సీతా రామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి వెల్లుట

రాముడు సీతా లక్ష్మణులతో బయలుదేరి అగస్త్య మహాముని తమ్ముడి ఆశ్రమానికి చేరాడు. ఆ సమయంలోనే రాముడు లక్ష్మణుడికి అగస్త్య మహిమ చెబుతూ వాతాపి, ఇల్వలుల వృత్తాంతం చెప్పాడు.

ఇల్వలుడూ, వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఎందరో బ్రాహ్మణులను మోసగించి చంపేశారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి, సంస్కృత భాషలో మాట్లాడుతూ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, “అయ్యా, ఇవాళ మా ఇంట శ్రాద్ధం. తమరు భోక్తగా దయచెయ్యాలి,” అని కోరే వాడు. నిజమేననుకుని బ్రాహ్మణులు వచ్చేవారు. ఈ లోపుగా వాతాపి మేకరూపం ధరించేవాడు. ఇల్వలుడా మేకను కోసి బ్రాహ్మణులకు పెట్టేవాడు. బ్రాహ్మణులా మేకను పూర్తిగా తిన్నాక ఇల్వలుడు, “వాతాపి, ఇక వచ్చెయ్యి,” అనేవాడు. అప్పుడు వాతాపి మేకలాగా అరుచుకుంటూ ఆ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకుని వచ్చేవాడు.

ఈ విధంగా వారు అనేక వేల బ్రాహ్మణులను చంపిన మీదట ఇల్వలుడికి అగస్త్య మహాముని తటస్థపడ్డాడు. ఇల్వలుడి కోరికపై ఆయన భోజనానికి వచ్చి అతడు పెట్టిన మేక మాంసం తిన్నాడు. ఆయన తృప్తిగా భోజనం చేసిన అనంతరం ఇల్వడుడాయనకు హస్తోదకం ఇచ్చి, “ఇక రా వాతాపి !” అని కేక పెట్టాడు.

అగస్త్యుడు నవ్వుతూ, “ఇంకెక్కడి వాతాపి? వాడప్పుడే జీర్ణమై, యముడి ఇంటికి చేరుకున్నాడు!” అన్నాడు. ఇల్వలుడు తన తమ్ముడు చచ్చాడని తెలిసి మండిపడి అగస్త్యుడిపైకి లేచి ఆయన చూపుల వేడికే బూడిద అయిపోయాడు.

రాముడి కథ చెప్పి లక్ష్మణుడితో, “అంత శక్తిమంతుడైన అగస్త్యులవారి తమ్ముడి ఆశ్రమం ఇది,” అన్నాడు. అప్ప టికే సూర్యాస్తమయమయింది. అగస్త్యుడి తమ్ముడు సీతా రామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు. వార్తా రాత్రి అక్కడే గడిపి, మర్నాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకుని అగస్త్యాశ్రమానికి బయలు దేరారు. దారిలో వారికి ఏనుగులు విరిచేసిన చెట్లు కనబడ్డాయి, మనోహరంగా పక్షులు పాడే పాటలు వినపడ్డాయి. అగస్త్యాశ్రమం పరిసరాలు అరణ్యంలాగా లేక ప్రశాంతంగానూ, అందంగానూ ఉండటం రామ లక్ష్మణులు గమనించారు.

రాముడు లక్ష్మణుడితో, “అగస్త్యుడు మహిమాన్వితుడు. సూర్యుడి మార్గానికి అడ్డంగా పెరుగుతూ వచ్చిన వింధ్యపర్వతాలను నిగ్రహించాడు. ఆయన దక్షిణదేశానికి వచ్చి స్థిరపడినాక, దక్షిణానికి అగస్త్యుడి దిక్కనే పేరు వచ్చింది. ఆయన ఆశ్రమం అతి పవిత్రమైనది; అందులో క్రూరులూ, వంచకులూ, పావులూ నివసించ లేరు. అలాటి చోటికి చేరుకున్నాం. లక్ష్మీణా, నీవు ముందు వెళ్ళి, నేనూ సీతా వస్తున్నామని అగస్త్యులవారితో చెప్పు,” అన్నాడు.

లక్ష్మణుడు ఆశ్రమం ప్రవేశించి, అగస్త్యుడి శిష్యులలో ఒకణ్ణి పట్టుకుని, “నేను దశరధ మహారాజు కొడుకును, లక్షణ్ముడనే వాణ్ణి. నేనూ, మా అన్న అయిన రాముడూ, ఆయన భార్య అయిన సీతా అగస్త్యులవారి దర్శనార్థం వచ్చాం. కనుక వారితో ఈ సంగతి చెప్పు,” అన్నాడు.

అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగస్త్యుడికి శిష్యుడీ వార్త చెప్పాడు. వెంటనే అగస్త్యుడు, “వారు వస్తారని అనుకుంటూనే ఉన్నాను. వారు ఆశ్రమంలోకి రాదగిన వారే, నీవు అప్పుడే తీసుకురావలిసింది. వెంటనే వెళ్ళి వారిని లోపలికి తీసుకురా,” అన్నాడు. శిష్యుడు గబగబా వచ్చి లక్ష్మణుడితో, “ఆ సీతారాము లెక్కడ ఉన్నారు? వెంటనే రమ్మనండి,” అన్నాడు.

ఇద్దరూ కలిసి ఆశ్రమ ద్వారం వద్దకు వెళ్ళారు. శిష్యుడు వినయంగా సీతా రాములకు స్వాగతం చెప్పి లోపలికి తీసుకు వచ్చాడు. అగస్త్యుడు సూర్య తేజస్సుతో వెలిగిపోతూ శిష్యులతో సహా ఎదురు వచ్చాడు. అగస్త్యుణ్ణి రాముడు ఆ చేతనే గుర్తించాడు. సీతారామ లక్ష్మణులాయన కాళ్ళకు వందనం చేసి, చేతులు మోడ్చి నిలబడ్డారు.

అగస్త్యుడు వారిని అతిథులుగా స్వీకరించి, ఆసనాలూ, అర్ఘ్యపాద్యాలూయిచ్చి, కందమూలఫల భోజనం వారికి పెట్టాడు.

అగస్త్యుడి వద్ద ఒక అపూర్వమైన ధను వున్నది. అది విష్ణువుది, బంగారు నగిషీలు కలిగి, రత్నాలు పొదిగినది. దానిని విశ్వ కర్మ తయారుచేశాడు. బ్రహ్మదేవుడిచ్చిన ఒక అపూర్వమైన బాణమూ, ఇంద్రుడిచ్చిన రెండు అక్షయబాలు తూణీరాలూ, బంగారు ఒరగల ఒక ఖడ్గమూ ఉన్నాయి. వీటి నన్నిటినీ అగస్త్య మహాముని రాముడికి కానుకగా ఇచ్చేశాడు.

తరవాత ఆయన రాముడితో, “నాయనా, నాకు నమస్కారం చెయ్యటానికి మీరు ఇంత దూరం వచ్చారు, చాలా సంతోషం. మీరంతా బడలి ఉంటారు. అతి సుకుమారి, కష్ట సమయంలో కూడా భర్తను విడవని మహా పతివ్రత, సీత మరింత అలసి ఉంటుంది. కనుక మీరంతా విశ్రాంతి తీసుకోండి,” అన్నాడు.

“నా అరణ్యవాస దీక్ష పూర్తి అయేదాకా మేము ఆశ్రమం నిర్మించుకుని నివసించటానికి యోగ్యమైన స్థలం ఉంటే చెప్పండి.” అని రాముడు అగస్త్యుణ్ణి అడిగాడు.

“ఇక్కడికి రెండామడల దూరంలో పంచవటి ఉన్నది. నీరూ, దుంపలూ సమృద్ధిగా ఉన్నాయి. లేళ్ళుకూడా జాస్తి. అక్కడ నీవు ఆశ్రమం ఏర్పరచుకోవచ్చు. నీ వనవాసం చాలాభాగం అయేపోయింది. ఆ మిగిలినది కాస్తా పూర్తి కాగానే తిరిగి అయోధ్యకు వెళ్ళి సుఖంగా రాజ్యం చేసుకుంటావు. కావలిస్తే నీవు నా ఆశ్రమంలోనే ఉండవచ్చు. కాని నీకు వేరే ఆశ్రమంలో ఉండాలని ఉన్నట్టున్నది. అందుచేత పంచవటి పేరు చెప్పాను. అది అందమైన చోటు, సీతకు చాలా బాగుంటుంది. అదుగో, ఆ కనిపించే ఇప్ప చెట్ల సమూహానికి ఉత్తరంగా వెళితే ఒక మర్రిచెట్టు వస్తుంది. దాన్ని దాటి మరి కొంతదూరం పోతే ఒక ఎత్తు ప్రదేశం వస్తుంది. ఆ మిట్ట ఎక్కి చూస్తే ఒక పర్వతమూ, దాని పక్కన గోదావరీనది, దాని ఒడ్డున పంచవటి కనిపిస్తాయి,” అని అగస్త్యుడు చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *