, అతని వీపుమీద వాలి తన గోళ్ళతో గీరసాగాడు, రావణుడి వెంట్రుకలు పీకాడు. రావణుడు మండిపడి సీతను నేలపై దించి జటాయువుతో కలియబడ్డాడు. ఇద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది. చివ రకు రావణుడు కత్తి దూసి జటాయువు, రెక్కలూ, పక్కలూ, పాదాలూ నరికేశాడు. జటాయువు కొన ఊపిరితో నేల మీద పడి పోయాడు. సీత వలవలా ఏడుస్తూ జటాయువు దగ్గిరికి పరిగెత్తింది. జటాయువును కౌగలించుకుని భోరున ఏడ్చింది. “రామా, లక్ష్మణా! ఇప్పుడన్నా వచ్చి నన్ను రక్షిం చండి!” అని కేక పెట్టింది. రావణుడు తన కేసి రావటం చూసి సీత లతలను పట్టుకునీ, చెట్లను పట్టుకునీ వేళ్ళాడింది. “చాలించు ఈ వేషాలు,” అంటూ రావణుడు ఆమె జుట్టు పట్టుకుని ఆమెను తన ఒడిలో పెట్టుకుని తిరిగి ఆకాశ గమనం సాగించాడు.

రావణుడు అతివేగంగా పోతూంటే సీత యొక్క ఆభరణాలు కొన్ని భూమి మీద పడి పోయాయి. సీత రావణుణ్ణి పిరికి వాడని అవమానించింది, దొంగ అన్నది, తిట్టింది. ఇప్పటికైనా తనను వదిలేస్తే రాముడు క్షమిస్తాడని ఆశ పెట్టింది; “ఏది కోరి నన్ను ఇలా తీసుకుపోతున్నావో అది నీకు ఒనగూడదు, ఎందుచేతనంటే నేను రాముణ్ణి విడిచి ఎంతో కాలం బతకను,” అని కూడా చెప్పి చూసింది. రావణుడి మాట లేవీ పట్టించుకోలేదు.

ఆకాశంలో పోతున్న సీతకు ఒక కొండ శిఖరం మీద అయిదుగురు వానరులు కనిపించారు. “వీరు నా సంగతి రాముడితో ఒక వేళ చెబుతారేమో,” అనుకుని సీత తన పసుపుపచ్చని పైబట్టలో తన ఆభరణాలు కట్టి ఆ వానరుల మధ్య పడేలాగా వేసింది. ఈ సంగతి రావణుడు గమనించ లేదు. కాని వానరులు మాత్రం సీతనుచాలా సేపు కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు.

రావణుడు పంపా సరస్సు దాటి, సము ద్రాన్ని చేరి, దాన్ని కూడా దాటి తనపాలిటి మృత్యువైన సీతతో సహా లంకను చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *