గంగా నది వద్ద గుహుడు భరతుణ్ణి కలుసుకొనుట

మహా సముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథంయొక్క టెక్కెం గమనించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు. అతను తన ఆప్తులను చేరబిలిచి, “భరతుడు ఇంత సేనతో ఎందుకు బయలుదేరి వచ్చివుంటారు? రాముడు వనవాసం పూర్తిచేసి వచ్చి రాజ్యం అడుగుతాడేమో, అతన్ని అరణ్యంలోనే చంపేద్దామని వచ్చివుంటాడు.”

“మనం రాముణ్ణి ఎలాగైనా రక్షించాలి. అతను నా మిత్రుడు. అందుచేత మన వాళ్ళను అయిదు వందల పడవలు సిద్ధం చెయ్యమనండి. ఒక్కొక్క పడవలోనూ నూరేసిమంది యువకులను ఏర్పాటు చేసి, పడవలు గంగకు అడ్డంగా ఉంచి, అందులోనే ఆహారాలూ, ఉంచుకుని జాగ్రత్తగా ఉండండి, భరతు డికి రాముడి పట్ల ద్రోహబుద్ధి లేకపోతే ఆతన్నీ, అతని సైన్యాన్నీ నిరాటంకంగా నది దాటనిద్దాం లేకపోతే మన పడవలతో ఆటకాయింతాం,” అన్నాడు.

గుహుడు ఈ కట్టుదిట్టాలు చేసిన అనంతరం చేపలూ, మాంసాలూ, తేనే కానుకగా తీసుకుని భరతుడి వద్దకు వెళ్ళాడు. గుహుడు వస్తూండటం ముందుగానే తెలుసుకుని సుమంత్రుడు. భరతుడితో, “నిన్ను చూడటానికి బోయ రాజైన గుహుడు వస్తున్నాడు. అతను బలవంతుడు, సమర్థుడు, రాముడికి మంచి స్నేహితుడు. అతన్ని తగిన విధంగా గౌరవించి నట్టయితే రామ లక్ష్మణులు అరణ్యంలో ఎటు వెళ్ళారో వారి జాడకూడా తెలుస్తుంది,” అన్నాడు.

“అయితే ఆ గుహుణ్ణి వెంటనే నా దగ్గిరికి తీసుకురా,” అని భరతుడు సుమంత్రుణ్ణణ్ణి పంపాడు. గుహుడు భరతుడి సమక్షానికి వచ్చి, తాను తెచ్చిన కానుకలు ఇచ్చి, “తమరు వస్తారని ముందుగా తెలిసివుంటే మంచి ఆతిథ్యమూ, స్వాగతమూ ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి రేపు ముందుకు సాగిపోదురు. గాని,” అన్నాడు.

భరతుడు గుహుడికి సంతోషం కలిగే టట్టుగా, “రాజా, ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిథ్యం ఇస్తానన్నావు, ఆ మాట కన్న మాకు నీ నుంచి హెచ్పు గౌరవం ఇంకేంకావాలి? మేము భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాలి, దారి చెప్పగలవా? ఇక్కడినుంచి దారి చాలా కష్టమని విన్నాను,” అన్నాడు.

“బాణాలు ధరించి మా బోయలు మీ వెంట వస్తారులెండి. నేనుకూడా వెంట ఉంటాను. అందుచేత మీకు దారి వెతుక్కునేపని ఉండదు.” అన్నాడు గుహుడు.

గుహుడు భరతుడికి సహాయం చేస్తా నన్నాడేగాని అతన్ని సందేహం ఇరికా బాధి స్తూనే ఉన్నది. అతను భరతుడితో, “అయ్యా, నీ సేనా, అట్టహాసమూ చూస్తే నా కేదో అనుమానంగా ఉన్నది. నీవు వెళ్ళేది రాముడికి ద్రోహం తలపెట్టి కాదు గద ?” అని అన్నాడు.

ఈ మాటకు భరతుడు బాధపడి, “నీకీ అనుమానం కలగటం కన్న పెద్ద కష్టం నా కేమి ఉంటుంది? పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం కాదా? రాముణ్ణి తీసుకురావటానికే నేను పోతున్నాను. నా మాట నమ్ము,” అన్నాడు.

“మంచిమాట అన్నావు, బాబూ నీలాగా చేతికందిన రాజ్యాన్ని విడిచి పుచ్చేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీకీర్తి శాశ్వతం,” అన్నాడు గుహుడు.

అస్తమమై చీకటి పడింది. ఆ రాత్రి భరతశత్రుఘ్నులు పడుకుని రాముణ్ణి గురించి చాలా దుఃఖించారు. వారి వెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు. అతను లక్ష్మణుణ్ణి గురించి గొప్పగా చెప్పాడు: “రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉన్నాడు. మేమందరమూ మేలుకుని ఉండి రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాను, నిద్రపొమ్మని చెప్పాను. కాని విన్నాడుకాడు.”

“రాముడూ, సీతా కటిక నేలపై పడుకున్నందుకే తన ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే నిద్రఎలా పడుతుందని అడిగాడు. రాముణ్ణి వదిలి దశరథుడు ఒక్కరోజు బతుకుతాడా అన్నాడు. పధ్నాలుగేళ్ళు వనవాసం చేసి మేము మళ్ళీ అయోధ్యకు తిరిగిపోతామా అని చింతించాడు. అదుగో, ఆ మర్రిచెట్టు కిందనే రామలక్ష్మణులు, జడలుధరిం చారు. తెల్లవారినాక నేను వారి చేత గంగ దాటించాను.”

గుహుడు ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే భరతుడికి దుఃఖం హెచ్చిపోయింది. కౌసల్యా, సుమిత్రా, కైకా కూడా అతనున్న చోటికి వచ్చారు. వారి ఆసక్తి చూసి గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరమూ చెప్పాడు. సీతారాములు గార చెట్టు కింద పడుకున్న చోటు కూడా చూపాడు. దశరథ మహారాజు పెద్దకొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడు కోవటం భరతుడు ఊహించనైనా లేక పోయాడు. ఆ రాత్రి గడిచినాక గుహుడు వచ్చి భరతుడికి నమస్కారంచేసి, ” రాత్రి సుఖంగా గడిచిందా ?” అని అడిగాడు.

“మాకు ఏలోటూ జరగలేదు. మమ్మల్ని త్వరగా నది దాటించే ఏర్పాట్లు చేయించు,” అన్నాడు భరతుడు.

గుహుడు అయిదువందల పడవలూ, స్వస్తికా అనే పేరు గల మేలుజాతి ఓడలు. సిద్ధం చేయించాడు. తెల్ల కంబళి పరిచిన ఒక స్వస్తికంలో భరతశత్రుఘ్నులూ, వసి స్టుడూ, రాజభార్యలూ ఎక్కారు. భరతుడి సేనా, రథాలూ, బళ్ళూ, వాటినిలాగే జంతు వులూ, సంబరాలూ, సమస్తమూ పడవల లోకి ఎక్కించారు. పడవలు నది దాటాయి. ఏనుగులు నదికి అడ్డంగా ఈదాయి. అలాగే కొందరు మనుషులుకూడా ఈదారు. మరి కొందరు తెప్పలమీదా, కుండల సహాయం తోనూ నది దాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *