వేలంవెట్టి కథ

అబ్బాయిలూ, అమ్మాయిలూ! మీకు ఈ కథ తెలుసునా? పోనీ నే చెప్తా వినండి. అనగా, అనగా, ఒక ఊరిలో ఒక రాజు, మంత్రివారూ ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒకరోజు రాజు మంత్రిని పిలిచి, “వేలం వెట్టి అంటే ఏమిటి?” అని అడిగాడు.

మంత్రి ఏమి చెప్పుతాడు? అందుకని రాజుగారితో “రెండు రోజులు గడువు ఇవ్వండి, చూపిస్తాను” అన్నాడు. మర్నాడు పొద్దున్నే లేచి, స్నానం చేసి, విభూతి పెట్టుకుని, ఊరి చివర కంచర గాడిదలు ఉండే చోట ఒక గాడిదకి మూడు ప్రదక్షిణాలు చేసి, ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు. ఆ గాడిద కలవాళ్లు, ఊరిలో ఉన్న ఇతరులు, “యేమిటి బాబూ, ఇలా చేస్తున్నారు?” అని అడిగారు.

మంత్రివారు, “ఈ గాడిద మధుర నుంచి వచ్చింది. దీనికాళ్లు వసుదేవుడు పట్టుకున్నాడు, అందుకే పుణ్యం వస్తుందని ఇలా చేశాను” అని అన్నారు. ఆ మాట విని ఊరు అంతా ఒక్కొక్కరుగా వెళ్లి మూడు ప్రదక్షణాలు చేసి, దాని వెంట్రుక ఒకటి పీకి చెవిలో పెట్టుకోవటం మొదలుపెట్టారు.

ఇలా చేయటంతో ఆ గాడిద బొచ్చు అంతా ఊడి, చావుకి సిద్ధం అయింది. ఈ విషయం రాజుగారికీ తెలిసింది. మనం కూడా చూద్దామని, రాజుగారు వెళ్లి మూడు ప్రదక్షణాలు చేసి, ఒక వెంట్రుక పీకారు.

దాంతో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద కలవాళ్లు, “మా బ్రతుకు ఈ గాడిదతోనే ఉంది. మీ చేతిలో చచ్చిపోయింది, దీనికి ఖరీదు ఇవ్వండి” అని చెప్పారు. అప్పుడు రాజు, మంత్రిని పిలిచి, “ఇది ఏమిటి ఇలా జరిగింది?” అని అడిగాడు.

అప్పుడు మంత్రి అన్నాడు, “మీరు వేలం వెట్టి అంటే ఏమిటి అని అడిగారు. దానికి నోటితో సమాధానం చెబితే మీకు నచ్చేది కాదు. అందుకే ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను” అని అన్నారు. రాజు, మంత్రితెలివికి సంతోషించాడు.

గాడిదవాళ్లకు కొంత సొమ్ము ఇచ్చి, వాళ్లను పంపించారు.

కథ కంచికి, మనం ఇంటికి.

Leave a Reply