వానరులు లంకకు వారధి నిర్మించి యుద్దానికి సిద్దమావుట

సేతువు నిర్మించమని రాముడు అనతి అవ్వగానే లక్షల సంఖ్యలో వానరులు అరణ్యాలకు పోయి, సాలవృక్షాలనూ, అశోక వృక్షాలనూ, బిల్వ వృక్షాలనూ, మామిడి చెట్లనూ, ఇంకా అనేక రకాల చెట్లనూ పీకి తెచ్చి సముద్రం పైన వేశారు. తాటి, కొబ్బరి, తుమ్మ, పొగడ మొదలైన చెట్లను కూడా తెచ్చి సముద్రం మీద విసిరి వేశారు. ఏనుగు లంతేసి కొండరాళ్ళను యంత్రసహాయంతో చేర్చారు. అంతేసి రాళ్ళు వచ్చి పడుతుంటే సముద్రపు నీరు ఆకాశ మెత్తు లేచి పడింది. సేతువు సమంగా ఉండేటట్టు చూడటానికి కొందరు తాళ్ళు పట్టుకున్నారు, కొందరు కర్ర బద్దలు పట్టుకున్నారు, కొందరు హెచ్చు. తగ్గులు పరీక్షించారు. ఈ విధంగా వానరులు పది ఆమడలు వెడల్పూ, నూరు ఆమడలు నిడివి గల సేతువును నిర్మించారు.

సేతువును నిర్మించటంలో నళ్లుడికి తోడ్పడిన వానరులు పెద్ద పెద్ద కొండల్లాటి రాళ్ళను ఎత్తుకుని పరిగెత్తుకు వస్తుంటే చూడటానికి ఆశ్చర్యకర మనిపించింది. వారు మొదటి రోజు పధ్నాలుగామడలూ, రెండవ రోజు ఇరవై ఆమడలూ, మూడో రోజు ఇరవై ఒక్క ఆమడలు, నాలుగో రోజు ఇరవై రెండామడలూ, అయిదో రోజు ఇరవై మూడామడలూ సేతువు నిర్మించి, అయిదు రోజులలోగా నువేలపర్వతాన్ని చేరుకున్నారు.

వానరులు సంతోషంతో గెంతుతూ, అరుస్తూ, కోట్ల సంఖ్యలో సముద్రాన్ని సేతువు మీదుగా దాటి సముద్రపు దక్షిణ తీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడొక గద తీసుకుని, శత్రువు లెవరైనా వస్తే హత మార్చటానికి సిద్ధంగా తన మంత్రులతో సహా ఆ దక్షిణ తీరాన నిలబడి ఉన్నాడు.

రామలక్ష్మణులను హనుమంతుడూ, అంగదుడూ భుజాల మీద ఎత్తుకుని వారధి దాటించారు. అక్కడ అందరూ రాముడికి వేరువేరుగా మంగళాభిషేకం చేశారు. వారతన్ని శత్రువులందరినీ సంహరించి, చిరకాలం భూమండల మంతా ఎలవలసిం దని మంగళవాక్యాలతో ఆశీర్వదించారు.

రాముడు లక్ష్మణుడితో, “మనం ఆలస్యం చెయ్యరాదు. వెంటనే లంకకు బయలుదేరి పోదాం,” అన్నాడు. రాముడు- ధనుర్ధారి అయి ముందు నడుస్తూంటే వానరసేన వెనకగా కదిలింది. విభీషణ, సుగ్రీవాది ప్రముఖులు సింహనాదాలు చేస్తూ కదిలారు.

ఇక్కడ వానరసేన విడియగానే లంకలో నుంచి భేరీ మృదంగ ధ్వనులు భయంకరంగా వినవచ్చాయి. వాటిని విని వానరులు అంతకన్న గట్టిగా సింహనాదాలు చేశారు. ఆ ధ్వనిని లంకలోని రాక్షసులు విన్నారు.

రకరకాల ధ్వజాలతోనూ, పతాకలతోనూ కూడి ఉన్న లంకానగరాన్ని చూసి రాముడు, “ఇక్కడనేగదా సీత జింక పిల్లలాగా రావణుడి నిర్బంధంలో ఉన్నది!” అని దిగులుగా అనుకుని, లక్ష్మణుడితో, ‘ఆ త్రికూట పర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన లంకా నగరాన్ని చూడు. అనేక పెద్ద భవనాలతో ఇది తెల్లని మబ్బులుగల ‘ ఆకాశంలా గున్నది. మంచి మంచి సుందర వనాలతో అందంగానూ, రకరకాల పక్షుల కూతలతో ఎంతో ఆహ్లాదకరంగానూ ఉన్నది,” అన్నాడు.

తరువాత రాముడు వానరసేనను గరుడ వ్యూహంలో అమర్చి, దానికి ముందు తానూ లక్ష్మణుడూ ఉండేటట్టూ, అంగదుడు నీలుడితో బాటు తన సేనతో సహా హృదయ స్థానంలో ఉండేటట్టూ, ఋషభుడు తన సేనతో కుడిపక్కా, గంధమాదనుడు ఎడమ పక్కా ఉండేటట్టూ, జాంబవంతుడూ, సుషేణుడూ, వేగదర్శి కడుపుస్థానంలో ఉండేటట్టూ, సుగ్రీవుడు వెనుక భాగాన్ని రక్షించేటట్టూ ఏర్పాటు చేశాడు.

వ్యూహం ఏర్పాటు కాగానే రాముడి ఆజ్ఞపై సుగ్రీవుడు శుక్బు బంధవిముక్తుణ్ణి చేశాడు. వాడు అక్కడ క్షణమైనా ఉండక రావణుడి దగ్గరికి వెళ్ళాడు. రావణుడు వాణ్ణి చూసి నవ్వుతూ, “ఎవరో నీ రెక్కలు విరిచినట్టున్నారు. నీవు కోతులకు చిక్కలేదు కద ?” అన్నాడు.

“నేను సముద్రం దాటి వెళ్ళి, సుగ్రీవుణ్ణి చూసి, తమరు చెప్పమన్నట్టుగానే చెప్పాను. ఆ వానరులు నన్ను చూసి మండిపడి, ఆకాశంలోకి ఎగిరి నన్ను పట్టుకుని, నానా హింసలూ పెట్టి, చంపటానికి సిద్ధ పడ్డారు. వాళ్ళు అమిత కోపస్వభావులూ, క్రూరులూనూ. వాళ్ళతో మాట్లాడటమే కష్టం, ఇంక జవాబు చెప్పించటం ఎట్లా? రాముడు లంకా ద్వీపానికి చేరాడు. సముద్రానికి సేతువు నిర్మించి లంకాద్వారం దాకా వచ్చాడు. వానరసేనలు ఇసుక వేస్తే రాలకుండా ఉన్నాయి. వెంటనే సీతను రాముడి కిచ్చెయ్యటమో, యుద్ధానికి సిద్ధం కావటమో, ఏదో ఒకటి చెయ్యాలి,” అన్నాడు శుకుడు.

రావణుడు శుకుడితో తాను యుద్ధానికే నిశ్చయించుకున్నట్టు చెప్పి, వానరసేన యొక్క వివరాలన్నీ రహస్యంగా తెలుసుకు రమ్మని శుకసారణులను పంపాడు. వారు వానర రూపాలు ధరించి వానరసేన ప్రవేశించారు.

వాళ్ళకు వానరసేన అంతు చిక్కలేదు.. పర్వత శిఖరాల మీదా, పర్వతాల మధ్యా, అరణ్యాలలో, సముద్రతీరానా, వనాలలో,ఉద్యానాలలో ఎక్కడ చూసినా వారికి వానరసేన కనిపించింది. ఆ సేనలో ఒక భాగం ఇంకా సేతువు దాటుతూనే ఉన్నది!

ఇంతలో శుకసారణుల మాయా రూపాలను విభీషణుడు పోల్చుకుని, వారిని పట్టుకుని రాముడితో, “వీళ్ళు శుకసారు అనేవారు. రావణుడి మంత్రులు. మన రహస్యాలు తెలుసుకు పోవటానికి లంక నుంచి వచ్చారు.” అని చెప్పాడు.

రావణుడు పంపగా వానరసేనను గురించి తెలుసుకోవటానికి వచ్చినట్టు శుక సారణులు ఒప్పుకున్నారు.

రాముడు నవ్వుతూ, “ఇకనేం? సైన్య మంతా చూసుకోండి. మమ్మల్ని చూడండి. చూడవలసినదంతా చూశాక స్వేచ్ఛగా లంకకు వెళ్ళిపొండి,” అని వారితో అన్నాడు. వాళ్ళు నిరాయుధులు కనక వారిని చంపనని కూడా అతనన్నాడు. అతను రావణుడితో తన మాటలుగా ఇలా చెప్ప “మన్నాడు. ” నీవు ఏ ధైర్యంతో నా భార్యను సీతను అపహరించావో ఆ ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించు. రేపు తెల్లవారుతూనే లంకా ప్రాకారాన్నీ, ద్వారాలనూ, నీ రాక్షస సైన్యాన్నీ నా బాణాలతో నుగ్గు చెయ్యబోతున్నాను. జాగ్రత్త!”

శుకసారణులు రాముణ్ణి పొగడి లంకకు తిరిగి వెళ్ళి రావణుడితో, “రాజా, మేము వానర సేనలో ప్రవేశించి విభీషణుడికి పట్టు బడ్డాం. అయితే ధర్మాత్ముడైన రాముడు మమ్మల్ని విడిచిపెట్టాడు. వానరసేనకు రాముడు, లక్ష్మణుడూ, విభీషణుడూ, సుగ్రీవుడూ చాలు వారు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోరు. లంకకు చేటు తీసుకురావటానికి ఆ నలుగురే చాలు, మిగిలిన వానరసేన అనవసరమనిపిస్తుంది. రాముడి రూపమూ, ఆయుధాలూ చూస్తే అతనొక్కడే చాలు, లక్ష్మణ విభీషణ సుగ్రీవులెందుకనిపిస్తుంది. ఇది వానర వీరులు యుద్ధోత్సాహులై, ఎప్పుడా అన్నట్టున్నారు. అందుచేత వాళ్ళతో విరోధం పెట్టుకోవటం కన్న సీతను రాముడి కిచ్చెయ్యటం మంచిది,” అన్నారు.

ఈ మాటలు విని రావణుడు సారణుడితో, “అన్ని లోకాలూ ఒక్క పెట్టున నా పైకి ఎత్తివచ్చి భయపెట్టినా నేను సీతను పోనివ్వను. నీవు మెత్తని వాడవు కావటం చేత వానరుల దెబ్బలకు బెదిరిపోయి సీత నిచ్చెయ్యమంటున్నావు,” అని, శుకసారణులను వెంటబెట్టుకుని మంచు కొండలాటి తెల్లని తన భవనం పైకి ఎక్కి, అక్కడి నుంచి కనిపించే పర్వతాలూ, పనాలూ, సమమస్తమూ వానరసేనతో నిండి ఉండటం గమనించాడు.

అతను సారణుడి కేసి తిరిగి, “వానరలలో శూరులూ, బలవంతులూ అయిన వారెవరు? అగ్రనాయకు లెవరు? ముఖ్యు లెవరు?” అని అడిగాడు.

“లంక కేసి తిరిగి సింహనాదం చేస్తున్న ఆ వానరుడు నీలుడు; వానర సేనా నాయకుడు, చేతులు పైకెత్తి నిలబడి, తోకను నేల కేసి కొట్టుతున్నవాడు అంగదుడు; సుగ్రీవుడి చేత యువరాజుగా అభిషేకం చేయించుకున్నవాడు వాలి కొడుకు. హనుమంతుడు లంకకు వచ్చి సీతను చూసిన వాడే. అంగదుడికి వెనకగా ఉన్న వాడు నళుడు. అతనే సముద్రానికి సేతువు కట్టినది! తానొక్కడే లంకను జయించాలని ఇతని అభిలాష. సైనికులను సర్దుతూ, ఉత్సాహపరుస్తూ తిరిగే ఆ తెల్లని వానరుడే శ్వేతుడు. అడుగో, అతను కుముదుడు, చాలా తీవ్రస్వభావం గలవాడు, భయం కరుడు. ఆ వానరుడు రంభుడు. ఆ ఆవలించే వాడు శరభుడు; అతనికి చావంటే లక్ష్యం లేదు, యుద్ధంలో వెనకడుగు వెయ్యడు,” అని చెబుతూ సారణుడు రావణుడికి ఒక్కొక్క వానర ప్రముఖుణ్ణు పరిచయం చేశాడు.

సారణుడు చెప్పేది పూర్తి అయాక శుకుడు మరి కొందరు శత్రు ప్రముఖులను గురించి, వారి ఘనతను గురించీ రావణుడికి వివరించి చెప్పాడు.

తన మంత్రులు శత్రువీరులను ఆవిధంగా తెగ పొగడటం విని రావణుడికి ఆగ్రహం కలిగింది. అతను వారితో, “నా ఉప్పు తిని బతికే వాళ్ళు నాకు అప్రియంగా ఇలా మాట్లాడవచ్చా? ఒక వంక యుద్ధం జరగ బోతుండగా శత్రువుల నిలా పొగడవచ్చా? పెద్దల దగ్గిర మీరేం నేర్చుకున్నట్టు? మీరు చదివిన నీతి శాస్త్రమంతా ఏమైనట్టు? మిమ్మల్ని చంపెయ్యవలిసిందే, కాని మీరు లోగడ చేసిన మేలు తలచి మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. అదే మీకు మృత్యు వుతో సమానం,” అన్నాడు.

ఈ మాటలకు సిగ్గుపడి, శుకసారణులు రావణుడికి జయం పలికి వెళ్ళిపోయారు.

రావణుడు మహోదరుడనేవాణ్ణి పంపి వేగులవాళ్ళను పిలిపించి, వారితో, “మీరు రాముడి వద్దకు వెళ్ళి, అతని ప్రయత్నాలేవో, అతని అంతరంగికులెవరో తెలుసుకోండి. రాముడు ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు మేలుకుంటాడో, ఏంచేస్తాడో, సమస్తమూ తెలుసుకురండి. మీరు తెలుసుకు వచ్చే విషయాలు యుద్ధంలో మనం సులువుగా గెలవటానికి సహాయం కావాలి,” అన్నాడు.

ఆ చారులు శార్దూలుడనే వాళ్లు వెంట బెట్టుకుని, మారు రూపాలతో, సువేల పర్వత సమీపంలో రామ లక్ష్మణ విభీషణ సుగ్రీవులున్న చోటికి చేరుకున్నారు. రామలక్ష్మణులనూ, వానరసేనను చూడగానే వారికి భయం వేసింది.

విభీషణుడు వాళ్ళను పోల్చనే పోల్చాడు. వారిలో శార్దూలుడు మరీ దుష్టుడు. విభీషణుడు చారులను పట్టుకుని, శార్దూలుణ్ణి వానరులకు అప్పగించాడు. వానరులు వాణ్ణ చంపబోతుంటే రాముడు అడ్డుపడి, శార్దూలుణ్ణి, మిగిలిన చారులనూ కూడా విడిపించాడు. వారు లంకకు తిరిగి వెళ్ళి, రాముడు సేనతో సహా సువేల పర్వతప్రాంతంలో ఉన్నాడని రావణుడికి చెప్పారు.

“రావణుడు శార్దూలుణ్ణి చూసి, “నీ ముఖం అలా వాడిఉన్నదేమిటి ?శత్రువులు నిన్నేమీ చెయ్యలేదు గద ?” అని అడిగాడు.

శార్దూలుడు రావణుడితో, “ఆ వానరుల మీద వేగు చెయ్యటం చాలా కష్టం. నేను వానరసేనలో ప్రవేశించానో లేదో, నన్ను ‘పట్టుకున్నారు. విభీషణుడి మంత్రులు నన్ను హూనం చేసేశారు. ఆ తరువాత వానరులు నన్ను పొడిచి, కరిచి, కొట్టి చాలా విధాల బాధించి సేనచుట్టూ తిప్పారు. నేను రక్తంకారి, స్పృహతప్పి, చావటానికి సిద్ధంగా ఉండగా రాముడు నన్ను కాపాడాడు. అతను త్వరలోనే లంకను ముట్ట డించనున్నాడు. ఇస్తావా సీతను ఇచ్చెయ్యి, లేదా యుద్ధానికి సిద్ధంకా!” అన్నాడు.

రావణుడు శార్దూలుడి చేత కూడ వానర ప్రముఖులను గురించి చెప్పించుకుని, తన మంత్రులను పిలిపించి వారితో కార్యాలోచన చేశాడు. అతను కర్తవ్యం నిర్ణయించుకుని, మంత్రులను పంపేసి, మాయలలో ఆరి తేరిన విద్యుజిహ్వుణ్ణి వెంటబెట్టుకుని, సీత వద్దకు బయలుదేరాడు.

అతను విద్యుజ్జిహ్వుడితో, “మనం మాయ చేత సీతను మోసపుచ్చాలి. నీవు మాయ చేత రాముడి తలను కల్పించి, ధనుర్బాణాలతో సహా దాన్ని తీసుకుని నా వెంట రా,” అన్నాడు.

విద్యుజిహ్వుడందుకు సమ్మతించి, రావణుడు బహుమానంగా ఇచ్చిన ఆభర రక్తంకారిణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. రావణుడు అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీత వద్దకు బయలుదేరి వెళ్ళాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *