రావణ కుంభకర్ణ విభీషణుల జననం

అగస్త్యమహర్షి రాముడికి, సుకేశుడి కుమారులైన మాల్యవంతుడూ, మాలి, సుమాలీ లంకలో నివాసం ఏర్పాటు చేసుకుని, తమ భార్యలతోనూ, పిల్లల తోనూ నిర్విచారంగా ఉంటూ, వరాలు పొందిన గర్వంతో ముల్లోకాలనూ క్షోభ పెట్టారని తెలిపి, ఇంకా ఇలా అన్నాడు:

రాక్షసులు పెట్టే యాతనలు భరించలేక దేవతలూ, ఋషులూ మహేశ్వరుడి వద్దకు వెళ్ళి, “జగద్రక్షకా! సుకేశుడి కొడుకులు బ్రహ్మ నుంచి వరాలు పొంది పొగరెక్కి, స్వర్గం నుంచి దేవతలను తరిమేసి దాన్ని తాము ఆక్రమించుకున్నారు, మునుల ఆశ్రమాలూ, ఇళ్ళూ శూన్యం పెట్టేశారు.. బ్రహ్మా, రుద్రుడూ, విష్ణువు, ఇంద్రుడూ,యముడూ, వరుణుడూ, చంద్రుడూ, సూర్యుడూ అన్నీ తామేనని చెప్పుకుంటున్నారు. ఏ క్షణం చూసినా యుద్ధ సన్నద్ధులై ఉండే ఆ రాక్షసుల నుంచి, మమ్మల్ని కాపాడు,” అని భయపడుతూ వేడుకున్నారు.

అయితే మహేశ్వరుడు సుకేశుడి పట్ల పక్షపాతం కలవాడు. అందుచేత ఆయన వారితో, “దేవతలారా, మహర్షులారా ! ఆ రాక్షసులను చంపటం నాకు సాధ్యం కాదు. వారి చావు నా చేతిలో లేదు. నా మాట విని మీరు విష్ణువు వద్దకు వెళ్ళారంటే, ఆయన తప్పకుండా వాళ్ళను చంపగలడు,” అన్నాడు.

దేవతలు మొదలైన వారు మహేశ్వరుడికి జయం పలికి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, మహేశ్వరుడితో మొర పెట్టుకున్నట్టే మొరపెట్టుకుని, త్రికూటపర్వతం మీద లంకా నగరంలో చేరిన రాక్షసులను చంపి, తమను కాపాడమనీ, తమకు వేరే దిక్కు లేదని వేడుకున్నారు.

విష్ణుమూర్తి వారికి అభయమిచ్చి, “నేను సుకేశుణ్ణి, అతని ముగ్గురు కొడుకులనూ ఎరుగుదును. వారి ప్రవర్తన చూస్తే నాకూ మంటగానే ఉన్నది. నేను వాళ్ళను సంహరిస్తాను. మీరు భయపడకండి,” అన్నాడు. ఈ మాటలు విని దేవతలు పరమానంద భరితులై, విష్ణుమూర్తిని ప్రశంసించి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

“ఈ సంగతి లంకలో తెలిసింది. మాల్యవంతుడు తన తమ్ములతో, “దేవతలూ, ఋషులూ చేరి మనను చంపించటానికి చూస్తున్నారు. వాళ్ళు మహేశ్వరుడి వద్దకు వెళ్ళి మనను చంపమని కాళ్ళా, వేళ్ళా పడ్డారట. ఆ పని తనకు సాధ్యం కాదనీ, విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమనీ, మహేశ్వరుడు సలహా ఇచ్చాడట. ఆ సలహా ప్రకారం వాళ్ళు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, ఆయన కాళ్ళ పైన పడ్డారట. ఆయన మననందరినీ చంపుతానని వారికి అభయ మిచ్చి పంపేశాడట. విష్ణుమూర్తి మనని చంపటానికి నిశ్చయించినట్టయితే మనమేం చెయ్యాలో ఆలోచించటం మంచిది. ఎందుకంటే, ఆయన హిరణ్యకశిపుడి లాటి అనేక మంది ప్రబల రాక్షసులను చంపి ఉన్నాడు. ఎన్నో వరాలు పొంది, యజ్ఞలు చేసి, దివ్యా స్త్రాలు సంపాదించి, మాయలలో ఆరితేరిన రాక్షసులాయనతో యుద్ధం చేసి చచ్చారు. ఈ సంగతి మనసులో ఉంచుకుని మన కర్తవ్యం నిర్ణయించుకోవాలి,” అన్నాడు.

దీనికి మాలి సుమాలీ ఇలా చెప్పారు. “మనం పండితులం, యజ్ఞాలూ, దానాలూ చేసిన వాళ్ళం; మనకు అంతులేని ఐశ్వర్యం ఉన్నది; అత్యంత బలవంతులైన శత్రువులను జయించాం; విష్ణుమూర్తి అయేది, రుద్రుడయేది, ఇంద్రుడయేది మన ఎదట నిలబడలేడు. మనకే లోకాలన్నీ వణికిపోతాయి. విష్ణుమూర్తి మనని ద్వేషించటానికి కారణమేమీ కనబడదు. ఈ దేవతలే ఆయనను రేపెట్టి ఉంటారు. అందుకు మనం సైన్యాలతో సహా బయలుదేరి వెళ్ళి ఆ దేవతల పని పట్టిద్దాం.”

ఈ విధంగా ఆలోచించుకుని ఆ రాక్షస సహోదరులు యుద్ధ యత్నాలు చేసి, సైన్య సమేతులై స్వర్గం మీదికి బయలుదేరారు. లంక నుంచి వారి వెంట, రథాలూ, ఏను గులతో, గుర్రాలతో, ఒంటెలు మొదలైన వాటితో నడిచే వాహనాలూ, స్వర్గాన్ని ముట్టడించటానికి కదిలాయి. అపారమైన ఆ రాక్షససేనకు నాయకుడు మాలి. ఇలా రాక్షసులు లంకను విడిచి బయలుదేరగానే లంక పాడుపడి నట్టయిపోయింది.

రాక్షసులు యుద్ధానికి కదిలిన మాట తెలియగానే విష్ణుమూర్తి, ధగధగా మెరిసే కవచం ధరించి, బాణాలూ, విల్లూ, శంఖమూ, చక్రమూ, గదా, ఖడ్గమూ తీసుకుని, పీతాంబరంతో గరుడవాహన మెక్కి వచ్చి దేవసేనను చేరగానే ఉభయపక్షాలకూ యుద్ధం ప్రారంభమయింది.

విష్ణుమూర్తి తన బాణాలతోనూ, చక్రంతోనూ అనేక మంది రాక్షసులను చంపాడు. కాని మాలి విష్ణుమూర్తి నెదుర్కొని, అతి దారుణమైన యుద్ధం చేసి, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు తల మీద బలంగా కొట్టి, యుద్ధరంగం నుండి పారిపోయేటట్టు కూడా చేశాడు. అయితే చివరకు విష్ణుమూర్తి తన చక్రాయుధంతో మాలి తల తెగనరికాడు. మాలి చావటం చూసి సుమాలీ, మాల్యవంతుడూ, తమ రాక్షస బలాలతో సహా లంకలోకి పారిపోయారు. విష్ణుమూర్తి ఆ రాక్షసులను వెన్నాడి వధించసాగాడు.

అది చూసి మాల్యవంతుడు, “నీవు క్షత్రియ ధర్మం కూడా పాటించకుండా పారిపోతున్న మమ్మల్ని వెంటాడి చంపు తున్నావే! అటువంటి వాడికి వీరస్వర్గం కూడా రాదుగద నీ కంతగా యుద్ధం చెయ్యాలని ఉంటే నాతో చెయ్యి,” అంటూ, విష్ణువుకు ఎదురుగా నిలబడ్డాడు.

“మీరు యుద్ధరంగం నుంచి పారిపోవ టమేగాదు, పాతాళ లోకంలో దాక్కున్నా వెతికి చంపుతాను. మిమ్మల్ని చంపుతానని దేవతలకు మాట ఇచ్చాను. ఆ మాట తప్పను,” అన్నాడు విష్ణుమూర్తి. ఇద్దరూ యుద్ధానికి తలపడ్డారు. మాల్యవంతుడు విష్ణుమూర్తినీ, గరుత్మంతుణ్ణి కూడా చాలా పీడించాడు. అయితే గరుత్మంతుడు తన రెక్కలు విసిరి గాలి పుట్టించే సరికి, ఆ గాలి మాల్యవంతుణ్ణి ఆకాశంలోకి ఎగరగొట్టింది. అది చూసి సుమాలి తన సైన్యంతో సహా లంకలోకి పారిపోయాడు. మాల్యవంతుడు ఎలాగో తన సేనను కలుసుకుని, పుట్టెడు పరాభవంతో లంకకు చేరుకున్నాడు.

అటు తరువాత విష్ణుమూర్తి లంకావాసులైన రాక్షసులతో అనేక యుద్ధాలు చేసి, అనేక మంది రాక్షస వీరులను చంపిన అనంతరం, చావగా మిగిలిన రాక్షసులు తమ భార్యలతోనూ, పిల్లలతోనూ, పరివారంతోనూ లంకను విడిచిపెట్టి పాతాళలోకానికి వెళ్ళి, అక్కడ నివాసం ఏర్పరుచుకుని, సుమాలిని తమ అధిపతిగా చేసుకున్నారు. ఆ కాలంలో విష్ణుమూర్తి చేత చచ్చిన మాల్యవంతుడు మొదలైన రాక్షసులు రావణ కుంభకర్ణుల కంటె బలవంతులు.

రాక్షసులు లంకను విడిచి వెళ్ళిపోగానే వైశ్రవణుడు (కుబేరుడు) తిరిగి లంకలో నివసించనారంభించాడు.

కొంత కాలం గడిచింది. సుమాలి ఒక నాడు కైకసి అనే తన కుమార్తెను వెంట బెట్టుకుని పాతాళలోకం నుంచి బయలుదేరి భూలోకంలో విహరించ వచ్చాడు. వారు భూమి మీద తిరుగుతూ ఉండగా, పుష్పకం ఎక్కి తన తండ్రిని చూడటానికి వెళుతున్న కుబేరుడు వారికి కనిపించాడు.

కుబేరుడి ఐశ్వర్యంతో తన దౌర్భాగ్య స్థితిని పోల్చుకుని సుమాలి, “ఏం చేస్తే మేం వృద్ధిలోకి వస్తాం?” అని ఆలోచించుకుని, చివరకు ఒక ఆలోచన చేశాడు. అపర లక్ష్మీదేవి లాటి తన కుమార్తెతో అతను, ” అమ్మా, నీకు పెళ్ళియీడు వచ్చింది. నిన్ను పెళ్ళాడగోరే వారు చాలా మంది ఉన్నారు, కాని నీవు ఒప్పుకోవని సంశయిస్తున్నారు. విశ్రవశుడి కొడుకైన కుబేరుడి మహావైభవం కళ్ళారా చూశావుగద. విశ్రవసుడు పులస్త్య బ్రహ్మ కొడుకు, మహాముని. ఆయనను సేవించావంటే నీక్కూడా ఇలాటి కొడుకులే కలుగుతారు,” అన్నాడు.

కైకసి తండ్రి మీది గౌవరం కొద్దీ బయలుదేరి విశ్రవసుడు  తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి నిలబడింది. ఆ సమయానికి విశ్రవుడు అగ్నిని అర్చిస్తున్నాడు. నిండు చంద్రుడి లాగా వెలిగిపోతున్న కైకసిని చూసి విశ్రవుడు, “సుందరీ, ఎవరి కుమార్తెవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం పని మీద వచ్చావు?నిజం చెప్పు,” అన్నాడు.

కైకసి చేతులు జోడించి, “మునీశ్వరా, మీరు తపశ్శక్తితో అంతా తెలుసుకోగలరు. నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారం వచ్చాను.. నా పేరు కైకసి,” అన్నది.

“అవును. తెలిసింది. నా వల్ల కొడుకులను కోరి వచ్చావు,” అని విశ్రవుడామెను యథావిధిగా పెళ్ళాడి, “నీవు సంతానం కోరి వచ్చినది రాక్షస ఘడియలలో. ఆ కారణంగా నీకు దారుణమైన ‘మహాక్రూరు లైన రాక్షసులు కలుగుతారు,” అన్నాడు.

“మీ వంటి తపశ్శాలికి అలాటి పిల్లలు పుట్టటమా ? నాకు అవసరం లేదు. మంచి పిల్లలను దయచేసి అనుగ్రహించండి,”అన్నది కైకసి. ఆమె ఎంతో బతిమాలిన మీదట విశ్రవుడు, “సరే, నీ చిన్న కొడుకు నీ వంశానికి తగి ఉంటాడులే,” అన్నాడు.

కొంతకాలం గడిచాక కైకసి ఒక పిల్లవాణ్ణి కన్నది. వాడు చూడటానికి పరమ వికారంగా ఉన్నాడు – రాక్షసి రూపం, భయంకరాకారం, పది తలలు, పెద్ద కోరలు, కాటుక రంగు శరీరచ్ఛాయ, ఎర్రని పెదవులు, ఇరవై చేతులు, పెద్ద పెద్ద నోళ్ళు! అతనికి పది తలలుండటం చూసి, విశ్రవుడా కుర్రవాడికి దశగ్రీవుడు (పది కంఠాలు గలవాడు) అని నామకరణం చేశాడు. అతనే రావణుడు.

రావణుడి తరవాత పుట్టిన కుంభకర్ణుడు, మహాబలుడు, ఏ జంతువుకూ లేనంత పెద్ద శరీరం గలవాడు. అతని అనంతరం వికృతమైన ముఖం గల శూర్పణఖ పుట్టింది. అందరి కన్న ఆఖరుకు పుట్టినవాడు విభీష ణుడు. అతను సత్యగుణం గలవాడు.

రావణ కుంభకర్ణులు అరణ్యం లోనే పెరుగుతూ, తమ అసాధారణ బలంతో అందరికీ దిగులు పుట్టిస్తూ సంచరించ సాగారు. కుంభకర్ణుడు ఋషులను పట్టుకుని తినేస్తూ ఉండేవాడు. విభీషణుడు మాత్రం స్వాధ్యాయం చేస్తూ, నియమితాహారుడై, ధర్మమార్గం అవలంబించాడు.

వారందరూ ఆశ్రమంలోనే ఉండగా ఒకనాడు కుబేరుడు పుష్పకం పైన తన తండ్రిని చూడవచ్చాడు. కుబేరుడి తేజస్సు, ఐశ్వర్యమూ చూసి అసూయపడిన కైకసి తన పెద్ద కొడుకైన రావణుడితో, “మీ అన్న అయిన కుబేరుడి వైభవం చూశావా? ఆ తండ్రికి పుట్టినవాడివే గదా, నీవు చూడు ఎలాగున్నావే! నీవు ఆ కుబేరుడితో సమానంగా ఉంటే నేను సంతోషిస్తానురా నాయనా,” అన్నది.

అమిత ప్రతాపశాలి అయిన రావణుడికి మాటలు రోషం తెప్పించాయి. అతను తన తల్లితో, “అమ్మా, నేను నా సవతి అన్నతో సమానుణ్ణి, అంతకు మించినవాణ్ణి అయి తీరుతాను. విచారించకు,” అని ప్రతిజ్ఞ చేశాడు. అతను కుంభకర్ణుడితో కలిసి మహత్తరమైన పనులు చేయాలని సంకల్పించుకుని, తన తమ్ములతో సహా గోకర్ణాశ్రమానికి వెళ్ళి, అక్కడ అతి తీవ్ర మైన తపస్సు చేశాడు. అతనితో కుంభకర్ణ,విభీషణులు కూడా తపస్సు చేశారు.

రావణుడు నిరాహారుడై పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతను వెయ్యి సంవత్సరాల కొక శిరస్సు చొప్పున నరికి అగ్ని గుండలో వేశాడు. అతని పది తలలలో తొమ్మిది ఆహుతి అయి, ఒక్కటి మిగిలింది. పదివేల సంవత్సరాలూ ముగిసి, రావణుడు తనకు మిగిలిన ఒక్క తలనూ నరుక్కోబోతుండగా, బ్రహ్మ దిక్పాలకులను వెంట బెట్టుకుని వచ్చి, “దశగ్రీవా, నీ తపస్సుకు మెచ్చాను. నీ కిష్టమైన వరం కోరుకో,” అన్నాడు.

రావణుడు పరమానందంతో బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, “తాతా, ప్రాణులకు మరణ భయాన్ని మించిన భయం మరొకటి లేదు. నాకు చావు లేకుండా వరమియ్యి,” అన్నాడు.

“నాయనా, అలాటి వర మియ్యటం సాధ్యం కాదు, మరొక వరం కోరుకో,” అన్నాడు బ్రహ్మ.

“ఇతర ప్రాణుల భయం నా కేమీ లేదు గాని, నాకు సుపర్ణులూ, నాగులూ, యక్షులూ, దైత్యులూ, దానవులూ, రాక్షసులూ, దేవతలూ మొదలైన వారి వల్ల చావు లేకుండా వరమియ్యి. మనుష్యులు మొదలైన వాళ్ళు నాకు తృణప్రాయులే,” అన్నాడు రావణుడు.

రావణుడు కోరినట్టే బ్రహ్మ వరమిచ్చాడు; ఆ వరంతో బాటు రావణుడికి పది తలలూ ఎప్పటి లాగే ఉండేటట్టూ, అతనికి కోరిన రూపం సిద్ధించేటట్టూ కూడా వరమిచ్చాడు. తరవాత బ్రహ్మ విభీషణుణ్ణి కూడా వరం కోరుకో మన్నాడు. తన మనసు ధర్మం తప్పకుండానూ, తలచినప్పుడు తనకు బ్రహ్మాస్త్రం స్ఫురించేటట్టూ విభీష ణుడు వరం కోరాడు. బ్రహ్మ అతనికి కోరిన వరమిస్తూ, చావు లేకుండా కూడా వరమిచ్చాడు.

తరువాత వరం పుచ్చుకునే వంతు కుంభకర్ణుడిది. దేవతలు బ్రహ్మతో, “దేవా, కుంభకర్ణుడికి వరమియ్యవద్దు. నందన వనంలో విహరిస్తున్న అప్సర స్త్రీలను ఏడుగురిని తినేశాడు, దేవేంద్రుడి అనుచరులను పదిమందిని తినేశాడు, ఎంత మంది ఋషులనూ, మునులనూ తిన్నాడో లెక్కేలేదు. వరాలు పొందకుండానే వీడిలా ఉంటే, వరాలు పొంది ఎలా తయారవుతాడో !” అన్నారు.

ఈ మాటలు విని బ్రహ్మ సరస్వతిని స్మరించి రప్పించి, కుంభకర్ణుడి వాక్ స్థానాన్ని వశపరుచుకోమని చెప్పాడు. తరవాత ఆయన కుంభకర్ణుణ్ణి చూసి, “నీ ఇష్ట మైన వరం కోరు,” అన్నాడు.

సరస్వతీ ప్రభావం చేత కుంభకర్ణుడు, “నాకు సంవత్సరాల తరబడి నిద్రపోయేటట్టు వరమియ్యి,” అన్నాడు. తథాస్తు అని చెప్పి బ్రహ్మ అదృశ్యుడయాడు. కుంభకర్ణుడి వాక్కు నుంచి సరస్వతి కూడా దిగిపోయింది.

వెంటనే కుంభకర్ణుడికి స్పృహ వచ్చినట్టయింది. “ఛీ, ఛీ! ఏమిటిలాటి వరం కోరాను? దేవతలేదో మాయపన్ని నన్ను మోసగించారు,” అని చింతించాడు.

రావణ కుంభకర్ణ విభీషణులు ఈ విధంగా బ్రహ్మ వల్ల వరాలు పొంది, శ్లేష్మాతక వనానికి వెళ్ళి, అక్కడ నివసించసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *