దశరధుడు రాముడిని అరణ్యానికి పంపుట

రథం దశరధుడి నగరు ప్రవేశించి మూడు ప్రాకారాలు దాటి నిలిచిపోయింది.తన వెంట వచ్చిన బలగము ప్రజలు అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు. ఒక అందమైన ఆసనం పైన దశరధుడూ కైకేయి కూర్చుని ఉన్నారు. రాముడు తండ్రికాళ్ళకు తరవాత కైకేయి కాళ్లకు నమస్కరించాడు. “రామా” అంటూ ఏదో చెప్పబోయి దశరధుడు గొంతు పెగలక కళ్ళు మూతబడి కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివశుడయ్యాడు.

తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలిగింది. అతను కలవరపడి కైకేయితో “అమ్మ నావల్ల ఏదైనా తప్పు జరిగిందా? తండ్రిగారు ఇలా కలవరపడడానికి కారణమేమిటి? ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు, నాకేమో ఆందోళనగా ఉన్నది.” అన్నాడు.

కైకేయి కొంచెం కూడా బిడియం లేకుండా “రాజుగారికి కోపం లేదు తాపము లేదు ఆయనకు ఒక కోరిక ఉన్నది,అది నీకు చెప్పడానికి జంకుతున్నాడు. ఒకప్పుడు ఈయన గారు నాకు ఒక వరం ఇస్తానన్నాడు, ఎందుకన్నానా అని ఇప్పుడు కుళ్ళు తున్నాడు. ధర్మం జరగడం ప్రధానం కదా నీ తండ్రి ఆడిన మాట తప్పకుండా చూసే భారం నీ మీద ఉన్నది. మంచోచెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను. ఆ సంగతి ఆయన నోటీ వెంట రాదు. అందుచేత నేనే చెప్పాలి మరి.” అన్నది”

అదేమిటమ్మ నన్నలా శంకించవచ్చా నాయన గారు కోరితే, నిప్పులో దూకనా ఆయన కోరిక ఏమిటో చెప్పు తప్పక చేస్తాను. నేను ఆడి తప్పను.” అన్నాడు రాముడు.

కైక రాముడితో దేవాసుర యుద్ధం నాటి విషయాలు చెప్పి, ఆయన ఆ సమయంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు పధ్నాలుగేళ్ళు అరణ్యవాసానికి పోవలసి ఉంటుందని చెప్పింది. “ఈ పట్టాభిషేకయత్నం వృధా పోదులే భరతుడు పట్టాభిషేకం చేసుకొని, భూమి నాలుగు చెరుగులు పాలిస్తాడు. నీవు నారా బట్టలు జడలు ధరించి పధ్నాలుగేళ్ళు అరణ్యవాసం వెళ్లినట్టయితే నీ తండ్రికి ఆడితప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండా పోతుంది అన్నదామె.”

ఇంత దారుణమైన మాట ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడయితే ఎంతో కలవరపడి మధనపడి కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండును కాని రాముడటువంటి వికారాలేమి లేకుండా “అమ్మా అలాగే కానీ, నేను నార బట్టలు కట్టి అరణ్యానికి పోతాను భరతుడి కోసం వెంటనే కబురు పంపండి. తండ్రి గారి ప్రతిజ్ఞ నీ కోరిక ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా భరతుడికి పట్టంకట్ట నిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది అన్నాడు.”

ఈ మాటలకు కైకేయి సంతోషించి “మరేం లేదులే ఆయన మాట దక్కిస్తావో దక్కించవో అని జంకు చేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు, నువ్వు మాత్రం జాగు చేయక అడవికి బయలుదేరు. నీవు వెళ్ళేదాకా మీ తండ్రిగారు స్నాన భోజనాధులు చేయడు” అన్నది.

కైకేయి అన్న ఈ మాటలకు దశరధుడు లోలోపల కుమిలి మూర్చ పోయాడు. రాముడాయనను లేవదీసి కూర్చోబెట్టి కైకేయితో “అమ్మ నాకు లోపల నిజంగా రాజ్యకాంక్ష ధనకాంక్ష లేవు నేనింకేమైనా చేయవలసినది, ఉంటే చెప్పు నీవు రాజుగారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి. నీవు నిజంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు” అన్నాడు.

దశరధుడు భావురుమని ఏడ్చి స్పృహతప్పి పడిపోయాడు. రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారం చేసి, అంతపురం నుంచి బయటికి వచ్చి తన చెలికాళ్ళకేసి చూసి పట్టాభిషేకం సంబరాలకు ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోను, ఆగ్రహంతోను పెనుగులాడుతూ అన్నను వెంబడించాడు.

రాముడు రథమెక్కలేదు. ఛత్రచామరలూ నిషేధించాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన యోగి యొక్క మనస్థితి తెచ్చి పెట్టుకుని ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు. దశరధుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినబడింది.

రామలక్ష్మణులు కౌసల్య నగరకు వచ్చేసరికి అక్కడ ఎవరికీ జరగబోయేది తెలియదు. రాముడు మొదటి ప్రాకార ద్వారం నుంచి లోపలికి పోతుంటే అక్కడ ఉండిన ఒక వృద్ధుడూ, మరికొందరు లేచి నిలబడి విజయద్వానాలు చేశారు. రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మణులకు నమస్కరించి మూడో ప్రాకారం చేరాడు. అక్కడి కావలి వాళ్ళంతా స్త్రీలు. వారిలో కొందరు కౌసల్యతో రామలక్ష్మణుల రాక చెప్పడానికి పరిగెత్తారు. మిగిలిన వాళ్ళు మహారాజుకు జయం కలగాలి అని కేకలు పెట్టారు.

రాముడు వచ్చేసరికి కౌశల్య అగ్నిలో హోమం చేస్తున్నది. ఆమె రాముడికి ఎదురు వచ్చి కౌగిలించుకొని శిరస్సు ముద్దు పెట్టుకుని,నాయన భోజనం చేద్దువు గాని పద అన్నది. తల్లికి ఈ విషాద వార్త ఎలా తెలపాలో తెలియక తికమక పడుతూ రాముడు అమ్మా నీకు ఇంకా తెలియదులాగుంది అంతా తారుమారైపోయింది.నేను పధ్నాలుగేళ్ళు మునిలాగా కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను నేను కూచునేది సింహాసనం మీద కాదు దర్భల చాప మీద నాన్నగారు భరతుడికి పట్టం కట్టబోతున్నారు అన్నాడు.

ఈ మాట విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది. రాముడామెను లేవదీసి కూచోబెట్టి దుమ్మంతా దులిపాడు. కౌసల్య రాముడితో “నాయన నా జన్మకు సుఖం లేదు కాబోలు. నిన్ను కని ఈ బాధ భరించే కన్నా గొడ్రాలు గానే ఉండిపోయినట్లయితే పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది. ఎన్నడూ నేను సుఖపడి ఎరగను నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను. కావటానికి నేను రాజు గారి పెద్ద భార్యనే కానీ సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను. ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యం లేదు. నాకు స్వాతంత్ర్యమూ లేదు, ఇక నేను కైకేయి పరిచారికల కంటే హీనంగా బతకాలి. నీవు పుట్టిన ఈ పదిహేడేళ్ళు నీవెప్పుడు రాజువవుతావా అని ఎదురుచూస్తూ వచ్చాను. ఆ ఆశ కూడా పోయింది నాకు చావు వచ్చిన బాగుండను కానీ, అది కావాలన్నప్పుడు రాదు. నాయనా, నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను.’ అన్నది.

కౌసల్య మాటలు వింటుంటే లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు కౌసల్యతో “అమ్మా ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవడం నాకు సవ్యంగా కనపడలేదు. రాజు ముసలివాడు ఆయన మనసు దుర్బలమైనది. స్త్రీ వ్యామోహం చేత ఆయన అన్యాయమైన పని చేయమంటే కొడుకులమైన మేము చేయాలని ఎక్కడ ఉంది” అని, రాముడితో “అన్నా, రాజు నిన్ను అడవికి పొమ్మన్న మాట అందరికీ తెలియక ముందే మనం మన సౌర్యంతో రాజ్యాన్ని వశపరచుకుందాం. నేను విల్లుపట్టి మనని నిరోధించే వాళ్ళందరిని చంపుతాను. మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు. మా అందరిలోనూ పెద్దవాడవు ఈ రాజ్యం నీది దీన్ని మరొకరికి ఎలా ఇస్తాడు. నీవేమీ అపచారం చేసావని నిన్ను అడవులకు పంపుతాడు.నిన్ను అడవులకు పంపేంత శక్తిమంతుడా ఈ రాజు ఇదిగో నా విల్లు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు.

కౌసల్య రాముడితో “నాయన లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది? నేను తల్లిని కానా నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పను. ఒకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది” అన్నది.

రాముడు తల్లి తో “నేను నాన్నగారి మాట అబద్ధం చేయలేను. జవదాటలేను పితృవాక్యం పాలించడానికి ఎందరో ఘోరాలు చేశారు కండుడు అనే ముని గోవధ చేశాడు. పరశురాముడు తల్లినే చంపాడు. మా మూలపురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి అరవైవేలమంది ఒక్కసారిగా మరణించారు. అమ్మా నేను నిన్ను ధిక్కరించడానికి అరణ్యానికి పోతున్నానా?” అని, లక్ష్మణుడితో, “లక్ష్మణ నీకు నాపై గల ప్రేమా నీ పౌరుషము నేనెరగన అన్నిటికన్నా ధర్మం గొప్పది. దానిని మనం నిలబెట్టాలి. అందుచేత నా బుద్ధి అనుసరించే నీవు కూడా ఆలోచించు” అన్నాడు.

తల్లిని సమాధాన పరచటానికి రాముడు ఎన్నో ధర్మాలు చెప్పాడు. కౌసల్య భర్తను విడిచి తన వెంట రావడం భావ్యం కాదన్నాడు అతను లక్ష్మణుడితో “ఇది దైవ నిర్ణయం కాకపోతే నేనంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా? పట్టాభిషేకం నిలిచిపోయిందంటే నీకింత బాధగా ఉన్నదే పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధపడిందో.నేను తండ్రిగారి మనసు గాని ఆమె మనసు గాని నొప్పించినట్టు నాకు జ్ఞాపకం లేదు.” ఇప్పుడా పని చేయలేను అని చెప్పాడు.

రాముడు తండ్రి ఆజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్ళే ధృడనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *