నవ్వితే నవరత్నాలు

అనగా అనగా వొక వూళ్లో వొక అవ్వ వుండేది. ఆ అవ్వకు యిద్దరు మనమరాళ్లు, వొకతె కూతురుబిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురుబిడ్డ పేరు చండి. కొడుకు బిడ్డపేరు గౌరి, గౌరి చక్కటి చుక్క. కాని అవ్వ ప్రాణమంతా చండిమీదనే. గౌరి పొడ అంటేనే గిట్టేదిగాదు. పాచిపని దగ్గరనించి ఇంటి పనులన్నీ గౌరిచేతనే చేయించేది.

వొకరోజున గౌరి భావికి నీళ్లకి పోయింది. అక్కడికి వొక దేవకన్య “ముసలి దాని రూపంలో వచ్చి “అమ్మా, అమ్మా, దప్పికగా వున్నది. కాసిని నీళ్లు పొయ్యమ్మా” అని అడిగింది.

గౌరి “అలాగే పోస్తాను అవ్వా. వుండు” అని బిందె తీసుకెళ్లి అవ్వకు నీళ్లుపోసింది. ముసలిది సంతోషించి “అమ్మా, నువ్వు మంచి పిల్లవి. నీకొక వరం యిస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు వొక్కొక్క మాణిక్యం రాల్తుంది, ఇక నువ్వు నవ్వావా, నవరత్నాలు రాల్తయ్యి” అని దీవించింది.

గౌరి యింటికి చేరేసరికి రోజూకంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ల అవ్వ తిట్టింది.

“అవ్వా, అవ్వా ! నాకు భావి దగ్గిర వొక ముసలిది కనపడి మంచినీళ్లు పొయ్యమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది” అన్నది గౌరి.

గౌరి యీ మాటలనటమేమిటీ, నోట్లో నించి మాణిక్యాలు టపటప రాలటమేమిటీ వొక్కమాటుగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యంవేసి “యిదేమిటి తల్లీ! మాణిక్యాలు పడుతున్నయ్యే నీ నోటి నించి, ఇది నిజమా, కలా?” అని అడిగింది. అవ్వ గౌరిని ‘తల్లీ’ అని ముద్దుగా పిలవటం యిదే మొదటిసారి.

గౌరి భావిదగ్గిర జరిగిందంతా అవ్వతో చెప్పింది. “అరే, విచిత్రంగావుందే! అయితే మన చండినికూడా నీళ్లకు పంపాలి” అని అవ్వ చండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది.

చండి బిందె, చెంబు తీసుకుని వొయ్యారంగా నూతికి వెళ్లింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిదివచ్చి దాహానికి నీళ్లు అడిగింది.

చండి కోపంతో “పో, పో, దరిద్రపు ముండా! నేను, యిక్కడికి నీకు వూరికే నీళ్లు పొయ్యటానికి రాలేదు. మా గౌరికి యిచ్చినట్లుగా నాకూ వొక వరంయిస్తే నీకు నీళ్ళు “పోస్తాను” అన్నది.

“అలాగే నమ్మా! ఆ వరమే నీకూ యిస్తాను. నాకు నీళ్ళు పొయ్యి” అన్నది ముసలిది.

చండి నీళ్ళు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది. చండికి నీళ్ళుపొయ్యటం చేతకాలేదు. ముసలిదాని ముఖమూ, గుడ్డలూ అన్నీ తడిపింది.

ముసలిదానికి కోపం వచ్చి ఓ, చండి! నువ్వు మాట్లాడి నప్పుడల్లా నీ నోట్లోనించి కప్పలు పడతై ఇక నవ్వావా, తేళ్ళూ, మండ్రగబ్బలూ, పాములూ పడతై” అని మాయమైపోయింది.

పాపం, చండి యేడుపు మొహంతో యింటికి తిరిగొచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది; కాని వొక్కదానికీ చండి జవాబు చెప్పదు ! అవ్వకు కోపంవచ్చి “దున్నపోతా, ఎన్ని పిల్చినా మాట్లాడవ్. నీ నోటి రత్నాలు రాల్తాయనా” అని ఫెడీ ఫెడీ- రెండుమూడు దెబ్బలేసింది. చండికి కూడా కోపంవచ్చి “ముసలిముండా. నన్ను కొడ్తావా, పై గా భావికి పంపి….” అన్నది చండి ఈమాట లనడమేమిటి; కప్పలు నోట్లో నుంచి గబ గబ పడటమేమిటి, రెండూ వొక్కసారిగా జరిగినై.

“ఇదేమిటే?” అన్నది అవ్వ.

” యిదే ఆ ముసలి ముండ నాకిచ్చిన వరం” అన్నది చండి.

చండి నోటినించి కప్పలు మళ్లీ గబగబ పడినై,

ముసలిదానికి దిగులు పట్టుకుంది. చండిని ఏమిచేద్దామా అని ఇలావుండగా, వొక రోజున ఆ దేశపు రాజుకొడుకు అవ్వ యింటి ముందుగా గుఱ్ఱంమీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధిపుట్టింది. అతను ఎకాయకిని యింటికి తిరిగొచ్చి మంత్రిని పిలిచి, “ఫలాని వూల్లో, ఫలాని యింట్లో వొక చక్కటి పిల్ల వుంటుంది. నువ్వు పల్లకీ, నగలు, గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి” అన్నాడు.

మంత్రి మంచి నగలు, గుడ్డలు, పల్లకీ తీసుకుని ఆవూరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లిసంగతిచెప్పి పిల్లని పంపమని అడిగాడు.

అవ్వకు భలే సంతోషం వేసింది. కాని దానికొక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చండిని పంపితే తనపీడ వదుల్తుందను కుంది. అనుకుని, రాజుగారు పంపిన గుడ్డలు చండికి కట్టి, నగలు పెట్టి మునుగు వేసి చండిని పల్లకి ఎక్కించింది. ఎక్కించి చండి చెవిలో “జాగ్రత్త! పెళ్లి అయిందాకా మాట్లాడమాక, ముసుగుకూడా తియ్యబోకు” అని రహస్యంగా చెప్పింది.

మంత్రి చండిని పల్లకీలో రాజుగారి దగ్గరకు తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగినై.

చండి పెళ్లిరోజు వరకూ మాట్లాడకుండా, ముసుగు తియ్యకుండానే జరిపింది. కాని, పెళ్లిపీటలమీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు యేవో మంత్రాలు అనమన్నాడు. చండి మరిచిపోయి అన్నది. అనటమేమిటీ, కప్పలు నోట్లోనించి పడటమేమిటీ వొక్కమాటే జరిగినై. చండికి యిది చూచేసరికి నవ్వొచ్చింది

పక పకా నవ్వింది. యింకేం, తేళ్లూ, పాములూ, మండ్రగబ్బలు కుప్పలు కుప్పలుగా పడ్డయి. పురోహితుడూ పెళ్లి పెద్దలూ అంతా పారిపోయారు.

రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటలు మీదనుంచి లేచి ఎకాయకిని చండి అవ్వ దగ్గిరకు పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెలబుట్ట దగ్గర కూర్చుని మెక్కుతున్నది. అక్కడే గౌరికూడా వంట పనులు చేస్తున్నది. రాజు కోడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యంవేసింది. “నువ్వు యిక్కడికెట్లా వచ్చావ్?” అని అడిగాడు గౌరిని.

“నేనుకూడా మా అవ్వకు వొక మనమరాల్నే” అన్నది గౌరి వినయంగా, గౌరి యీమాటలనగానే నోటివెంట రత్నాలు రాలినై.

అప్పుడు రాజు కొడుక్కి అవ్వచేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిల్చి, “ఈ అవ్వను, దాని మనమరాల్ని తీసికెళ్లి బుర్ర గొరిగించి గాడిదనెక్కించి వూరిచుట్టూ మూడుమాట్లు తిప్పి ఊరి బైటికి వెళ్లగొట్టు” అని ఆజ్ఞాపించాడు.

ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరి నవ్వటమేమిటీ, నవ రత్నాలు రాలటమేమిటీ వొక్కసారే జరిగినై. గౌరి అవ్వను, చండిని వొదిలి పెట్టమని బ్రతిమాలింది. రాజుకొడుకు గౌరి మాటప్రకారం వాళ్లని వొదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగూ వేసి అంగరంగ వైభోగంగా గౌరిని పెళ్లిచేసుకున్నాడు.

గౌరి రాజుకొడుకు నూరేళ్ళు బతికి హాయిగా రాజ్యమేలారు.

Leave a Reply