తలలేని బంట్రోతు

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఎఱ్ఱచీమ వుంది. ఒకరోజున అది ఏట్లో స్నానానికి వెళ్ళింది. స్నానంచేస్తూ చేస్తూ పాపం కాలుజారి ఏట్లో పడిపోయింది. అది నీటిలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి చివరికి వొక వంతెనకి అడ్డం పడింది. అడ్డం పడటంతోటే యిటు నీరు అటు పోకుండా నిలిచిపోయింది. యీప్రమాదం తెచ్చిపెట్టిన దుర్మార్గు డెవడాఅని ఆఊరివాళ్లు కత్తులూ, కఠార్లూ, ఈటెలూ తీసుకుని ఏటి దగ్గిరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. వంతెన కడ్డంగా పడివున్న చీమని చూడగానే వాళ్ళకి వొళ్ళు మండిపోయింది. ఎవరి శక్తికొద్ది వాళ్లు కత్తులతో ఈటెలతో చీమక్కగార్ని చీల్చి చెండాడేరు. అప్ప టికీ దానిమీద కసిపోని కొంతమంది యోధులు, దానిచర్మం వొలిచి పూరులేని పాటిమీద యెండేసి యెవరిళ్లకి వాళ్లు చేరుకున్నారు.

తెల్లారే సరికల్లా ఆపాటి మీద వేరులేని గరిక మొలుచుకొచ్చింది. | కాళ్లులేనిలేడి అటుపోతూ ఈ గరికని తింటానికొచ్చింది. తలలేని బంట్రోతొకడు కత్తిలేని వర తీసుకుని ఆ లేడి వెంటబడ్డాడు. దోవలో  వాడికి వాడితాత తద్దినం జ్ఞాపకం వచ్చింది. ఆ చుట్టుపక్కల చూస్తే వాడికి అడుగులేని కుండ కన్పించింది. అదితీసుకుని దాంట్లో రెండు శేర్లు బియ్యం పోసి పొయ్యి పెట్టటానికి రాళ్లకోసం చూచాడు. రెండు రాళ్ళుమాత్రం కనబడ్డాయి. మూడోరాయికి బదులు తన మోకాలుబెట్టి వండాడు అన్నం. వాడి ఖర్మంకాలి పోసిన మూడు శేర్లలో రెండు శేర్లు కాలిపోయినై, వొక శేరు మాడి మసి అయింది. ఏంజేస్తాడు? ఈమసే వడ్డిద్దామనుకుని బ్రాహ్మణార్ధానికి ముగ్గురు బ్రాహ్మల్ని పిలిచాడు. ఇద్దరు రామన్నారు. వొకడు అంతే చిక్కలేదు. సరే తాత తద్దినం ఇలా తగలడింది, యిక వేట ఎలావెలగబెట్టానో అనుకుంటూ లేడికోసం బయలుదేరాడు. అనుకున్నంతపనీ అయింది. గరికమేసి లేడి ఎటో పోయింది! పాపం, కాళ్లీడ్చుకుంటూ కాళీచేతుల్తో ఇంటికిచేరాడు.

మన బంట్రోతుకి మూడు ఎకరాల పొలముంది. అందులో మూడుపుట్లు వడ్లు పండుతాయి. వాటిలో రెండుపుట్లు తాలు, ఒకపుట్టి తప్పలు. ఇక వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి.

తాలుపండినా తప్పలుపండిన తాసిల్దారుకు శిస్తు చెల్లించక తప్పేదేముంది। ఆఏడు పండిన పంటకి మన బంట్రోతు మూడు డబ్బులు శిస్తు కట్టాడు. అందులో రెండుడబ్బులు చెల్లలేదు ; ఒకటి మారలేదు. తాసిల్దారుకి కోపంవచ్చి ‘జుట్టుపట్టుకుని ఈడ్చుకురా వాణ్ణి’అని తన జమానుని పంపించాడు. జమానువచ్చి మన బంట్రోతును పట్టుకుపోయాడు.

తాసిల్దారుగారు బంట్రోతును మూడుగుద్దులు వేయమని ఆర్డ రిచ్చారు. కాని మనబంట్రోతు పంటపండి, అందులో రెండు గుద్దులు తగలలేదు. ఒకటి తప్పిపోయింది. బ్రతుకుజీవుడా అని మళ్లీ కొంప చేరుకున్నాడు. వాడికి ప్రతి ఏటా యిలాగే జరుగుతుంటుందిట. చూశారా ఎంత అదృష్టవంతుడో !

Leave a Reply