లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోయుట
పంచవటిలో ఆశ్రమం కల్పించుకుని తమ పర్ణశాలలో సీతా రామ లక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు. హేమంత ఋతువు వచ్చింది. ఒకనాటి తెల్లవారుఝామున వారు ముగ్గురూ స్నానం చెయ్యటానికి గోదావరి వద్దకు పోతూ ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకోవటంలో లక్ష్మణుడు భరతుణ్ణి మెచ్చుకుని, అటువంటి వాడికి తల్లి అయికూడా దుర్మార్గురాలయినందుకు కైకేయిని నిందించాడు. రాముడు అడ్డం వచ్చి, ” కైకేయిని తిట్టటం మానేసి భరతుణ్ణి గురించే మాట్లాడు,” అన్నాడు. తాను భరత లక్ష్మణ శత్రుఘ్నులతోనూ సీతతోనూ కలిసి ఎప్పుడు రాజ్యం చేస్తానో గదా అని, రాముడు విచారించాడు.
వారు ముగ్గురూ గోదావరిలో స్నానాలు చేసి, ఆశ్రమానికి తిరిగి వచ్చి, ఉదయం చేయవలసిన కర్మకాండ అంతా ముగించు కుని పర్ణశాలలో కూచుని ఉండగా అటుగా ఒక రాక్షస స్త్రీ వచ్చింది. ఆమె రావణుడి చెల్లెలైన శూర్పణఖ. దాని ముఖం వికారం, దాని కొక పెద్ద పొట్ట, ఎర్రని జుట్టూ, భయంకరమైన గొంతూ ఉన్నాయి. వయసు మళ్ళినది. ఆ అనాకారి రాముణ్ణి చూస్తూనే మోహించింది. ఆమె రాముణ్ణి పలకరిస్తూ, “వేషం చూడబోతే మునివి. వెంట ఆయుధా లున్నాయి, భార్య ఉన్నది. నీవు మా రాక్షసుల దేశాని కెలా వచ్చావు?” అన్నది.
రాముడు మంచిగా ఆమెకు తన వాస్తవ వృత్తాంతం చెప్పాడు. సీత సంగతి కూడా చెప్పి అతను, ” ఇంతకూ నీ వెవరు? ఎవరి కుమార్తెవు ?” అని అడిగాడు.
“నా పేరు శూర్పణఖ. కామరూపినిని, ఒంటరిగా అరణ్యమంతా తిరుగుతూంటాను. నీవు రావణుడి పేరు వినే ఉంటావు. గొప్ప బలపరాక్రమాలు గలవాడు; విశ్వవసుడి కుమారుడు; రాక్షసరాజు. అతడు నా అన్న. ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడు కూడా నా సోదరుడే. విభీషణుడు నా సోదరుడే గాని, అతడికి రాక్షస లక్షణాలు లేవు. మహా పరాక్రమవంతులు ఖరదూషణులు నా సోదరులు. నిన్ను చూస్తుంటే ఈ నా వారందరినీ వదిలేసి నీకు భార్యగా ఉండిపోవాలనిపిస్తున్నది. నేను శక్తిగల దాన్ని. ఈ సీతను విడిచిపెట్టి నన్ను కట్టుకో. ఈమె వికారంగా ఉంది; కురూపి, నీకు తగదు. మనిద్దరికీ ఈడూ జోడూగా ఉంటుంది. మనం హాయిగా ఈ దండ కారణ్యమంతా విహరించుదాం,” అన్నది శూర్పణఖ.
రాముడు శూర్పణఖతో, ” నా కొక భార్య ఉండనే ఉన్నది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం కూడానూ. నీవు చూడబోతే గొప్ప వంశానికి చెందినదానివి. నీకు సవతి ఉండటం ఉచితం కాదు. ఇతను, చూడు, నా తమ్ముడు. అందగాడు, పరాక్రమవంతుడు, భార్యను వెంటపెట్టుకు రాకుండా వచ్చి, బ్రహ్మచారిగా ఉంటున్నాడు. ఇతన్ని కట్టుకున్నావంటే నీకు సవతి పోరు తప్పుతుంది,” అన్నాడు.
శూర్పణఖ వెంటనే రాముణ్ణి వదిలి లక్ష్మణుడి వద్దకు వెళ్ళి, తనను భార్యగా చేసుకోమన్నది.
లక్ష్మణుడు నవ్వుతూ, “అయ్యో, ఎంతో సుకుమారివి. నేనే సేవకుడిలాగా జీవి స్తున్నాను. నన్ను పెళ్ళాడితే నీవు కూడా దాసీదానిపై పోతావు. నా యజమాని రాముడు. అతనికే రెండవ భార్యవుగా ఉండటం మంచిది. నీ వంటి సుందరాంగిని పెళ్ళాడినాక రాముడు తన మొదటి భార్యను వదిలేస్తాడు. ఎందుకంటే, ఆమె వికారంగా ఉంటుంది. అంతేకాక ముసలిది,” అన్నాడు.
రామ లక్ష్మణులు తనను వేళాకోళం పట్టిస్తున్నారని తూర్పణఖ గ్రహించలేక పోయింది. ఆమె రాముడి దగ్గరికి పోయి, “ఈ ముసలి కురూపిని కట్టుకుని నా అందాన్ని కాలదన్నుతున్నావు. దీన్నిప్పుడే తినేస్తాను. ఆ తరవాత సవతి బెడద లేకుండా మనిద్దరమూ సుఖంగా ఉండవచ్చు,” అని చెప్పి సీత మీదికి వెళ్ళింది. సీత భయపడి పరిగెత్తితే శూర్పణఖ ఆమె వెంట పడింది.
రాముడు లక్ష్మణుడితో, “దుష్టులతో పరిహాసం ఎంత చెడ్డదో చూశావా? సీతకు అపాయం రాకుండా చూడు. ఈ శూర్పణఖను అంగహీనంగా చెయ్యి,” అన్నాడు. లక్ష్మణుడు రాముడి పక్కనే ఉన్న కత్తి తీసుకుని శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసేశాడు.
శూర్పణఖ భాధతో పెద్దపెట్టున అరిచి, తాను వచ్చిన దారినే మహారణ్యంలో పడి పారి పోయింది.