భరతుడు రాముడిని అయోద్యకు రమ్మని ప్రాదేయపడుట

రాముడూ వసిష్ఠుడూ దగ్గిరగా కూచు న్నారు. రాముడికి మరొక పక్కగా భరతుడూ, మంత్రులూ, పురప్రముఖులూ కూచున్నారు. భరతుడు తాను వచ్చినపని బయటపెట్టే సమయం వచ్చింది, ఏమంటాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు.

రాముడే విషయం కదిపాడు. “భరతా, నీవు జడలూ, నారబట్టలూ, కృష్ణాజినమూ ధరించి ఈ అరణ్యానికి రావటానికి కారణ మేమిటి? వినాలని ఉన్నది,” అన్నాడతను.

భరతు డిలా చెప్పాడు: “మన తండ్రి నిన్ను అడవికి పంపి నీ వియోగం భరించ లేక కాలధర్మం చేశాడు. ఆయన ఈ పాపపు పని చేయటానికి ప్రేరణ ఇచ్చినది నా తల్లి కైకేయి. అందు కామె ఘోరనరకం ఎలాగూ అనుభవిస్తుంది. ఆమె కొడుకునైన నన్ను నీవు అనుగ్రహించాలి. పచ్చి రాజ్యాభిషేకం చేసుకో. ఇందుకే మన తల్లులూ, ఈ ప్రజలూ కూడా నిన్ను, వెతుక్కుంటూ వచ్చారు. వారి కోరిక తీర్చు. ఇంతమంది కోరికను తోసిపుచ్చకు.”

ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా సాష్టాంగ పడ్డాడు. రాముడు భరతుణ్ణి కౌగలించు కుని నిట్టూర్చుతూ, “నాయనా, నీవు చిన్న తనం చేత నీ తల్లిని నిందించావు. పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించటానికైనా అధికారం ఉన్నది. దశరథుడికి నన్ను ఆడవికి పంపే అధికారం ఉన్నది. తండ్రి మీదలాగే తల్లి మీద గౌరవం ఉంచాలి. పెద్దలునన్ను అడవికి పొమ్మంటే నేను రాజ్యంఎలా చేస్తాను? నీవు అయోధ్యకు వెళ్ళిరాజ్యం చెయ్యాలి, నేను నారబట్టలు కట్టి వనవాసం చెయ్యాలి. ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరచిన నియమం.”

“పధ్నాలుగేళ్ళూ వనవాసం ముగించినాక తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యం చేస్తాను. తండ్రి ఆనతి నెరవేర్చటంకంటే నాకు రాజ్యం ఏలటం ఎక్కువైనది కాదు,” అన్నాడు. ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. మర్నాడు అందరూ స్నానాలూ, జప హెూమాలూ పూర్తిచేసి మళ్ళీ రాముడి చుట్టూ చేరారు. ఎవరూ మాట్లాడలేదు.

నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో, “నా తల్లిని గౌరవించి, నాకు రాజ్యం ఇచ్చావు. దాన్ని నీ కిస్తున్నాను, తీసుకుని సుఖంగా ఏలుకో. ఈ రాజ్యభారం మొయ్యటానికి నీవే సమర్థుడవు. గుర్రంలాగా గాడిదె నడవలేదు గదా! మన తండ్రి నీకు చిన్న తనం నుంచి ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ ఇచ్చాడు. నీవు రాజువు కాకుండాపోతే ఆయన పడిన శ్రమ అంతా వృధా అవుతుంది,” అన్నాడు.

భరతుడు చెప్పిన ఈ మాటలకు చుట్టూ చేరినవారంతా ఎంతో సంతోషం వెలిబుచ్చి, ప్రశంసించారు.

అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు. ప్రాణులకు మరణం నిత్యం మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యువు దగ్గిరపడుతూ ఉంటుంది. ముసలివాడై అసమర్థుడైనవాడు చేయగలది లేదు యౌవనం ఉండగానే ఆత్మవిచారం చెయ్యాలి. గడిచిన క్షణం మరిరాదు. చనిపోయినవారి కోసం ఎంత చింతించి లాభంలేదు. ఏ ప్రాణి కూడా తన యిష్టం వచ్చినట్టు నడుచుకోలేదు.”

“దశ రథుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గా నికి వెళ్ళాడు. అందుచేత భరతుడు మనో వైకల్యం మాని తండ్రి ఆజ్ఞను శిరసా వహించి, తండ్రి జాడలలోనే నడుచు కుంటూ రాజ్యం చెయ్యటం ధర్మం. అలాగే రాముడు తండ్రి ఆజ్ఞ మీరక వనవాసం జరపటం ధర్మం.”

అంతా విని భరతుడు, “నేను ధర్మానికి వెరిచే నా తల్లిని శిక్షించలేదు, తండ్రిని బహిరంగంగా దూషించలేదు. కాని ఆయన తన భార్యకు దాసుడై, ఆమె విషం తాగుతానంటే బెదిరి, రాజ్యం చేయవలసినవాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా? తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచేసి తండ్రికి నరకప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా? వచ్చి రాజ్యంచేసి, తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి,” అన్నాడు.

రాముడు ఇందు కెంతమాత్రమూ ఒప్పక, కైకేయిని పెళ్ళాడేటప్పుడు దశ రథుడు తన మామగారితో ఆమెకు పుట్టే కొడుకుకే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు.

అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో, “వెర్రి వాడా? ఎవరు తండ్రి? ఎవరు కొడుకు ? చచ్చిపోయినవారి తృప్తి కోసం తద్దినాలు పెట్టేవాళ్ళూ, ఈ లోకంలో కష్టాలుపడే వారూ మూఢులు. పరలోకం ఎక్కడున్నది? నీవు వెళ్ళి హాయిగా రాజ్యంచేసి. సుఖపడు. ప్రతి ప్రాణి ఒంటరిగా పుట్టు తుంది, ఒంటరిగా చస్తుంది. బతికున్నంత కాలమూ ఈ ప్రపంచం ఒక మజిలీ. ఇదే నిజం, మిగిలినదంతా భ్రమ,” అన్నాడు.

“ఇవి నాస్తికులనవలిసిన మాటలు. నీవు నాస్తికుడవని తెలియక మా తండ్రి నిన్ను చేరదీశాడు,” అని రాముడు జాబాలిని నిందించాడు.

వసిష్ఠుడు అడ్డువచ్చి, “నాయనా, జాబాలి నాస్తికుడు కాడు. నీచేత ఒప్పించటానికే అతను అలా చెప్పాడు,” అన్నాడు. వసిష్ఠుడు కూడా పట్టం కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు. కాని రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు.

అప్పుడు భరతుడు సుమంత్రుడితో, ” వెంటనే వెళ్ళి దర్భలు తెచ్చి ఈ పర్ణశాల అడ్డంగా పరు. రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై పడుకుని లేవను,” అన్నాడు.

సుమంత్రుడు ” ఏం చెయ్యమంటావు?” అన్నట్టు రాముడి కేసి చూశాడు. అది గమనించి భరతుడు తానే స్వయంగా దర్భలు తెచ్చి వాటిని పర్ణశాల వాకిలికి అడ్డంగా పక్క వేసుకుని పడుకున్నాడు.

అది చూసి రాముడు భరతుడితో, ‘నాయనా, ఈ పనిచేసేవారు. అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు. ఇది క్షత్రియులు చేసేపనికాదు. అదీగాక నేను నీ కేమి ద్రోహం చేశానని వాకిలికి అడ్డం పడుకుంటావు? లే, అయోధ్యకు తిరిగివెళ్ళి పో,” అన్నాడు.

భరతుడు దర్భల మీది నుంచి లేవ కుండానే చుట్టూ మూగిన జనాన్ని చూసి, “మీరందరూ ఊరుకుంటారేం ? రాముడికి చెప్పరేం ?” అని అడిగాడు.

“రాముడు తండ్రి ఆజ్ఞ పాలించితీరా అని పట్టుపడుతున్నప్పుడు చేసేదేముందీ?” అన్నారు వారు.

భరతుడు రాముడి ఆజ్ఞానుసారం లేచి జలం స్పృశించి రాముణ్ణి తాకి అందరి తోనూ ఈ విధంగా అన్నాడు. “మీరంతా వినండి. నేను నా తండ్రిని రాజ్యం కోరలేదు, నా తల్లిని కోరలేదు. రాముడడవికి వెళ్ళటం నాకు సమ్మతంకాదు. రాముడి బదులు నేను పద్నాలుగేళ్ళూ వనవాసం చేస్తాను, నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి. తండ్రి ఆజ్ఞ పాలించి నట్టవుతుంది.”

ఈ మాటలు విని రాముడు నిర్ఘాంతపోయి, “ఇలా రాజ్యాన్ని, వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది? నేను వనవాసం చెయ్యటం మాని రాజ్యం ఏలటం కన్న ఘోరమైన తప్పు ఉండదు. ఈ పధ్నాలుగేళ్ళూ పూర్తికాగానే నేనూ భరతుడూ కలిసి రాజ్యంచేస్తాం,” అన్నాడు

చుట్టూ చేరిన వారు రాముడి మాటలకూ, భరతుడి మాటలకూ కూడా సంతోషిం చారు. వారు భరతుడితో, “నాయనా, రాముడు చెప్పినట్టు చెయ్యి. అతన్ని తండ్రి రుణం తీర్చుకోనీ!” అన్నారు. రాముడు సంతోషించాడు గాని భరతుడి గుండెలో రాయిపడింది.

చివర కతను రాముణ్ణి పాదుక లిమ్మని అడిగాడు. రాముడు పాదుకలను భరతుడికి ఇచ్చాడు. భరతుడు రాముడితో, “నీవు కాకపోతే నీ పాదుకులే లోకాన్ని రక్షిస్తాయి. నేను ముని వేషంతో, ఫలమూలాలు తింటూ, రాజ్యభారం ఈ పాదుకలకు అప్పగించి, ఊరి బయట ఉండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పధ్నాలుగేళ్ళూ దాటిన మర్నాడు నీవు రాకపోయావో, అగ్నిప్రవేశం చేస్తాను.” అన్నాడు.

రాముడు సరేనని, భరతుణ్ణు కౌగలించుకుని, “నీ తల్లిని రక్షించు. ఆమె మీద ఆగ్రహించావో నా మీదా, సీత మీద ఒట్టు! ఇక వెళ్ళి రా,” అంటూ కన్నీరు కార్చాడు.

భరతుడు బంగారు అలంకారాలు గల రామపాదుకలను పూజించి, రాముడికి ప్రదక్షిణం చేశాడు. తరవాత రాముడు తన తల్లులనూ, ఇతరులనూ సాగనంపి వర్ణ శాలకు తిరిగివచ్చాడు.

భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని, శత్రుఘ్నుడితో సహా రథమెక్కాడు. వసిష్ఠ వామదేవ జాబాలి మొద లైన వారు ముందు సాగారు. భరతుడు సపరివారంగా తిరుగుప్రయాణంలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనతో జరి గినదంతా చెప్పి, ఆయన వద్ద సెలవు పుచ్చు కున్నాడు. శృంగిబేరపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య వీధులకుండా రథ మెక్కి వస్తుంటే అతనికి నగరం నిర్జీవంగా కనబడింది. అతను శత్రుఘ్నుడితో, “అయోధ్య కళ అంతా. పోయింది,” అన్నాడు.

భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వసిష్ఠుడు మొదలైన వారితో, “రాముడు లేని అయోధ్యలో ఉండలేను, నందిగ్రామానికి పోయి, అక్కడినుంచే రాజ్యం చూస్తూ రాముడి రాకకు ఎదురు చూస్తూ ఉంటాను,” అన్నాడు. ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు.. భరతుడు తల్లుల దగ్గర సెలవు పుచ్చుకుని, శత్రుఘ్నుడితో బాటు రథమెక్కి, మంత్రులనూ, వసిష్ఠుణ్ణి వెంటబెట్టుకుని నంది గ్రామానికి బయలుదేరాడు.

తన వెంట రమ్మని అతను ఆజ్ఞాపించక పోయినప్పటికీ సేన కూడా అతని వెంట. నంది గ్రామానికి కదిలింది.

నందిగ్రామంలో పాదుకలకు శ్వేతచ్ఛత్రమూ ఇతర రాజమర్యాదలూ జరగా లని భరతుడు ఊత్తరు విచ్చాడు. తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టు కోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి, నారబట్టలు కట్టి, మునివేషం వేసుకుని నందిగ్రామంలో ఉండి కోసలదేశాన్ని పరిపాలించాడు. రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకలకు చెప్పుకునేవాడు. సామంతులు తెచ్చిన కానుకలను పాదుకలకు నైవేద్యం పెట్టేవాడు. రాముడికి జరగవలి సిన పట్టాభిషేకం ఈ విధంగా రామ పాదుకలకు జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *