శ్రీ రాముడు వానర సేనతో కలసి యుద్ధానికి బయలుదేరుట

హనుమంతుడు చెప్పినదంతా విని రాముడు పరమసంతోషం చెంది, ఆహా ఈ హనుమంతుడు చేసిన పని మరెవరు చెయ్యగలరు? ఇతరులు తలవనైనా తలవలేరు. గదా! సముద్రాన్ని దాటటం గరుత్మంతుడికీ, వాయుదేవుడికీ, ఈ హనుమంతుడికీ తప్ప మరెవరికీ సాధ్యమయే పని కాదు. అంతతో పోక ఈ హనుమంతుడు దేవతలకు సైతం ప్రవేశించరాని లంకను ప్రవేశించాడు! ప్రవేశించటమే కాదు, ప్రాణాలతో తిరిగివచ్చాడు! అక్కడ అశోకవన భంగము, రాక్షస సంహారమూ, లంకా దహనమూ మొదలైన అద్భుత కార్యాలు చేశాడు! సీతనూ, నన్నూ ఈ హనుమంతుడు కాపాడిన వాడైనాడు. ఇతనికి ఏమి ఇచ్చినా తీరదు. అన్నిటికి బదులుగా ఆలింగనం చేసుకుంటాను,” అంటూ హనుమంతుణ్ణి కౌగలించుకున్నాడు.

తరవాత రాముడు సుగ్రీవుడితో, “సీతను వెతకటంలో కృతకృత్యుల మయామేగాని సముద్రాన్ని తలుచుకుంటే నా మనసు కుంగిపోతున్నది. దాని దక్షిణ తీరానికి ఎలా చేరుకునేట్టు?” అంటూ విచారంలో ముణిగి పోయాడు.

అప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి చూసి, ” ఎందుకు విచారం? అది కార్యహాని హేతువు. సముద్రానికి సేతువు కట్టి లంకలో అడుగుపెట్టే ఉపాయం ఆలోచించామంటే ఆ రావణుడు చచ్చిన వాడి కిందనే లెక్క. సముద్రానికి సేతువు కట్టకుండా లంకను జయించటం దేవతలకే సాధ్యం కాదు. అందుచేత విచారం విడిచిపుచ్చి కర్తవ్యం ఆలోచించు. నీకు జయం కలుగుతుందనటానికి ఏ సందేహమూ లేదు,” అన్నాడు. ఈ మాటలతో రాముడు తేరుకుని, ” తపస్సు చేసో, సేతువు కట్టి, సముద్రాన్ని ఇంకించో, ఏదో విధంగా లంకకు చేరి తీరు తాను. ఆ విషయమై ఇంక విచారించను,” అంటూ హనుమంతుడితో, “లంకకు ఎన్ని దుర్గాలున్నాయి? ఎంత సైన్యం ఉన్నది? ద్వారక్షణ ఎలా ఉన్నది? ప్రాకారాలు మొదలైన వాటిని గురించి వివరంగా చెప్పు,” అన్నాడు.

హనుమంతు డీ విధంగా చెప్పాడు “లంకలోని వారంతా సంతృప్తులు, అసంతృప్తు అక్కడ లేరు. నగరం విశాల మైనది. పుష్కలంగా చతురంగ బలాలు గలది. దానికి నాలుగు పెద్ద ద్వారాలున్నాయి. ద్వారాల వద్ద శత్రు సైన్యాలను నాశనం చెయ్యడానికి బ్రహ్మాండమైన రాళ్ళు విసిరే యంత్రాలున్నాయి, నూరేసి మందిని చంప గల శతఘ్నులున్నాయి. నగరం చుట్టూ దాటరాని ప్రాకారం ఉన్నది. దాని చుట్టూ లోతైన అగడ్త ఉన్నది. దానిని దాటటానికి ద్వారాల సమీపంలో కర్ర వంతెన లున్నాయి. వాటిని యంత్ర సహాయంతో ఎత్తవచ్చు, దించవచ్చు. శత్రువులు వచ్చినప్పుడు వాటిని ఎత్తివేస్తే, అగడ్తను దాటటం అసాధ్యం. రావణుడు చాలా మెలకువ గల వాడు, శత్రు భయం లేనప్పుడు. కూడా తన సైన్యాన్ని యుద్ధ సన్నద్ధంగా ఉంచుతాడు. లంకకు నాలుగు రక్షలున్నాయనవచ్చు. ఒకటి, చుట్టూ ఉండే సముద్రం. లంక ఎత్తుగా త్రికూటపర్వతం పైన ఉండటం చేత దానిని ఎక్క లంకను చేరాలి. ఆ పర్వతం రెండో రక్ష. అక్కడ ఉండే అరణ్యం మరొక రక్ష. నాలుగో రక్ష అగడ్తా, పరిఘలూ, యంత్రాలూ, శతఘ్నులూ మొదలైనవి. ద్వారాల వద్దా, నగర మధ్యంలోనూ యోధులైన రాక్షసులు కొట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే నేను అగడ్తలను దాటే వంతెనలను ధ్వంసం చేసి, అగడ్తను పూడ్చాను. ప్రాకారాన్ని ధ్వంసం చేశాను. చాలా మంది పరాక్రమవంతులైన రాక్షసులను చంపాను. కనుక ఇప్పుడు లంకను వశపరచుకొనటం అంత కష్టం కాదు. మిగతా సైన్యంతో కూడా పని లేదు; అంగదుడూ, ద్వివిదుడూ, మైందుడూ, జాంబవంతుడూ, పనసుడూ, నళుడూ, సేనానాయకుడైన నీలుడూ చాలు. వీళ్ళు తలుచుకుంటే లంకను పెళ్ళగించి, రాక్షసులతో సహాతేగలరు. అందుచేత అంగదుడు మొదలైన వారిని ఆజ్ఞాపించి, మంచి ముహూర్తం చూసి బయలుదేర దీయించు.”

రాముడంతా విని హనుమంతుడితో, “సరే ఆ లంకను అవశ్యం హతమార్చుదాం,” అన్నాడు. అతను సుగ్రీవు డితో, “మనం ఇవాళే, ఇప్పుడే సేనలతో బయలుదేరి పోదాం. సరిగా మిట్టమధ్యాహ్న మయింది. ఇది అభిజిత్తు అనే ప్రశస్తమైన ముహూర్తం. కార్యసాధన అవుతుంది. అదీ గాక, ఇవాళ ఉత్తర ఫల్గునీ నక్షత్రం. నా జన్మ నక్షత్రం పునర్వసు గనుక ఇది నాకు అనుకూలం. ఇంకా అనేక శుభ లక్ష ణాలు కనిపిస్తున్నాయి గనుక వెంటనే బయలుదేరుదాం,” అన్నాడు.

వానరసేనలో ముందెవరుండాలో, దాని పార్శ్వాలను ఎవరు రక్షించాలో, ఏయే వానరయోధు డేయే పని నిర్వర్తించాలో, మార్గ మధ్యంలో శత్రువులు అవాంతరాలు కలిగించ కుండా ఎలా జాగ్రత్త పడాలో రాముడు వానర సేనానాయకుడైన నీలుడితో చెప్పాడు. ఉదాహరణకు, వానరసేన వెళ్ళే మార్గంలో ఉండే పళ్ళూ, ఫలాలూ మొదలైన ఆహారాన్ని రాక్షసులు నిర్మూ లించవచ్చు. లోయలలోనూ, నదులు దాటే చోటా, అరణ్యాలలోనూ శత్రువులు మాటు వేసి ఉండి వానరసేనను నిర్మూలించ యత్నించవచ్చు. అలాటి ప్రమాదాలేవీ జరగకుండా ముందు నడిచే వారు జాగ్రత్త తీసుకోవాలి.

ప్రయాణం కావలిసిందని సుగ్రీవు డాజ్ఞా పించగానే యుద్ధోత్సాహులైన వానరులు గుహల నుంచీ, కొండల మీది నుంచీ, చెట్ల మీది నుంచి దూకుతూ వచ్చారు. వానర సేన దక్షిణంగా కదిలింది. రాముణ్ణి హను మంతుడూ, లక్ష్మణుణ్ణి అంగదుడూ తమ భుజాల పైన ఎక్కించుకున్నారు. అసంఖ్యాకులైన వానరులు వారిని చుట్టుముట్టి నడుస్తూ, ఎగిరారు, గంతులు వేశారు, సింహ నాదాలు చేశారు, ఒకరి నొకరు పడదోసు కున్నారు, పరుగుపందాలు వేసుకున్నారు. “రావణుణ్ణి చంపాలి; రాక్షసులను చంపాలి,” అని నినాదాలు చేశారు. మహా పరాక్రమవంతులైన వానరోత్తములు, ఋషభుడూ, నీలుడూ, కుముదుడూ పెద్ద బలగంతో సేనకు ముందుండి దారి తీశారు.

దారిలో లక్ష్మణుడు రాముడికి ఉత్సాహం కలిగిస్తూ, ” ఇంక త్వరలోనే రావణుడు చస్తాడు. సీతకు విమోచనం కలుగుతుంది. మీరిద్దరూ అయోధ్యకు తిరిగిపోతారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, నక్ష త్రాలు అనుకూలంగా ఉన్నాయి. రాక్షసుల నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని తోకచుక్క తాకుతున్నది,” అన్నాడు.

దారి పొడుగునా వానరులు చేయవలసిన కోతి చేష్టలన్నీ చేస్తూ, చెట్ల మీదుగానూ, చెట్ల కిందుగానూ నడుస్తూ, కుప్పి గంతులు వేస్తూ, ఎగురుతూ, కిచకిచలాడుతూ, చెట్ల కొమ్మలు విరుస్తూ, ఫలాలు తిని తేనెలు తాగుతూ, ఎక్కడా మజిలీ వెయ్యకుండా, సహ్యపర్వతాన్నీ, మలయపర్వతాన్నీ దాటి. సముద్రతీరాన్ని చేరుకున్నారు.

రాముడు లక్ష్మణ సుగ్రీవులతో సహా మహేంద్రగిరి శిఖరానికి ఎక్కి, అక్కడి నుంచి సముద్రాన్ని చూశాడు. తరువాత పర్వతం దిగివచ్చి సముద్రాన్ని దగ్గిరగా చూశాడు. అతను సుగ్రీవుడితో, ” ఇక మన ముందు సముద్రమే గాని భూమి లేదు. దీన్ని దాటటానికి ఏదో ఉపాయం ఆలో చించాలనుకున్నామే, ఆ ఉపాయం ఆలో చించే సమయం వచ్చింది. ప్రస్తుతానికి సేన లను ఇక్కడే విడియిద్దాం. ఎవరూ తన సేన నుంచి దూరంగా వెళ్ళరాదు. శత్రు భయం కలగకుండా శూరులైన వానరులు కాపలా తిరుగుతూ ఉండాలి,” అన్నాడు.

సుగ్రీవుడు ఆజ్ఞాపించగా వానరసేన మూడు విభాగలై విడిసింది. ఆ సమయంలో వానరులు చేసిన ధ్వని మూలాన సముద్ర ఘోష కూడా విన రాలేదు. వానరులు సముద్రాన్ని చూసి మహాశ్చర్యం పొందారు. దీన్ని ఎలా దాటటమా అని దిగులు చెందారు.

వానరసేనాని అయిన నీలుడు సేనానివేశనం శాస్త్రోక్తంగా జరిపించాడు. వానరోత్తములైన మైందద్వివిదులు సేనకు రక్ష గా రెండు పక్కలా సంచరించారు.

సైన్యం విడిసే ఏర్పాట్లు పూర్తికాగానే రాముడు సీతా విరహంలో పడి చాలాసేపు తపన పడ్డాడు. అతను లక్ష్మణుడితో తన బాధ చెప్పుకుని విలపించాడు. ఇంతలో సూర్యాస్తమయమయింది. లక్ష్మణుడు ఓదార్చిన మీదట రాముడు వ్యాకుల మనస్సుతోటే సంధ్యోపాసన చేశాడు.

ఈ లోపల అక్కడ లంకలో రావణుడు ఘోరమైన అవమానం పొంది తన రాక్షస ప్రముఖులతో, “శత్రువులకు అభేద్యమైన లంకలోకి ఒక వానరమాత్రుడు ప్రవేశించి, గొప్ప గొప్ప రాక్షస వీరులను చంపి, లంకను దహించి అల్లకల్లోలం చేసేశాడు; సీతతో మాట్లాడి మరీ వెళ్ళాడు. ఇప్పుడు రాముడు వేలకొద్దీ వానరవీరులను వెంటబెట్టుకుని మన పైకి ఎత్తి వస్తున్నాడు. అతను తన తమ్ముడితోనూ, సుగ్రీవుడు మొదలైన వారి ” తోనూ, వానరసేనతోనూ సముద్రాన్ని దాటి రాగలడనటానికి సందేహం అక్కర్లేదు. అతను స్వశక్తి చేత సముద్రాన్ని ఎండించ వచ్చు, లేక మరొకటి చేయవచ్చు. అతను వానర బలగంతో వచ్చిపడే పక్షంలో మనం లంకనూ, మననూ రక్షించుకునే ఉపాయ మేమిటి? అందరూ శాస్త్రీయంగా ఆలోచించి, ఏకాభిప్రాయానికి వచ్చి కర్తవ్యం నిర్ణయించండి,” అన్నాడు.

ఈ మాటలు విని రాక్షసులు, “రాక్షసేశ్వరా, నీకి విషయమై చింత ఎలా కలిగింది ? మనకు అంతులేని సేన ఉన్నది. అంతులేని పరిఘలూ, శక్తులూ, శూలాలూ, పట్టసాలూ మొదలైన ఆయుధాలున్నాయి. నీవా ముల్లోకాలనూ జయించిన వాడవు. కుబేరుణ్ణి, యక్షులనూ జయించి పుష్పకం తెచ్చుకున్నావు. మయుడు నీకు వెరిచి తన కూతురును (మందోదరిని) నీకు భార్యగా ఇచ్చాడు. వాసుకి, తక్షకుడూ మొదలైన నాగరాజులు నీకు లోబడ్డారు. అపారశక్తి వంతులూ, మాయావులూ అయిన కాలకేయులు నీతో ఏడాది పాటు యుద్ధం చేసి చివరకు ఓడారు. వరుణుడూ, యముడూ నీ చేత జయించబడ్డారు. రాముడు వారితో పోల్చితే ఏపాటి? వారందరినీ జయించిన నీకు రాము డొక లెక్కా? నీదాకా ఎందుకు ? మహేశ్వర యజ్ఞం చేసి, వరప్రసాదుడై, దేవేంద్రుడితో యుద్ధం చేసి, అతన్ని కట్టి లంకకు తెచ్చిన ఇంద్రజిత్తు చాలడా ? క్షణంలో ఆ రాముణ్ణి, వానర సేనను మట్టుబెట్ట గలడు! వానరుడైన హనుమంతుడు చేసిన అల్లరిని తలచి బాధ పడకు, ఆ సంగతి మరిచి పో !” అన్నారు. వారు అవివేకులు, మీదు మిక్కిలి శత్రు. బలం ఏ మాత్రమూ ఎరగరు.

వెంటనే ప్రహస్తుడు లేచి రావణుడికి నమస్కారం చేసి, ” దేవదానవ గంధర్వ పిశాచాదులకు భయపడని మనం కోతులకు భయపడతామా? మనని జయించే వారు లేరన్న అలక్ష్యంలో ఉన్న కారణం చేత హనుమంతుడు అల్లరి చేశాడుగాని, నేను జీవించి ఉండగా వాడు ప్రాణాలతో లంకను దాటునా? నన్ను ఆజ్ఞాపించు, భూమి మీద ఎక్కడా వానర మనేది మచ్చుకు కూడా లేకుండా చేసేస్తాను. లంకను కాపాడే పని నాకు వదిలెయ్యి!” అన్నాడు.

“హనుమంతుడు మనకు, మన రాజుకూ చేసిన అవమానం నిజంగా క్షమించ రానిదే. నే నొక్కణే వెళ్ళి ఆ వానరులనందరినీ చంపి వస్తాను,” అన్నాడు దుర్ముఖుడు. వజ్రదంష్ట్రుడు కోపం వెళ్ళ గక్కుతూ, ఇనుప గుదియ ఒకటి చేతబట్టి, ” అర్థ రాత్రివేళ దొంగలాగా వచ్చిన ఆ హనుమంతుడితో నేమిటి? నేను వెళ్ళి, నిజమైన శూరుడైన ఆ రాముణ్ణి లక్ష్మణ సుగ్రీవులతో సహా చంపేస్తాను. రాజా.. మరొక మాట చెబుతాను. మనం శత్రువులను ఉపాయంతో జయించవచ్చు. కామ రూపులైన మన రాక్షసులు వేల సంఖ్యలో మనుష్య రూపం ధరించి రాముడి వద్దకు వెళ్ళి, ‘మమ్మల్ని భరతుడు పంపాడు, ఆయన పెద్ద సేనతో వస్తున్నాడు!’ అని చెప్పాలి. రాముడు ఆ ఆశలో ఉండగా మనం అక్కడి నుంచి వెళ్ళి, వానరసేన అంతా నిర్మూలిస్తాం. రామలక్ష్మణులు అది చూసి గుండె పగిలి చస్తారు,” అన్నాడు.

ఇదే విధంగా కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు తానొక్కడే వెళ్ళి వానర సేననూ, రామలక్ష్మణులనూ చంపివస్తా నున్నాడు. వజ్రహనుడనే వాడు వానరుల నందరినీ తిని వస్తా నన్నాడు. ఇంకా అనేక మంది రాక్షస వీరులు శత్రు నాశనానికి సన్నద్ధులై లేచి నిలబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *