తేనెటీగల సహయం

పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురు ఉండేది. ఆ పిల్ల అందం దేశదేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతోమంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని ఆశపడేవారు. వాళ్లలో సింహళ దేశపు రాజకుమారుడు సింహకేతు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగుచేసి పెద్ద పెద్ద వోడలలో జావా దేశం మీదికి దండెత్తాడు.

యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు, సామంతులు యుద్ధం చేసి సింహకేతును జావాలో కాలుపెట్టకుండానే పారదోలదామని సూచించారు. కానీ, యోగదత్తుడు అంగీకరించలేదు – “రాజులు యుద్ధం చేయటం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపడేది ప్రజలే. కాబట్టి అతనికి ఈ ప్రజల్ని అప్పగించేస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను నా భార్యను, పిల్లను తీసుకుని అడవిలోకెళ్లి ఉంటాను” అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్లిపోయాడు.

మంత్రులు, సామంతులు, ప్రజలు అతనితో పాటు అడవికి వెళ్లారు. సింహకేతు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కూడా కనిపించలేదు. అతను నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడు ఎక్కడ ఉన్నాడో చెప్పేవారు లేరు.

యోగదత్తుడు దట్టమైన అడవికి వెళ్లి, ఒక గుహలో తన భార్యా, బిడ్డలతో ఉండసాగాడు.

ఒక రోజు ఉదయాన యోగదత్తుడు తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు. దారిలో తామరకొలను ఒకటి ఉంది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వలపన్ని ఉంది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుంది. యోగదత్తుడికి జాలి వేసి, ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలు చోటుకి వెళ్లి కూర్చుని తపస్సు చేయటం మొదలు పెట్టాడు. అతనికి ఆ సమయంలో దేవి ప్రత్యక్షమై, “ఓ రాజా! తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం వూరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడతాయి. చెట్ల మానులతో ఒక కోట కట్టు, జావా దేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి” అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగా కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో నివసించాయి. అతని ప్రజలూ ఆ కోటలోనే ఉండసాగారు.

కొంతకాలానికి యోగదత్తుడు అక్కడ ఉండే విషయం సింహకేతుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతురిని ఎత్తుకుపోదామని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కానీ అతన్ని ఎవ్వరూ ఎదిరించలేదు. సింహకేతు కోటను ధ్వంసం చేశాడు. అంతే, తేనెటీగలు ఒక్కసారిగా జుమ్మన లేచాయి. సింహకేతును, అతని సైన్యాన్ని, గుర్రాలను చచ్చేటట్టు కుట్టాయి. పాపం, సింహకేతు మొహం అంతా వాచి, కళ్ళు కనబడక, గుర్రం మీదనుంచి పడిపోయాడు.

యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకెళ్లి, గాయాలు మాన్పి, తన కూతురిని ఇచ్చి పెళ్లిచేశాడు. సింహకేతు బుద్ధి తెచ్చుకుని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు.

Leave a Reply