మంథర కైకేయిని రెచ్చగొట్టుట

రాముడు ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తి చేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహవాచనం చేశారు, మంగళ వాయిద్యాలతో అయోధ్య యావత్తు మారుమోగిపోయింది. తెల్లవారుతూనే మళ్లీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు. ఇళ్ల ముందు నీళ్లు చల్లి పువ్వులు చిమ్మారు, సుగంధ ధూపాలు వేశారు జనం గుంపులుగా గూడి పట్టాభిషేకం గురించి మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇళ్ళ ముందు ఆడుకుంటూ ఇవాళ పట్టాభిషేకం చూడడానికి నేను కూడా మా అమ్మానాన్న వెంటపోతాను అని చెప్పుకుంటున్నారు. ఆడేవాళ్లు ఆడుతున్నారు పాడేవాళ్లు పాడుతున్నారు.

కాని ఆ రాత్రే మరొకరకం నాటకం ఆరంభమయింది. కైకేయి వెంట మంధర అనే ఒక గూనె దాసి ఆమెకు ఆరణంగా వచ్చింది. ఆ మంధర ఆ రాత్రి కైకేయి ఉండే మేడ పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యలో జరిగే సందడి అంతా చూసి ఆశ్చర్యపడింది. తన పక్కనే తెల్ల పట్టుచీరే గట్టి నిలబడి ఉన్న ఒక దాదితో మంధర, “ఈ ఆర్భాటమంతా ఏమిటే? మా కౌసల్య ఎదన్నా వ్రతంపట్టి జనానికి దానధర్మాలు చేస్తున్నదా? లేక దశరథుడు ఏదన్నా ఉత్సవం తలపెట్టాడా?” అన్నది. దాది పొట్ట చెక్కలయేలాగ నవ్వి, “తెల్లవారగానే రాజుగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు” అని చెప్పింది.

Mandara on hearing about Coronation of rama

గూని మందరకు ఈ వార్త కర్ణ కఠోరమయింది. ఆమె గబగబా మేడదిగి కైకేయి పడుకొని ఉన్న చోటికి వెళ్లి “ఏం పడుకున్నావు, నీ కొంప నిలువునా కూలపోతున్నది ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరి మీద లేదని మహామురిశావు. ఇక మురుద్దువు గాని అన్నది.” “నీ వాలకం చూస్తే ఏదో జరిగినట్టుందే, అందరూ క్షేమంగానే ఉన్నారు కదా?” అన్నది కైకేయి. “రేపు దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడు, ఇంకేం జరగాలి, ఈ మాట వినగానే నా గుండె జారిపోయింది. నీ మంచి కోరిన దాన్ని కనుక ఈ మాట వింటూనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను.” అన్నది

“మందర, నిజంగానా మందర ఎంత మంచి వార్త తెచ్చావు” అంటూ కైకేయి వికసించిన ముఖంతో పక్కమీద లేచికూర్చోని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ, “ఇంకేం కావాలన్నా ఇస్తాను అడుగు అన్నది.” కైకేయి ఈ ధోరణి మందరకేమి నచ్చలేదు, ఆమె తన యజమానురాలితో “మూఢురాల నీకు రాబోయే విపత్తు అర్థం చేసుకోలేకుండా ఉన్నావు. లేకపోతే దుఖించడానికి బదులు ఆనందిస్తావా, నీకు బదులు కూడా నేనే ఏడుస్తున్నాను,.ఎందుకంటావా రేపు ఈ పట్టాభిషేకం జరగగానే కౌసల్య రాజమాత అవుతుంది. నీవు ఆమెకు పరిచారికవుతావు, రాముని అంతఃపుర స్త్రీలకు నీ కోడళ్ళు దాసీలవుతారు. భరతడు అతని సంతతి రూపుమాసి పోవాల్సిందే నాకు బహుమానం ఇస్తానంటివే నీకేమీ జరిగిందని బహుమానం ఇస్తావు, రాజ్యభిషేకం భరతుడికి జరిగినప్పుడు కదా నేను నీ బహుమానాలు పొందవలసింది.”

“భరతడు దురాన మామగారు ఇంట్లో ఉండబట్టి గాని దశరథుడు నీపై ప్రేమ కొద్ది అతనికి ఈ పట్టాభిషేకం చేసి ఉండడా, రాముడు రాజయ్యాక భరతుడిక ఇక్కడికి రానవసరం లేదు. అటు నుంచి అటే అడవికి పోవడం మేలు ఎందుకంటే రాముడు అతన్ని బతకనివ్వడు. నీ భర్త నీ మీద ఎక్కువ ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంతవరకు నీవు కౌసల్యను చాలా లోకువగా చూసావు. ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా నీకు నిజంగా సమర్థత ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టించు. భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకితోయించు ఇంత రాజ్యానికి భరతుడు రాజవుతాడు నీవు రాజమాత వై గౌరవం పొందుతావు రాముడు రాజయితే నీ పతనం తప్పదు నీ ముఖం చూసేవారుండరు” అని ఎడాపడా అనేసింది.

ఈ మాటలు కైకేయి తలకెక్కాయి ఆమె ముఖం బేపురించింది క్రోధావేశంతో ఆమె మందరను చూసి అవును భరతుడు రాజు కావలసిందే రాముడడవి పాలు కావాల్సిందే కానీ అది ఎలా సాధ్యపడుతుంది అన్నది.

“రాముణ్ణి అడవులకు నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విను. విని నేను చెప్పినట్టు నడుచుకో”

“ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు.పఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్వజుడేలే వైజయంతం వద్ద శంబరుడనే మహాబలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్ధం చేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడు ఆయనను నీవు యుద్దరంగం నుంచి దూరంగా తీసుకుపోయి ఆయన ప్రాణాలు కాపాడావు స్పృహ తెలిసినాక నీ సేవకు సంతోషించి నీకు రెండు వారాలు ఇచ్చాడు. కానీ వాటిని నీవు తర్వాత కోరుకుంటానన్నావు. చూశావా? ఇప్పుడా రెండు వరాలు కోరుకునే సమయం వచ్చింది. రాముణ్ణి పధ్నాలుగేళ్ళు అడవులకు పంపమని భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని నీవు ఇప్పుడు నీ భర్తను కోరు” అని మందర కైకేయి కి హితవు చెప్పింది.

కైకేయి పాపం సహజంగా మంచి స్వభావం కలదే గానీ మందర చేసిన బోధలతో ఆమె మనస్సు పెడదారి పడింది. ఆ మందర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతోబాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది.

“నీభర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికి మంటికి ఏకధారిగా ఏడు నీ కోపంగాని నీ శోకంగాని రాజు కొంచమైనా భరించలేడు. వాటిని పోగొట్టడానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన రెండు వరాలు ఇచ్చిన దాకా నీవు మెత్తబడకు. నీకు మణులు ముత్యాలు బంగారం ఇస్తానంటాడు అక్కర్లేదని బెట్టు చెయ్యి. ఆలోచించుకో భరతుడు పధ్నాలుగేళ్ళు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరు కదిలించలేరు.” అన్నది మంధర.

కైకేయి మందరను “ఓసి గూనిదానా నిజంగా నీవెంత తెలివిగల దానవే నా మేలు నీవు కోరినట్టుగా మరెవరు కోరరు గదా” అని ప్రశంసించింది “ఆ శంబారాసురుడి కన్న నీకెక్కువ తంత్రాలు తెలుసుగదే” అని కైకేయి మందరను మెచ్చుకున్నది.తన భర్త తనకు వరాలివ్వని పక్షంలో చచ్చిపోవడానికి కూడా ఆమె నిశ్చయించుకున్నది. ఆమె ముసలిదాని సలహాతో తన నగలన్నీ తీసివేసి చిరిగిన కోక ఒకటి చుట్టుకుని కోపగృహానికి వెళ్ళి కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది.

ఆ శంబారాసురుడి కన్న నీకెక్కువ తంత్రాలు తెలుసుగదే అని కైకేయి మందరను మెచ్చుకున్నది.తన భర్త తనకు వరాలివ్వని పక్షంలో చచ్చిపోవడానికి కూడా ఆమె నిశ్చయించుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *